భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్
Breaking News
‘నేను మున్నాను.. నన్ను చంపేశారు’.. వెలుగులోకి వింత కేసు!
Published on Sun, 10/18/2026 - 10:57
1951 జనవరి 19.
ఉత్తరప్రదేశ్లోని కానౌజ్ నగరం. జాగేశ్వర్ ప్రసాద్ అనే క్షురకుడి ఆరేళ్ల కుమారుడు అశోక్ కుమార్ అలియాస్ మున్నా ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈలోగా ఇద్దరు వ్యక్తులు వచ్చి, ‘మాతో రా... బోలెడు ఆటలు ఆడుకోవచ్చు’ అని పిలిచారు. అంతే, వారితో వెళ్లిన మున్నా తిరిగి రాలేదు. గాభరా చెందిన తల్లిదండ్రులు ఊరంతా వెతికితే, ఓచోట మున్నా శవం దొరికింది. గొంతు కోసి హత్య చేసిన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో జవహర్, చతురి అనే ఇద్దరు వ్యక్తులను అనుమానించారు. కానీ సరైన ఆధారాలు లేక కేసు ముందుకు సాగలేదు.
1951 జూలై 27.
ఉత్తరప్రదేశ్లోని కానౌజ్ నగరం. ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు అతడికి రవిశంకర్ అని పేరు పెట్టారు. ఆ చిన్నారి గొంతుపై ఓ విచిత్రమైన మచ్చ ఉండటం గమనించారు. గొంతుకు అడ్డంగా ఎవరో గీసిన గీతలా అది కనిపించింది. రోజులు గడిచాయి. రవిశంకర్కు మాట్లాడటం వచ్చిన తర్వాత విస్తుపోయే సంఘటనలు జరిగాయి.
‘ఇది నా ఇల్లు కాదు. వెంటనే నన్ను నా ఇంటికి తీసుకెళ్లండి’ అని ఓరోజు ఏడవడం ప్రారంభించాడు. ఏదో పీడకల వచ్చి అలా మాట్లాడుతున్నాడేమో అని తల్లిదండ్రులు అనుకున్నారు. ఒకరోజు అతడు చెప్పిన మాటలు మరింత ఆందోళన కలిగించాయి. ‘నా పేరు మున్నా. నాన్న పేరు జాగేశ్వర్ ప్రసాద్. ఆయన క్షురకుడు. కానౌజ్లోని ఛిపట్టీ ప్రాంతంలో మా ఇల్లు ఉంది. నన్ను జవహర్, చతురి అనే ఇద్దరు వ్యక్తులు చంపేశారు. వారిలో ఒకరు క్షురకుడు, మరొకడు బట్టలు ఉతికేవాడు’ అని చెప్పడం వారిని షాక్కు గురిచేసింది. తనను ఆడుకుందామని పిలిచారని, అక్కడ నుంచి నది వైపు తీసుకెళ్లారని, తర్వాత చింతామణి ఆలయ సమీపంలో గొంతు కోసి చంపారని చెప్పాడు. దీంతో రవిశంకర్ తల్లిదండ్రులు గాభరా పడ్డారు. వాస్తవం తెలుసుకోవడానికి ఛిపట్టీ వెళ్లి వాకబు చేశారు. నిజంగానే కొన్నేళ్ల క్రితం మున్నా అనే బాలుడు హత్యకు గురయ్యాడని తెలిసి విస్తుపోయారు.
ఈ సంగతి పునర్జన్మలపై అధ్యయనం చేస్తున్న అమెరికా ప్రొఫెసర్ డాక్టర్ స్టీవెన్ సన్ కు తెలిసింది. మున్నాను గొంతు కోసి చంపడం, రవిశంకర్ గొంతుపై అదే స్థానంలో పొడవాటి గీతలాంటి మచ్చ ఉండటం ఆయనను ఆలోచింపజేసింది. 1964లో స్టీవెన్ సన్ భారత్ వచ్చి రవి శంకర్ను కలిశారు. అప్పటికి ఆ గుర్తు గడ్డం కింద మెడపై అడ్డంగా ఉన్న ముదురు రంగు గీతలా ఉండటాన్ని గమనించారు.
