Breaking News

బాబుకు నో బెయిల్‌

Published on Tue, 10/10/2023 - 05:41

సాక్షి, అమరావతి : తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు సోమవారం తీవ్ర నిరాశ మిగిల్చింది. వివిధ కేసుల్లో బెయిల్‌ కోసం ఆయన పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. ఏపీ ఫైబర్‌గ్రిడ్, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డులో అక్రమాలు, అంగళ్లు విధ్వంసం కేసులకు సంబంధించి ఆయనకు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫైబర్‌గ్రిడ్‌ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను.. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అంగళ్లు కేసుల్లో వేర్వేరుగా దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఆ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌రెడ్డి సోమవారం వేర్వేరుగా తీర్పులు వెలువరించారు. ఇదే సమయంలో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం సైతం ఆయన బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేసింది.

ముందస్తు బెయిల్‌కు బాబు పిటిషన్‌..
ఏపీ ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును టెరాసాఫ్ట్‌ సంస్థకు కట్టబెట్టి రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారంటూ ఏపీ స్టేట్‌ ఫైబర్‌నెట్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ సంస్థకు ప్రాజెక్టు దక్కడంలో కీలకపాత్ర పోషించిన చంద్రబాబు.. టెండర్‌ ఎవాల్యుయేషన్‌ కమిటీ సభ్యుడు వేమూరి హరికృష్ణ ప్రసాద్, టెరాసాఫ్ట్‌తో పాటు పలువురిని నిందితులుగా చేర్చింది.

ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలంటూ చంద్రబాబు ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ సురేష్‌రెడ్డి సుదీర్ఘ విచారణ జరిపారు. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్‌ వాదించగా, సీఐడీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విని ఈ నెల 5న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్‌ చేసిన విషయంతెలిసిందే. ఈ కేసులో సోమవారం ఉదయం  జస్టిస్‌ సురేష్‌రెడ్డి తన తీర్పును వెలువరించారు. ఆయన ఏమన్నారంటే..

అంతిమంగా నిధులెక్కడికి వెళ్లాయన్నది దర్యాప్తు చేయాలి..
‘టెరాసాఫ్ట్‌తో చంద్రబాబుకున్న సంబంధం, ఆ కంపెనీకి టెండర్‌ కట్టబెట్టే విషయంలో చంద్రబాబు చూపిన శ్రద్ధ తదితర అంశాలకు సంబంధించి సీఐడీ పలు లిఖితపూర్వక ఆధారాలను కోర్టు ముందుంచింది. ముఖ్యమంత్రిగా చంద్రబా­బు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి అప్ప­టి అధికారులను ప్రభావితం చేశారు. ఎ­లాంటి విధి విధానాలను పాటించకుండా, ఎ­లాం­టి పరిశీలన చేయకుండానే సమగ్ర ప్రాజెక్టు రిపోర్ట్‌ (డీపీఆర్‌)ను తయారుచేశారు. అలాగే, టెరాసాఫ్ట్‌కు అనుకూలంగా వ్యవహరించని అధికారులను మార్చడానికి సంబంధించిన ఆధా­రాలను.. టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించడం, టెండర్‌ గడువు తేదీని పొడిగించడం వంటి వాటికి సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించింది.

రూ.330 కోట్ల విలువ చేసే ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టు అమలుకు సంబంధించిన నోట్‌ఫైళ్లలో ఎలాంటి అభ్యంతరాలను, ప్రతికూల అభిప్రాయాలను రాయవద్దని చంద్రబాబు తనకు సూచించారంటూ అప్పటి ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌ కార్యదర్శి నుంచి వాంగ్మూలాన్ని కూడా సీఐడీ సేకరించింది. అలాగే,  టెరాసాఫ్ట్‌ను బ్లాక్‌లిస్ట్‌ నుంచి తొలగించేందుకు వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తనకు చెప్పారంటూ అప్పటి పౌర సరఫరాల శాఖ స్పెషల్‌ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలాన్నీ సీఐడీ ఈ కోర్టు ముందుంచింది.

అంతేకాక.. వేమూరి హరికృష్ణ ప్రసాద్, అప్పటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఏపీ (ఇన్‌క్యాప్‌) మాజీ ఎండీ కె. సాంబశివరావులతో కలిసి చంద్రబాబు కుట్రపూరితంగా వ్యవహరించారు. సాంబశివరావు చేసిన ప్రతిపాదన మేరకు హరికృష్ణ ప్రసాద్‌ను టెండర్‌ కమిటీ సభ్యునిగా నియమించారు. నిబంధనలకు, చట్ట విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాలను చంద్రబాబు ఆమోదించారు. కానీ కేసు నమోదు చేసిన రెండేళ్లకు చంద్రబాబును నిందితునిగా చేర్చారని.. ఇప్పుడు నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయని సీనియర్‌ న్యాయవాదులు చంద్రబాబు తరఫున వాదించారు. 

చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు సాధ్యం కాదు..
ఇలాంటి కేసుల్లో దర్యాప్తునకు పట్టే సమయాన్ని, సీఐడీ సేకరించిన ప్రాథమిక ఆధారాలను, ఈ కేసుతో ముడిపడి ఉన్న పలువురు సాక్షులను గత నెల 14న విచారించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటూ, ఇప్పుడు చంద్రబాబును నిందితునిగా చేర్చడం వెనుక దురుద్దేశాలున్నాయన్న వాదనలో ఎలాంటి బలం ఈ కోర్టుకు కనిపించడంలేదు. విస్తత ప్రజా, రాష్ట్ర ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఈ కేసులో నేర తీవ్రతను, టెరాసాఫ్ట్‌కు చంద్రబాబు రూ.114.53 కోట్ల మేర ఆయాచిత లబ్ధిచేకూర్చారన్న ఆరోపణలను, తద్వారా ఖజానాకు నష్టం కలిగించిన విషయాన్ని కూడా ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటోంది. అందువల్ల ఈ దశలో చంద్రబాబుకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం సాధ్యంకాదు. అంతిమంగా నిధులు ఎక్కడికి వెళ్లాయన్న విషయాన్ని ఇంకా దర్యాప్తు చేయాల్సి ఉంది. కాబట్టి ఈ దశలో దర్యాప్తునకు ఎలాంటి భంగం కలగరాదు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రబాబు పిటిషన్‌ను కొట్టేస్తున్నా’.. అని జస్టిస్‌ సురేష్‌రెడ్డి తన తీర్పు చెప్పారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)