Breaking News

అన్నదాతకు గుండెకోత

Published on Mon, 05/05/2025 - 04:41

సాక్షి, అమరావతి/నెట్‌వర్క్‌: వరి రైతుల పాలిట  చంద్రబాబు ప్రభుత్వం పెనువిపత్తుగా పరిణమించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం కురిసిన కుండపోత వర్షాలకు ధాన్యం రాశులు, కోత కోసిన వరి పనలు నీటమునిగాయి. ఇతర పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయ­కపోవడంతో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కాకినాడ జిల్లాలో 7 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం తడిసిపోయినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమి­కంగా అంచనా వేసింది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పనల మీద వరి, నీట మునిగిన ధాన్యపు రాశుల్ని చూసి రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉప్పల­గుప్తం, అయినవిల్లి, ఐ.పోలవరం మండలాల్లో ధాన్యం రాశులు, ధాన్యం బస్తాలు వర్షాలకు తడిసిపోయాయి. ఈ మండలాల్లో సుమారు 600 ఎకరాల్లో పంట పనల మీద ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని భద్రపరుచు­కోవడానికి నానా అవస్థలు పడ్డారు. చేలలోనే ధాన్యం రాశులు ఉండటంతో.. వాటిపై బరకాలు కప్పినప్పటికీ కింది భాగంలో ధాన్యం తడిసిపోయిందని రైతులు వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రభుత్వం 6 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలుకు మాత్రమే అనుమతి ఇవ్వగా.. ఇప్పటివరకు కేవలం సుమారు 4.40 లక్షల మెట్రిక్‌ ధాన్యం మాత్రమే అధికారులు కొనుగోలు చేశారు. మరో దాదాపు 5.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉంది. సంచులు లేకపోవడం, ధాన్యం కొనుగోళ్లు నిలిపి­వేయడంతో కల్లాల్లోనే ధాన్యం మిగిలిపోయింది.

ప్రభుత్వ నిర్లక్ష్యమే కొంప ముంచింది
ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులను నిలువునా ముంచేసింది. గడిచిన వారం రోజులు రాష్ట్రవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ వర్ష సూచనపై తీవ్ర హెచ్చరికలు చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర వీడలేదు. ఫలితంగా ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కల్లాల్లోని ధాన్యం తడిసిముద్దయింది. కళ్లెదుటే కష్టార్జితం నీటిలో నానిపోతుంటే రైతులు నిస్సహాయ స్థితిలో కన్నీరు మున్నీరుగా విలపించారు. ధాన్యం రాసులపై కనీసం కప్పడానికి పట్టాలు కూడా లేని దయనీయస్థితిలో ధాన్యం నింపడానికి సంచులు లేని దుస్థితిలో ఉరుకులు పరుగులు తీశారు. 

నేలవాలిన రైతు ఆశలు
ప్రస్తుత వాతావరణ మార్పులతో తడిసిన ధాన్యం రంగు మారడం, మొలకలొచ్చే ప్రమాదంతో పాటు ముక్క విరుగుడు సమస్య తలెత్తే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం ధాన్యం సేకరణ ప్రారంభించినప్పటి నుంచి రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. రైతుసేవా కేంద్రాల్లోకి వెళ్లిన రైతులకు నిరాశ తప్ప ధాన్యం కొంటామనే మాట వినిపించట్లేదు. దళారులు, మిల్లర్లు పచ్చజెండా ఊపితేనే రైతు ధాన్యం లోడుకు మోక్షం లభిస్తుంది. ఇలా చేస్తే మద్దతు ధరలో 75 కిలో బస్తాకు రూ.300–రూ.450 దళారీకి, మధ్యవర్తికి ముట్టజెప్పాల్సి వస్తోంది. ఇదంతా ప్రభుత్వం దళారుల దందాకు గేట్లు బార్లా తెరవడంతోనే రైతులు మద్దతు ధర కోల్పోవాల్సిన దుస్థితి దాపురించింది.

ఇంత అరాచక వ్యవస్థను తట్టుకోలేని రైతులు రోడ్లపై నిరసనలకు దిగుతున్నారు. ఉంగుటూరులోని బొమ్మిడి సొసైటీ వద్ద ఆదివారం సాయంత్రం ధాన్యం పూర్తిగా కొనుగోలు చేసి ఆదుకోవాలంటూ ధర్నాకు దిగారు. ఏలూరు మండలం మల్కాపురం రైతు సేవా కేంద్రం వద్ద పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులు మద్దతు ధరను కోల్పోవడంతో పాటు ఆర్థికంగా భారాన్ని మోయాల్సి వస్తోంది. రోజుల తరబడి కల్లాల్లో ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు పట్టాలు, గోనె సంచులు, వాహనాలు, కూలీల ఖర్చులు అదనపు భారంగా మారుతోంది.

