తోడల్లుడు కావడమే అర్హతా?

Published on Sat, 06/21/2025 - 12:42

సాక్షి ప్రతినిధి, కాకినాడ: మిత్రభేదంతో సతమతమవుతున్న జనసేనకు పిఠాపురంలో కొత్త కుంపట్లు రాజుకున్నాయి. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ రూపంలో జనసేన ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ పెద్ద సవాల్‌నే ఎదుర్కొంటోంది. ఆయన రాజకీయాన్ని తట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు నానా తంటాలూ పడుతున్నారు. ఈ తలనొప్పి ఇలా కొనసాగుతూండగానే పులి మీద పుట్రలా నియోజకవర్గంలో పార్టీపై ఆధిపత్యం కోసం ‘గ్లాస్‌’మేట్స్‌ కుమ్ములాడుకుంటున్నారు. వారిని దారికి తెచ్చుకోలేక ఆ పార్టీ సతమతమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎన్నికై , ఉప ముఖ్యమంత్రి అయిన పవన్‌ కల్యాణ్‌ ఈ నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి పోతూంటారు. తమ్ముడి తోడ్పాటుతో శాసన మండలి సభ్యుడైన ఆయన అన్న, సినీ నటుడు నాగబాబు కూడా అదే మార్గం అనుసరిస్తున్నారు.

ఆయన నియోజకవర్గానికి వస్తే ఏదో ఒక కొత్త సమస్య రాజేసి పోతూంటారనేది బహిరంగ రహస్యమే. ఏరు దాటి తెప్ప తగలేసిన చందంగా.. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మపై పరోక్షంగా లేనిపోని విమర్శలు చేస్తూ నాగబాబు కొత్త తలపోట్లు తెచ్చి పెడుతూంటారు. పవన్‌ ఇక్కడి నుంచి పోటీ చేయాలని అనుకున్నప్పటి నుంచీ ఈ నియోజకవర్గంలో జనసేన బాధ్యతలను నాగబాబుకు వరుసకు తోడల్లుడైన మర్రెడ్డి శ్రీనివాస్‌కు అప్పగించారు. కోనసీమ జిల్లాలోని మండపేట నియోజకవర్గం ద్వారపూడికి చెందిన మర్రెడ్డి స్వతహాగా రాజకీయ నాయకుడు కాదు. రాజకీయాల్లో ఎటువంటి అనుభవమూ లేదు. అయినప్పటికీ ఆయనను నియోజకవర్గ ఇన్‌చార్జిని చేసినా, పవన్‌పై అభిమానంతో ఆ పార్టీ నేతలు, అభిమానులు మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.

తోడల్లుడు కావడమే అర్హతా?
గత ఎన్నికల్లో కూటమి గద్దెనెక్కి, పవన్‌ ఉప ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ పిఠాపురం ఇన్‌చార్జి పదవి కోసం జనసేనలో కుమ్ములాటలు మొదలయ్యాయి. పవన్‌, నాగబాబు అందుబాటులో లేకపోవడంతో నియోజకవర్గంపై ఆధిపత్యం చెలాయించాలనే ఆశావహుల జాబితా రోజులు గడిచేకొద్దీ చాంతాడులా పెరుగుతోంది. ఎవరి మట్టుకు వారే ఈ పదవి కోసం ఆరాటపడుతూ ప్రస్తుత ఇన్‌చార్జి మర్రెడ్డి మైనస్‌లపై ఫోకస్‌ చేస్తున్నారు. రాజకీయాల్లో అనుభవం లేకున్నా కేవలం నాగబాబుకు వరుసకు తోడల్లుడు కావడమే అర్హతగా ఇన్‌చార్జిని చేశారన్నది ఆ పార్టీ నేతలు మొదటి నుంచీ లోపాయికారీగా విమర్శిస్తున్నారు. 

దీనికి తగ్గట్టుగానే ఇప్పటి వరకూ మర్రెడ్డికి పైనుంచి కింది వరకూ అంతటి ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. ఈ నేపథ్యంలో జనసేన ఇన్‌చార్జిగా మర్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారిక, అనధికారిక కార్యక్రమాల్లో అవలంబిస్తున్న వైఖరిపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎంపిక చేసుకున్న కొందరికి మాత్రమే ఆయన పార్టీలో ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలున్నాయి. దీనిని ఆవిర్భావం నుంచీ పార్టీ వెన్నంటి నిలిచిన నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో, ఆ పార్టీలో సొంత సామాజికవర్గ నేతలే మర్రెడ్డికి తాజాగా కుంపటి రాజేస్తూండటం జనసేనలో హాట్‌టాపిక్‌గా మారింది.