ఇక తన హత్య గురించి రవి శంకర్ చెప్పిన విషయాలు పరిశోధకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. తనను ఇద్దరు వ్యక్తులు చంపారని, వారిని చూసినప్పుడు భయం వేస్తుందని చెప్పేవాడు. క్షురకులు, బట్టలు ఉతికేవాళ్లను చూసినా చిన్నతనంలో రవి శంకర్ భయపడేవాడని అతని పాఠశాల ఉపాధ్యాయుడు ఒకరు చెప్పారు.
ఇవన్నీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసినా, రవిశంకర్ తండ్రి మాత్రం వీటిని నమ్మేవాడు కాదు. రవి శంకర్ తనను మున్నాగా భావిస్తూ జాగేశ్వర్ ప్రసాద్ కుటుంబంతో అనుబంధం పెంచుకుంటాడేమోననే భయం ఇందుకు కారణంగా కనిపించింది. మరోవైపు జాగేశ్వర్ ప్రసాద్ మాత్రం తన కుమారుడు మున్నా మళ్లీ పుట్టాడని నమ్మడం ప్రారంభించాడు. తన కొడుకు హత్య కేసును మళ్లీ తెరవడానికి రవి శంకర్ చెప్పిన విషయాలు ఉపయోగపడతాయని కూడా ఆయన ఆశించారు. అయితే రవి చెప్పిన మాటల ఆధారంగానే న్యాయపరమైన చర్య తీసుకోవడం సాధ్యం కాదని పోలీసులు చెప్పడం జాగేశ్వర్ను నిరుత్సాహానికి గురిచేసింది.
కాలం గడిచింది. 1969లో స్టీవెన్ సన్ మళ్లీ అతడిని కలిసే సమయానికి రవి శంకర్ వయసు 18 సంవత్సరాలు. కాన్పూర్లో కామర్స్ చదువుతున్నాడు. అప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రవి శంకర్ తనకు గత జన్మ జ్ఞాపకాలు పూర్తిగా గుర్తులేవని చెప్పాడు. చిన్నప్పుడు చెప్పిన విషయాలు కూడా ఇప్పుడు గుర్తుకు రావడం లేదని తెలిపాడు. చిన్నప్పుడు క్షురకులు, కత్తులు, రేజర్లంటే భయం ఉండేదని, ఇప్పుడు ఆ భయం లేదని చెప్పాడు. మెడపై ఉన్న గుర్తు స్థానం మారినట్లు స్టీవెన్సన్ గమనించారు. 1971లో ఆయన మళ్లీ వచ్చినప్పుడు ఆ గుర్తు అతడి గడ్డం కింద భాగంలో సుమారు 3 మిల్లీమీటర్ల వెడల్పున్న గీతలా మారి ఉండటాన్ని గుర్తించారు. అంటే, రవి పెరుగుతున్న కొద్దీ ఆ గీత స్థానం కూడా మారుతోందని నిర్ధారణకు వచ్చారు.
ఇంతకీ రవిశంకర్ మెడపై కనిపించిన ఆ గీత శరీరంపై యాదృచ్ఛికమైన గుర్తేనా? లేక మున్నా గొంతుపై పడిన కత్తి గాయానికి ఏదైనా సంబంధముందా? చిన్ననాటి జ్ఞాపకాలు నిజంగా గతజన్మకు చెందినవేనా? లేక వినడం, ఊహించడం, కుటుంబం లేదా పరిసరాల ప్రభావంతో ఏర్పడినవా? ఈ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం ఇప్పటికీ లేదు. అందుకే రవి శంకర్ కథ పునర్జన్మపై నమ్మకాలకే పరిమితం కాకుండా, మనిషి జ్ఞాపకం, అవగాహన, ఊహాశక్తి గురించి కూడా ఒక అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.
- సత్యకిశోర్ కొండ్రెడ్డి
ఇదీ చదవండి: పాదాల దుర్వాసన... 10ఏళ్ల న్యాయపోరాటం! కోర్టు ఏం చెప్పిందంటే?
Tags : 1