గన్నవరంలో YSRCP ఘన విజయం.. వల్లభనేని వంశీ సంబరాలు
Breaking News
వెలుగుల దీపావళి
Published on Sun, 11/08/2026 - 05:56
అమావాస్య రోజున వచ్చే వెలుగుల పండుగ దీపావళి. ఇది చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక. నరకాసుర వధ తర్వాత జనాలు దీపావళి జరుపుకున్నట్లు పురాణాల కథనం. శరద్రుతువులో దసరా నవరాత్రుల తర్వాత ఘనంగా జరుపుకొనే పండుగ దీపావళి. నిజానికి దీపావళి సంరంభం అమావాస్యకు రెండు రోజుల ముందు వచ్చే ధనత్రయోదశి నుంచి మొదలవుతుంది. దీపావళికి రెండు రోజుల తర్వాత వచ్చే యమద్వితీయ వరకు కొనసాగుతుంది. వరుసగా ఐదురోజులు కొనసాగే ఈ వేడుకలకు సంబంధించి వివిధ ప్రాంతాల్లో వివిధ ఆచారాలు ఉన్నాయి. నేడు దీపావళి సందర్భంగా పురాణేతిహాస నేపథ్యం సహా అరుదైన ఆచారాల గురించి తెలుసుకుందాం...
దీపావళి పండుగకు పురాణ నేపథ్యం నరకాసుర వధ. హిరణ్యాక్షుడిని వధించడానికి శ్రీమహావిష్ణువు వరాహావతారం దాల్చాడు. ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుడిని సంహరించి, సముద్రగర్భంలోనున్న భూదేవిని రక్షించాడు. అప్పుడు భూదేవికి నరకాసురుడు పుట్టాడు. నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురానికి రాజయ్యాడు. బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి, తనకు తన తల్లి చేతిలో తప్ప ఇతరుల వల్ల మరణం ఉండకూడదని వరం కోరుకున్నాడు. వరగర్వం తలకెక్కిన నరకాసురుడు ముల్లోకాలనూ పీడించడం ప్రారంభించాడు.
స్వర్గం మీదకు దండెత్తి, ఇంద్రుడి శ్వేతఛత్రాన్ని, దేవమాత అదితి మణికుండలాలను అపహరించాడు. భూలోకంలో వివిధ రాజ్యాలపై దండెత్తి పదహారువేల మంది రాజకుమార్తెలను బంధించి తన చెరలో పెట్టాడు. నరకుడి ఆగడాలు నానాటికీ శ్రుతిమించడంతో దేవతలు, మునులు శ్రీకృష్ణుడి వద్ద మొరపెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు గరుడ వాహనంపై యుద్ధానికి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. తాను కూడా యుద్ధం చేస్తానని సత్యభామ ముందుకు వచ్చింది. సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు గరుడ వాహనంపై యుద్ధరంగానికి చేరుకున్నాడు. నరకుడి సేనలతో భీకర పోరాటం సాగించాడు. యుద్ధంలో శ్రీకృష్ణుడు నరకుడి సేనాపతి అయిన మురాసరుడిని వధించాడు. మురాసురుడి మరణంతో నరకుడు నేరుగా కృష్ణుడి ఎదుటకు వచ్చాడు.
నరకుడి అస్త్రానికి కృష్ణుడు మూర్ఛిల్లాడు. అప్పుడు ఆగ్రహంతో మండిపడిన సత్యభామ ధనుర్బాణాలను అందుకుని, నరకుడితో పోరు సాగించింది. చివరకు నరకుడు సత్యభామ చేతిలో అంతమొదాడు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాటి రాత్రి నరకాసుర సంహారం జరిగింది. నరకుడి మరణం తర్వాత అప్పటి వరకు అతడి చెరలో మగ్గుతున్న పదహారువేల మంది రాజకుమార్తెలను సత్యభామా శ్రీకృష్ణుల విముక్తులను చేశారు. వారిని తమతో పాటే నగరానికి తీసుకువచ్చారు.
