హీరోగా విజయ్ కొడుకు డైరెక్టర్ ఎవరంటే?
Breaking News
‘కిల్లర్’మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Published on Fri, 10/30/2026 - 11:54
జ్యోతి పూర్వజ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కిల్లర్’. పూర్వజ్ మరో కీలక పాత్రలో కనిపించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టారు. ఎ. పద్మనాభరెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఉర్వీష్ పూర్వజ్ సమర్పణలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్ట్‌ను ముందే చెప్పిన వారికి కోటి రూపాయలు ఇస్తానంటూ దర్శకుడు ప్రకటించడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. మరి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే?
కృత్రిమ మేధ (ఏఐ), ఆధునిక సాంకేతికత, మనిషి వ్యక్తిత్వం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. జ్యోతి పూర్వజ్ పోషించిన ఓ మహిళ జీవితంలో అనూహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయి. తనలో కనిపించే విభిన్న వ్యక్తిత్వాల వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే క్రమంలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఆమె స్పై, వాంపైర్, ఉగ్రవాది, నటి, రక్షా రాయ్ వంటి విభిన్న రూపాల్లో కనిపిస్తుంది. అసలు ఆమె ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? శాస్త్రవేత్త పూర్వజ్ పాత్రతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? ఈ విభిన్న వ్యక్తిత్వాల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆమె నిజమైన వ్యక్తిత్వం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే?
సైన్స్ ఫిక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఇలాంటి కథలు ఆసక్తిని కలిగిస్తాయి. ప్రస్తుతం ఏఐ సాంకేతికతపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ‘కిల్లర్’ కథాంశం కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా ఉంది. న్యూరాలింక్ పేరుతో మెదడులో చిప్స్ అమర్చడం, మానవ మెదడుపై సాంకేతిక ప్రయోగాలు చేయడం వంటి అంశాలను ప్రేరణగా తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందించారు.
ఓ భారీ సైన్స్ ఫిక్షన్ పాయింట్‌కు థ్రిల్లర్ అంశాలను జోడించడం ఆసక్తికరమైన ఆలోచనే. అయితే, ఆ కథను తెరపై ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు ఆశించిన స్థాయిలో విజయవంతం కాలేకపోయారు. ముఖ్యంగా తొలి భాగం కథను అర్థం చేసుకోవడానికే ప్రేక్షకులు ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. జ్యోతి పూర్వజ్ ఒక్కో సందర్భంలో ఒక్కో రూపంలో కనిపించడం, ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు వరుసగా రావడంతో కథపై స్పష్టత కొరవడుతుంది. అసలు జరుగుతున్నదేంటి? పాత్రల మధ్య సంబంధం ఏమిటి? కథ ఏ దిశగా సాగుతోంది? అనే ప్రశ్నలు ప్రేక్షకుల్లో తలెత్తుతాయి. ఇంటర్వెల్ సమయానికి ఏదైనా బలమైన ట్విస్ట్ వస్తుందనే ఆసక్తి కలిగించినప్పటికీ, ఆ ఉత్కంఠను పూర్తిస్థాయిలో నిలబెట్టడంలో సినిమా తడబడింది.

ఇక సెకండాఫ్‌లో
ఇక సెకండాఫ్‌లో జ్యోతి పూర్వజ్ అలా ప్రవర్తించడానికి గల కారణాలు తెలుస్తాయి. అయితే.. అప్పటికే కథనంలోని గందరగోళంతో సహనం కోల్పోయిన ప్రేక్షకులకు ఆ వివరణ పెద్దగా ఆసక్తిని కలిగించదు. క్లైమాక్స్‌లో వచ్చే పోరాట సన్నివేశం అనూహ్యంగా అనిపించినా, దానికి సరైన లాజిక్ తోడవకపోవడం నిరాశ కలిగిస్తుంది. వినూత్నమైన ఆలోచనను ఎంచుకోవడం అభినందనీయమే అయినా, దాన్ని బలమైన కథనంతో ముడిపెట్టడంలో లోపాలు కనిపిస్తాయి. సైన్స్ ఫిక్షన్ అంశాలు, థ్రిల్లర్ మలుపులు ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయాల్సింది పోయి కొన్ని చోట్ల గందరగోళానికి గురిచేస్తాయి.
ఎవరెలా చేశారంటే?
జ్యోతి పూర్వజ్ విభిన్న పాత్రల్లో కనిపిస్తూ తన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పూర్వజ్ శాస్త్రవేత్తగా నటన అభినయం బాగుంది. ఒకే సినిమాలో పలు భిన్నమైన రూపాల్లో కనిపించడం కోసం జ్యోతి చేసిన ప్రయత్నం తెరపై కనిపిస్తుంది. అయితే, కథలో ఎక్కువ భాగం ఆమె చుట్టూనే తిరగడం, ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం కొంత పరిమితిగా మారింది. వినూత్నమైన కథాంశాన్ని ఎంచుకోవడం, విభిన్న పాత్రలతో ప్రయోగం చేయడం ఈ చిత్రానికి ప్రధాన బలం. కానీ కథనంలో స్పష్టత, సన్నివేశాల మధ్య పొంతన, ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసే ఉత్కంఠ లోపించడంతో సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.
రేటింగ్: 2.5/5
-ప్రశాంత్ కందా
Tags : 1