Breaking News

Telangana: బుల్డోజర్లకు బ్రేక్‌!

Published on Tue, 10/08/2024 - 04:41

సాక్షి, హైదరాబాద్‌: వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కలకలం రేపిన ‘హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా)’కు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఇటీవలి పరిణామాలు, సంస్థాగత లోపాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం 3 నెలలపాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని సూచించింది. దీనితో హైడ్రా తమ విభాగం అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువులు, కుంటలపై విస్తృత సర్వే చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలతో..
చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే.. జీహెచ్‌ఎంసీ అధీనంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, ‘విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం)’రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్‌ 27న ఫిల్మ్‌నగర్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీలో తొలి ఆపరేషన్‌ చేపట్టారు. నార్నే గోకుల్‌ ఆక్రమించిన లోటస్‌ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు. 

తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఓఆర్‌ఆర్‌ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు.

విరామానికి కారణాలెన్నో..
హైడ్రా ప్రభావంతో రాష్ట్రంలో, ప్రధానంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రియల్‌ ఎస్టేట్‌ రంగం దెబ్బతింది. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు పడిపోయాయి. మరో వైపు అమీన్‌పూర్‌లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. 

నది వెంట ఇళ్ల సర్వే, ఖాళీ చేయించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టింది. మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేకపోయినా.. రెండింటి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్‌ వేసింది.

‘హైడ్రా’వ్యవస్థ నిర్మాణంపై ఫోకస్‌
కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఇటీవలే వివిధ విభాగాల నుంచి 169 మందిని డిప్యూటేషన్‌పై నియమించారు. కానీ పోలీసు విభాగం నుంచి వచ్చిన 20 మంది మినహా మరే ఇతర విభాగాల సిబ్బంది హైడ్రా విధుల్లో చేరలేదు. 

మరోవైపు హైడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపుతూ కొందరు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వారిని రిలీవ్‌ చేయడానికి పలువురు శాఖాధిపతులు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైడ్రా వినియోగిస్తున్న కార్యాలయంతోపాటు సిబ్బందిలో దాదాపు అంతా జీహెచ్‌ఎంసీకి సంబంధించిన వారే. ఈ విషయంలో అటు జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులకు, ఇటు హైడ్రాకు మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత అంశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు.

జల వనరుల ‘లెక్క’తేల్చేలా..
జల వనరుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌)లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయా చెరువులు, వాటి ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడాన్ని ఇటీవల న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. దీనికోసం రెవెన్యూ, ఇరిగేషన్‌ విభాగాలతోపాటు హెచ్‌ఎండీఏ ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. 

తొలుత ప్రాథమిక, ఆపై తుది నోటిఫికేషన్లు జారీ చేయాలి. హెచ్‌ఎండీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లో కలిపి 2,688 జలవనరులు ఉన్నాయి. వీటిలో 2,364 ప్రిలిమినరీ నోటిఫికేషన్‌ స్థితి దాటగా, 324 మాత్రమే తుది నోటిఫికేషన్‌ దాకా వెళ్లాయి. 95 చెరువులకు హైడ్రా ఏర్పడిన తర్వాతే ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో అన్ని చెరువుల సర్వే పూర్తి చేసి, తుది నోటిఫికేషన్‌ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)