యుద్ధం తర్వాత తిరిగి వస్తున్న సత్యభామా శ్రీకృష్ణులకు స్వాగతం పలకడానికి ప్రజలు ఇళ్ల ముందు వరుసగా దీపాలను వెలిగించారు. అప్పటి నుంచి దీపావళి రోజున ఇళ్ల ముందు దీపాలను వరుసగా వెలిగించడం ఆచారంగా మారిందని చెబుతారు. దీపావళి పర్వదిన నేపథ్యమైన నరకాసుర వధ గురించి, ఈ పండుగ జరుపుకొనే పద్ధతి గురించి భాగవతంతో పాటు పద్మపురాణం, స్కందపురాణం వంటి పురాణాల్లో విపులమైన ప్రస్తావనలు ఉన్నాయి. హర్షవర్ధనుడు తాను రాసిన ‘నాగానందం’ నాటకంలో దీపావళిని ‘దీపప్రతిపదోత్సవం’గా పేర్కొన్నాడు.
ధన్వంతరి పుట్టిన రోజు
దీపావళి వేడుకల హడావుడి ధనత్రయోదశి నుంచి మొదలవుతుంది. ధనత్రయోదశని ధన్వంతరి జన్మదినంగా పరిగణిస్తారు. క్షీరసాగర మథనం జరిగినప్పుడు ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున ధన్వంతరి చేత అమృతకలశం ధరించి ఆవిర్భవించాడు. ఇదే రోజున క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించినట్లు పురాణ కథనం.
అందుకే ఈ రోజున లక్ష్మీపూజలు, కొందరు లక్ష్మీ కుబేర పూజలు జరుపుతారు. ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే, ఐశ్వర్యవృద్ధి కలుగుతుందని నమ్ముతారు. కొందరు ఈ రోజున ఆవులకు ఆయుర్వేద మూలికలతో కూడిన ఔషధగ్రాసం తినిపిస్తారు. కొందరు ఇంటి దక్షిణ దిశలో నాలుగు వత్తులతో కూడిన నువ్వులనూనె దీపాన్ని ‘యమదీపం’గా పెడతారు. ‘యమదీపం’ పెట్టడం వల్ల అపమృత్యు భయాలు తొలగుతాయని నమ్ముతారు.
నరక చతుర్దశి రోజున యమదీపం
ధనత్రయోదశి మరునాడు నరక చతుర్దశి జరుపుకొంటారు. నరక చతుర్దశి రోజున వేకువ జామున అభ్యంగన స్నానాలు చేస్తారు. స్నానం ముగించాక నీటిలో తడిపిన ఉత్తరేణి వేర్లను తల చుట్టూ మూడుసార్లు తిప్పుకుంటారు. ఇలా చేయడం వల్ల పాపాలు నశిస్తాయని నమ్ముతారు. ఇదేరోజున యమధర్మరాజుకు తర్పణాలు విడుస్తారు. యముడి చతుర్దశ నామాలను పఠిస్తూ, తిలోదకాలతో తర్పణాలను విడిచిపెట్టడం వల్ల అపమృత్యు భయాలు తొలగిపోతాయని చెబుతారు. కొన్ని ప్రాంతాల్లో నరక చతుర్దశి రోజున సాయంత్రం వేళ జువ్వి కట్టెలను కాగడాల్లా వెలిగించి, ఆకాశం వైపు చూపుతారు. ఇలా చేయడం వల్ల మహాలయ పక్షాల కాలంలో భూలోకానికి వచ్చిన పితృదేవతలకు తిరిగి ఊర్ధ్వ లోకాలకు వెళ్లేందుకు మార్గం కనిపిస్తుందని నమ్ముతారు.