ధాన్యం సేకరణలో ప్రభుత్వం కపట నాటకాలు ప్రదర్శిస్తోంది. రైతుల నుంచి నేరుగా పంటను కొనుగోలు చేస్తున్నట్టు కలరింగ్‌ ఇవ్వడం తప్ప క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితులు కనిపించట్లేదు. కనీసం ప్రభుత్వం తరఫున ధాన్యం తరలించేందుకు వాహనాలు కూడా సమకూర్చలేని దుస్థితి. ఇక్కడా మిల్లరుపైనే ఆధారపడాల్సి వస్తోంది. రబీలో ధాన్యం దిగుబడులు 48 లక్షల టన్నులకుపైగా వస్తాయని వ్యవసాయ శాఖ అంచనా. కానీ, ప్రభుత్వం కొనుగోలు లక్ష్యం 13 లక్షల టన్నులే. ఈ క్రమంలోనే 60–70 శాతం మేర కోతలు పూర్తయినా.. చాలాచోట్ల రైతు సేవా కేంద్రాల్లో టార్గెట్లు అయిపోయాయని కొనుగోళ్లు నిలిపివేశారు.  

ఉద్యాన పంటలకు దెబ్బ
ఏలూరు జిల్లా నూజివీడు, చింతలపూడి తదితర నియోజకవర్గాల్లో మామిడి తోటల్లో కాయలు నేలరాలాయి. పలు ప్రాంతాల్లో అరటి పంట దెబ్బతింది. కృష్ణా జిల్లా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో 4 వేల ఎకరాల్లో మొక్కజొన్న వర్షానికి తడిసింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్న గింజ, కండెలు తడిసిపోవటంతో నాణ్యత దెబ్బతింటుందని, మార్కెట్‌లో ధర పడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గన్నవరం నియోజకవర్గం పరిసరా­ల్లో సుమారు 10 వేల ఎకరాల్లో మామిడి తోటల్లో కోతకు వచ్చిన మామిడి కాయ నేలరాలి రైతులకు నష్టం వాటిల్లింది. పెనమలూరు మండలం గోసాలలో అరటి తోటలు నేలవాలాయి. ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో అరటి, జూపూడిలంకలో కూరగాయ పంటలకు నష్టం వాటిల్లింది.

మైలవరం, రెడ్డిగూడెం మండలాల్లో మొక్కజొన్న, ధాన్యం తడిసిపోయాయి. గుంటూరు జిల్లా తాడేపల్లిలో అరటి రైతులకు నష్టం వాటిల్లింది. అరటి చెట్లు పడిపోయాయి. కల్లాల్లో పసుపు తడిసి­పోయింది. మొక్కజొన్న కంకులు తడిసి పోయాయి. బాపట్ల జిల్లాలో భారీ వర్షం, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. కొల్లూరు మండలంలో కురిసిన వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న పంట తడిసిపోయింది. రాయల సీమతో పాటు ఉత్తరాంధ్రలోని ఉద్యాన పంటలకు తీవ్ర దెబ్బతగిలింది. బొప్పాయి, దానిమ్మ, కూరగాయలు, మామిడి, అరటి, నిమ్మ, ఆయిల్‌పామ్‌ రైతులకు నష్టం వాటిల్లింది.

సుమారు 1,700 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక సమాచారం. కర్నూలులో బొప్పాయి, దానిమ్మ, శ్రీసత్యసాయి జిల్లాలో కూరగాయలు, అరటి, మస్క్‌మిలన్, మామిడి, నంద్యాలలో అరటి, బొప్పాయి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, పార్వతీపురం మన్యంలో అరటి, వైఎస్సార్‌ జిల్లాలో అరటి, మామిడి, కూరగాయలు, ప్రకాశంలో అరటి, బొప్పాయి, దానిమ్మ, అనంతపురంలో అరటి, మామిడి, బొప్పాయితో పాటు కూరగాయ పంటలు, పల్నాడులో బొప్పాయి, కూరగాయలు, చిత్తూరులో అరటి, మామిడి, బొప్పాయి, కొబ్బరి, ఏలూరులో నిమ్మ, ఆయిల్‌ పామ్‌ పంటలు దెబ్బతి­న్నాయి.  వ్యవసాయ పంటలకు ప్రాథమిక నష్టం జరిగినట్టు అధికారికంగా రిపోర్ట్‌ కాలేదని వ్యవసాయ అధికారులు చెప్పడం గమనార్హం.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)