Breaking News

యనమలకు పవన్ కల్యాణ్ కౌంటర్

Published on Thu, 08/20/2015 - 15:43

స్పందించడం మానేసి వెటకారం చేస్తారా
ఎంతో బాధ్యతతో రైతుల సమస్యను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లా
హైదరాబాద్లో సినీ పరిశ్రమకు ఇచ్చినవి బహుళ పంటల భూములు కావు
అవన్నీ కొండలు.. ఆ విషయం రామకృష్ణుడికి తెలియదనుకుంటా
త్వరలో నదీ పరివాహక గ్రామాల రైతులను కలుస్తా
ట్విట్టర్లో పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు


హైదరాబాద్
తాను ఎంతో బాధ్యతతో రైతుల సమస్యను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లానని, కానీ దానిపై విజ్ఞతతో స్పందించడం మానేసి రైతుల ఆవేదనను వెటకారం చెయ్యడం వాళ్లకే చెల్లిందని జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కల్యాణ్ అన్నారు. ఎలా చెయ్యాలో పవనే చెప్పాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై పవన్ మళ్లీ ట్విట్టర్ ముఖంగా స్పందించారు.

అసలు అక్కడ కట్టేది స్వర్గం అని తెలిస్తే.. అది త్రిశంకు స్వర్గమా రెగ్యులర్ స్వర్గమా అనేది తర్వాత అలోచించవచ్చన్నారు. సినిమా పరిశ్రమకు హైదరాబాద్లో ఇచ్చినవి కొండలు తప్ప బహుళ పంటలు పండే పొలాలు కాదని, ఇది రామకృష్ణుడు గారికి తెలియదనుకుంటానని పవన్ ఎద్దేవా చేశారు. పైగా.. హైదరాబాద్ కొండల్లో కానీ, విశాఖపట్నం కొండల్లో కానీ తనకైతే స్టూడియోలు లేవని కూడా స్పష్టం చేశారు. తాను త్వరలోనే బేతపూడి, ఉండవల్లి, పెనుమాక తదితర నదీ పరివాహక గ్రామాల రైతులను కలుస్తానని చెప్పారు.