జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ
పాదరసం నుంచి బంగారం తయారీ!
Published on Fri, 10/23/2026 - 15:12
బంగారం కొనాలంటే నేడు లక్షలు ఖర్చు చేయాల్సిందే. గనుల్లో తవ్వకాలు జరిపి, ఖనిజాల నుంచి దాన్ని వెలికితీయడం అంత సులభమైన పని కాదు. అలాంటిది మరో లోహం నుంచి బంగారాన్ని తయారు చేస్తే ఎలా ఉంటుంది? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. అమెరికాకు చెందిన ఓ స్టార్టప్ ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
పాదరసం నుంచి స్వచ్ఛమైన, స్థిరమైన బంగారాన్ని తయారు చేసినట్లు శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ (Marathon Fusion) అనే సంస్థ అక్టోబర్ 21న ఎక్స్ వేదికగా వెల్లడించింది. అణు సంలీన ప్రక్రియలో ఉత్పత్తి అయ్యే న్యూట్రాన్ల సాయంతో పాదరసాన్ని బంగారంగా మార్చినట్లు తెలిపింది. అయితే.. ఈ ప్రయోగంలో ఎంత బంగారం ఉత్పత్తి చేశారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అంతే కాకుండా.. ప్రయోగానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదు.
పాదరసం నుంచి బంగారం ఎలా..
సాధారణంగా ఒక లోహాన్ని.. మరో లోహంగా మార్చడం సాధ్యం కాదని అనుకుంటాం. కానీ అణు భౌతికశాస్త్రంలో అది సాధ్యమే. కాకపోతే ఇందుకు సాధారణ రసాయన ప్రక్రియలు సరిపోవు. పరమాణువు కేంద్రకంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇక్కడే అణు రూపాంతరం అనే ప్రక్రియ కీలకంగా మారుతుంది.
ప్రతి మూలకానికి దాని పరమాణు కేంద్రకంలో ఉండే ప్రోటాన్ల సంఖ్య ప్రత్యేక గుర్తింపుగా ఉంటుంది. బంగారంలో 79 ప్రోటాన్లు ఉంటే, పాదరసంలో 80 ప్రోటాన్లు ఉంటాయి. ఈ సంఖ్యలో మార్పు వచ్చినప్పుడు ఒక మూలకం మరో మూలకంగా మారుతుంది.
మారథాన్ ఫ్యూజన్ సంస్థ 2025లో ప్రచురించిన పరిశోధనా పత్రంలో ఈ ప్రక్రియకు సంబంధించిన విధానాన్ని వివరించింది. డ్యూటీరియం, ట్రిటియం అనే హైడ్రోజన్ ఐసోటోపులు కలిసినప్పుడు జరిగే అణు సంలీన చర్య ద్వారా అధిక శక్తి కలిగిన న్యూట్రాన్లు విడుదలవుతాయి. వీటిని పాదరసం-198పై ప్రయోగిస్తే పాదరసం-197 ఏర్పడుతుంది. ఆ తర్వాత అది రేడియోధార్మికతకు గురై బంగారం-197గా మారుతుంది. ఇది బంగారంలో స్థిరమైన ఐసోటోప్.
ఇదీ చదవండి: గోల్డ్ మార్కెట్లో సంచలనం.. కుప్పకూలిన ధరలు!
అంటే దీని అర్థం పాదరసాన్ని నేరుగా కరిగించి బంగారంగా మార్చడం కాదు. అణు కేంద్రకంలో మార్పులు తీసుకొచ్చి బంగారాన్ని తయారు చేయడం.
Last month, we demonstrated high-rate alchemy: turning mercury into real, stable gold, beating CERN’s record by a factor of 10. Last week, we enriched isotopes in the world’s most powerful plasma centrifuge, beating the Soviet record that stood for 40 years. Now, we’re building a fusion reactor in San Francisco to achieve record power density.
— Marathon Fusion (@MarathonFusion) October 21, 2026
Tags : 1