దీపావళికి లక్ష్మీదేవి పూజలు
దీపావళి రోజున దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇళ్లను అలంకరించుకోవడం, గుమ్మాలకు పసుపు కుంకుమలను తీర్చిదిద్దడం, ముంగిళ్లలో ముగ్గులు వేయడం, సాయంత్రం వేళ ఇళ్ల ముందు దీపాలను వెలిగించి, బాణసంచా కాల్చడం వంటివి చేస్తారు. దీపావళి రోజు విక్రమశకం ఆరంభమైన రోజు. అందువల్ల రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మార్వాడీలు నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటారు. ఈరోజున తమ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పాత పద్దు పుస్తకాలను ముగించి, కొత్త పద్దు పుస్తకాలను ప్రారంభిస్తారు. లక్ష్మీదేవిని పూజించి, బంధుమిత్రులకు మిఠాయిలను పంచిపెడతారు.
ఉత్తరాది రాష్ట్రాల్లో పలుచోట్ల దీపావళి రోజున తప్పనిసరిగా జూదం ఆడతారు. ఈ రోజున పార్వతీ పరమేశ్వరులు పాచికల ఆట ఆడినట్లు కొన్ని పురాణ గాథలు ఉన్నాయి. దీపావళి రోజున ‘అలక్ష్మీ నిస్సారణ’ ఆచారం పాటిస్తారు. దీపావళి రోజున అర్ధరాత్రి ఇంట్లో ఉన్నవారిలో వయసులో పెద్ద అయిన మహిళ ఒక పాత చేట, కర్ర తీసుకుని, ఇంట్లోని ప్రతిమూలా వాటిని కొడుతూ చప్పుడు చేస్తారు. దీనివల్ల జ్యేష్ఠాదేవి ఇల్లు వదిలి వెళ్లిపోతుందని, ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని నమ్ముతారు. పలుచోట్ల దీపావళికి దీపాలు వెలిగించిన ప్రమిదల నుంచి మరునాడు మసిని సేకరించి, దానిని కాటుకగా ఉపయోగిస్తారు.
బలి చక్రవర్తికి పూజలు
దీపావళి మర్నాడు కార్తీక శుక్ల పాడ్యమి రోజును బలి పాడ్యమి జరుపుకొంటారు. వామనుడు త్రివిక్రమ రూపం దాల్చి, బలి చక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిన సమయంలో అతడి కోరిక మేరకు ఏటా కార్తీక శుక్ల పాడ్యమి రోజున భూలోకానికి వచ్చి తన ప్రజలను చూసుకునేలా వరం ఇస్తాడు. ఈ రోజున బలి చక్రవర్తి, ఆయన భార్య వింధ్యావళి చిత్రపటాలను లేదా వారి మట్టి విగ్రహాలను ఉంచి పూజిస్తారు. సాయంత్రంవేళ వారికి నైవేద్యాలు సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఇదే రోజున గోవర్ధన పూజ చేస్తారు. ఈ రోజున శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని పైకెత్తి ఆలమందలను, కాపరులను రక్షించాడని పురాణ కథనం. గోవర్ధన పూజ సందర్భంగా ఆవులను, ఎద్దులను అలంకరించి, వాటిని పూజించి, వాటికి తీపి పదార్థాలను తినిపిస్తారు.
దీపావళికి కాళీ పూజ
దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో దీపావళికి లక్ష్మీపూజలు జరుపుకొనే ఆచారం తెలిసిందే. పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల్లో దీపావళికి ప్రత్యేకంగా కాళీమాతను పూజిస్తారు. దీపావళి సందర్భంగా అమావాస్య తిథి ఉన్న అర్ధరాత్రివేళ ‘నిశితకాల పూజ’ జరుపుతారు. ఈ ప్రాంతాల్లో దీపావళి రాత్రిని పితృదేవతల రాత్రిగా భావిస్తారు. పితృదేవతల ఆత్మలకు దారి చూపడానికి, ఇంట్లోని ప్రతికూల శక్తులను పారదోలడానికి ‘చౌదొ ప్రదీప’ పేరిట పద్నాలుగు దీపాలను వెలిగిస్తారు. బెంగాలీ ప్రజలు దీపావళికి ముందురోజు నరక చతుర్దశి నాడు ‘చౌదొ శాకొ’ అనే పద్నాలుగు రకాల ఆకుకూరలతో చేసిన వంటకాన్ని పితృదేవతలకు నైవేద్యంగా పెడతారు.
