పులివెందులలో మొదలైన దౌర్జన్యం.. పెట్రోల్ బాంబులతో దాడులు
బాల కార్మిక చట్టం అమలుకు ‘స్పెషల్ సెల్’
Published on Wed, 11/04/2026 - 15:11
సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదకర పరిశ్రమల్లో బాల కార్మికుల వినియోగాన్ని నిషేధించే ‘బాల కార్మిక (నిషేధ, నియంత్రణ) సవరణ చట్టం–2016’లోని నిబంధనల అమలును పర్య వేక్షించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని (స్పెష ల్ సెల్) ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభు త్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సవరణ చట్టాన్ని (చట్టం నంబర్ 35) పూర్తిస్థాయిలో పకడ్బందీగా అమలు చేసేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ఈ వ్యవహారాన్ని నిరంతరం పర్యవేక్షించాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
పిటిషన్ ఉద్దేశం నెరవేరింది
బాల కార్మికులకు విద్యా సదుపాయాలతో పాటు రెండు పూటలా మధ్యాహ్న భోజనాన్ని అందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ‘హెల్త్ ఫర్ మిలియన్స్’ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేసింది. జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టి, జస్టిస్ ఎన్.వి.అంజారియాతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇటీవల దీనిపై విచారణ చేపట్టింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. 1986 నాటి మాతృ చట్టానికి 2016లో తీసుకొచ్చిన సవరణల ద్వారా పిటిషనర్ లేవనెత్తిన ప్రధాన సమస్యలకు ఇప్పటికే పరిష్కారం లభించిందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పిటిషన్లో చేసిన విజ్ఞప్తిపై మరింత విచారణ చేయాల్సిన అవసరం లేదని, చట్ట సవరణతో ఆ ఉద్దేశం నెరవేరిందని అభిప్రాయపడింది.
నిబంధనలను అమలు చేయాల్సిందే
పిటిషన్‌పై విచారణ ముగిసినప్పటికీ, చట్టం అమలు తీరుపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 2016 నాటి సవరణలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో కచ్చితంగా అమలు కావాలని స్పష్టంచేసింది. పిల్లలు, కౌమార దశలో ఉన్నవారి హక్కులను పరిరక్షించడానికి ఒక ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖను ఆదేశించింది. ఈ సెల్ ద్వారా చట్టంలోని నిబంధనల అమలును, ఆచరణలో ఎదురవుతున్న ఇబ్బందులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించింది.
సీఎస్‌లకు మార్గదర్శకాలు
చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే దిశగా అన్ని రాష్ట్రాల ప్రభుత్వం ప్రధాన కార్యదర్శుల(సీఎస్‌లు) ద్వారా ఆయా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. సవరించిన నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడటం సంబంధిత ప్రభుత్వ విభాగాల కనీస బాధ్యత అని తమ తీర్పులో పేర్కొంది. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. ఈ చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పేర్కొంది.
ఇదీ చదవండి: బ్యాంక్‌కు రూ.80 కోట్లకు పైగా కుచ్చుటోపీ
Tags : 1