విభేదాలకు ‘తొలి గంట’
గతంలో గొల్లప్రోలు మండలం చేబ్రోలు సీతారామస్వామి దేవస్థానం ఉత్సవాల సందర్భంగా తొలి గంట కొట్టే విషయంపై రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఆ సందర్భంగా మర్రెడ్డి ఒక వర్గానికి కొమ్ము కాయడం అప్పట్లో రచ్చరచ్చ అయ్యింది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కు చేబ్రోలులోని తన ఇంటిని ఓదూరు నాగేశ్వరరావు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన వర్గం మర్రెడ్డిని బహిరంగంగానే నిలదీసింది. దీనిని సాకుగా తీసుకుని చేబ్రోలులో పవన్‌కు ఇచ్చిన ఇంటిని కావాలనే ఖాళీ చేయించి, పార్టీకి, పవన్‌కు స్థానికంగా అడ్రస్‌ లేకుండా చేశారని ఓదూరు వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 ఇలా అనేక సమస్యలు ఉత్పన్నమైనప్పుడు మర్రెడ్డి సమయస్ఫూర్తితో సర్దుబాటు చేయలేకపోతున్నారని ఆయన వ్యతిరేక వర్గం పార్టీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లిందని చెబుతున్నారు. అంతటి రాజకీయ అనుభవం ఆయనకు లేని విషయమై ముఖ్య నేతలకు గట్టిగా చెప్పారని సమాచారం. అదే సందర్భంలో స్థానికేతరుడైన మర్రెడ్డి స్థానే స్థానికులకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్‌ను తెర మీదకు తీసుకు వచ్చారు. ఈ నేపథ్యంలో మర్రెడ్డికి కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కౌడా) చైర్మన్‌ పదవి కట్టబెట్టి, పార్టీలోని అర డజను మంది నేతలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలనే విషయమై తర్జనభర్జనలు జరుగుతున్నాయి.

రూ.కోట్ల కోసం కొట్లాటలు
ఇటీవల పవన్‌ నియోజకవర్గానికి కేటాయించిన రూ.4 కోట్ల పనుల పంపకాల అంశం కూడా ఆ పార్టీ నేతల మధ్య మరింత అగ్గి రాజేసిందనే చర్చ జరుగుతోంది. పనుల కేటాయింపులో మర్రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారంటూ కొందరు నేతలు పార్టీ ముఖ్యుల వద్ద ‘పంచాయితీ’ పెట్టారని సమాచారం. తనకు నచ్చిన ఒకరిద్దరికి మాత్రమే ఆయన పనులు అప్పగించడం మిగిలిన నేతలకు రుచించడం లేదు. అకస్మాత్తుగా విదేశాల నుంచి వచ్చిపడిన వారికి పదవుల పంపకంలో ప్రాధాన్యం ఇవ్వడాన్ని ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న నేతలు తీవ్రంగా విభేదిస్తున్నారు. 

అందునా ఇటీవల మంజూరైన నీటిపారుదల, రహదారుల వంటి పనులను నేతల రూపంలో ఉన్న ఇద్దరు కాంట్రాక్టర్లకు కట్టబెట్టడంపై వారు గుర్రుగా ఉన్నారు. అకస్మాత్తుగా వచ్చిపడిన నేతలకు ఇస్తున్న ప్రాధాన్యం తమకెందుకివ్వడం లేదని పలువురు నిలదీస్తున్నారు. ఇటీవల పిఠాపురం రూరల్‌ ఎఫ్‌కే పాలెం, విరవాడ గ్రామాలకు చెందిన పాపిడిదొడ్డి చెరువులో జరిగిన మట్టి తవ్వకాల్లో పంపకాల విషయంపై జనసేనలో ఇరు వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరిగాయి. రెండు వర్గాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. కానీ, మర్రెడ్డి అనుయాయుడి ఫిర్యాదు పైనే పోలీసులు కేసు నమోదు చేసి, వైరివర్గం ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో, అగ్నికి ఆజ్యం పోసినట్టయ్యింది.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)