యమధర్మ రాజుకు పూజలు
బలి పాడ్యమి మరుసటి రోజైన కార్తీక శుక్ల విదియ రోజును యమద్వితీయగా జరుపుకొంటారు. దీనినే భ్రాతృద్వితీయ అని, భగినీ హస్తభోజనం అని అంటారు. యమధర్మరాజును ఆయన సోదరి యమున ఎన్నోసార్లు తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించినా, పాపుల పాపవిచారణలో తీరిక లేకుండా ఉన్నందున ఆయనకు సోదరికి ఇంటికి వెళ్లే వీలు చిక్కలేదు. చివరకు ఒకసారి కార్తీక శుక్ల విదియ రోజున యమధర్మరాజు తన సోదరి యమున ఇంటికి వెళ్లి, ఆమె చేతివంటను ఆరగిస్తాడు. కార్తీక శుక్ల విదియనాడు సోదరీమణుల ఇంటికి వెళ్లి, భోజనం చేసి, వారికి కానుకలు ఇచ్చే సోదరులకు నరకబాధలు లేకుండా ఉండేలా యమధర్మరాజు తన సోదరికి వరమిచ్చాడని పురాణాల కథనం. యమద్వితీయ రోజున పలుచోట్ల యముడికి, చిత్రగుప్తుడికి పూజలు నిర్వహిస్తారు.
జైన బౌద్ధ
సిక్కు మతాలకూ పండుగే!
దీపావళి హిందువులకు మాత్రమే కాదు, జైన మతస్థులకు, బౌద్ధ మతస్థులకు, సిక్క మతస్థులకు కూడా ముఖ్యమైన పండుగే! జైన తీర్థంకరులలో ఇరవైనాలుగవ వాడైన వర్ధమాన మహావీరుడు ఇదేరోజున నిర్వాణం పొందాడు. వర్ధమాన మహావీరుడు తన జీవితకాలంలో వెదజల్లిన జ్ఞానకాంతులను పదిలం చేసుకునేందుకు జైన మతావలంబులైన ఆనాటి రాజులు, మహావీరుని శిష్యులు, అనుయాయులు దీపావళి రోజున జైనమందిరాలలోను, ఇళ్లలోను వరుసగా దీపాలను వెలిగించడం ప్రారంభించాడు.
మహావీరుని నిర్యాణ దినమైన దీపావళి రోజున జైనులు తమకు సమీపంలో ఉన్న జైన మందిరాలను దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మహావీరునికి ‘నిర్వాణ లాడూ’ పేరుతో పెద్ద పరిమాణంలో ఉండే లడ్డూను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇదేరోజున మహావీరుని శిష్యుడైన గౌతముడికి జ్ఞానసిద్ధి కలిగింది. అందువల్ల జ్ఞానపూజ జరిపి, తమ పవిత్రగ్రంథాలను పఠిస్తారు. మహావీరుడి నిర్వాణం తర్వాత జైనులకు ‘వీర నిర్వాణ శకం’ మొదలైన సందర్భంగా, కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొంటారు.
గౌతమ బుద్ధుడు బోధివృక్షం కింద జ్ఞానోదయం పొందిన తర్వాత దీపావళి రోజున తన స్వస్థలమైన కపిలవస్తు నగరానికి తిరిగి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వెలిగించి ఆయనకు స్వాగతం పలికారట! ఇదేరోజున అశోక చక్రవర్తి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. అశోకుడు శాంతిమార్గంలో బౌద్ధాన్ని స్వీకరించిన సందర్భంగా ఆయన రాజ్యమంతటా ప్రజలు ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు. ఈ సందర్భాలను పురస్కరించుకుని బౌద్ధులు దీపావళి రోజున బౌద్ధ విహారాలలో దీపాలను వెలిగిస్తారు. శాంతి ప్రార్థనలు, ధ్యానం చేస్తారు. నేపాల్లోని ‘నెవార్’ బౌద్ధులు భారతీయుల మాదిరిగానే దీపావళి సందర్భంగా ఐదురోజుల వేడుకలు జరుపుకొంటారు. వారు ఈ సందర్భంగా శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు.
సిక్కులు దీపావళిని ‘బందీఛోడ్ దివస్’గా జరుపుకొంటారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ కాలంలో సిక్కుల గురువు హరగోబింద్ సింగ్ను గ్వాలియర్ కోటలో ఖైదు చేశారు. గురు హరగోబింద్ సింగ్కు నానాటికీ పెరుగుతున్న జనాదరణకు జడిసి జహంగీర్ ఈ పనికి ఒడిగట్టాడు. కొంతకాలానికి జహంగీర్ ఆయనను విడుదల చేయడానికి అంగీకరించాడు. అయితే, తనతో పాటు జహంగీర్ చెరలో ఉన్న 52 మంది హిందూ రాజులను కూడా విడిచిపెట్టాలని గురు హరగోబింద్ సింగ్ షరతు విధించాడు.
చివరకు జహంగీర్ వారిని కూడా గురు హరగోబింద్ సింగ్తో పాటు దీపావళి రోజున విడుదల చేశాడు. ఆయనను స్వాగతం పలుకుతూ అమృత్సర్ ప్రజలు నగరమంతటా దీపాలు వెలిగించారు. నాటి నుంచి సిక్కులు దీపావళి రోజున తమ ఇళ్లలోను, గురుద్వారాలలోను దీపాలను వెలిగించే ఆచారం పాటిస్తున్నారు. ఈ సందర్భంగా గురుద్వారాలలో కులమతాలకు అతీతంగా ‘లంగర్’ పేరుతో సామూహిక విందుభోజనాలు ఏర్పాటు చేస్తారు. రాత్రివేళ ఆనందంగా బాణసంచా కాలుస్తారు.
విదేశాల్లో దీపావళి
దీపావళి పండుగను మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఉన్న హిందూ, జైన, బౌద్ధ, సిక్కు మతాలకు చెందినవారు దీపావళి వేడుకలను తమ తమ పద్ధతుల్లో జరుపుకొంటారు. భారత్ సహా దాదాపు డజను దేశాలలో దీపావళి అధికారిక సెలవు దినం. దీపావళిని అధికారిక సెలవు దినంగా ప్రకటించే దేశాలలో నేపాల్, మలేషియా, సింగపూర్, ఫిజీ, మారిషస్, శ్రీలంక, గయానా, సురినేమ్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, మయన్మార్ దేశాలు ఉన్నాయి.
పాకిస్తాన్ ప్రభుత్వం సిం«ద్ వంటి కొన్ని ప్రాంతాల్లో ఐచ్ఛిక సెలవు దినంగా ప్రకటిస్తోంది. భారత సంతతికి చెందిన ప్రజలు ఎక్కువగా నివసించే అమెరికా, కెనడా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో అధికారిక సెలవు దినం ప్రకటించకపోయినా, కొన్నేళ్లుగా దేశాధినేతల ఆధ్వర్యంలో అధికారికంగా వేడుకలు జరుపుకొంటూ వస్తున్నారు. ఈ దేశాలలో దీపావళి వేడుకలను అత్యంత దేదీప్యమానంగా జరుపుకొంటారు.
Tags : 1