భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్
Breaking News
‘ఇట్స్ థ్రిల్లింగ్ టైమ్’ అంటున్న బాలీవుడ్ స్టార్స్!
Published on Sun, 10/18/2026 - 09:27
బాలీవుడ్లో ఎక్కువగా యాక్షన్ సినిమాలు వస్తుంటాయి. అయితే ఇటీవలి కాలంలో మైథాలజీ, హారర్ జానర్లో సినిమాలు ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా కొందరు బాలీవుడ్ స్టార్స్ ‘ఇట్స్ థ్రిల్లింగ్ టైమ్’ అంటూ థ్రిల్లర్ జానర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ జానర్లో రానున్న కొన్ని సినిమాలపై ఓ లుక్ వేద్దాం.
విలన్ కింగ్
యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు చేయడం షారుక్ ఖాన్‌కు కొత్త కాదు... ఎప్పటి చిత్రాలో ఎందుకు? ఇటీవలి కాలంలో ఆయన హీరోగా నటించిన ‘పఠాన్’ (2023), ‘జవాన్’ (2023) చిత్రాలు మంచి యాక్షన్ థ్రిల్లర్స్‌గా ప్రేక్షకులను అలరించాయి. ఏ స్థాయిలో అంటే... ఈ రెండు చిత్రాలూ రూ. 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించాయి. తాజాగా ‘కింగ్’ అనే మరో యాక్షన్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నారు షారుక్ ఖాన్. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే... ఇందులో షారుక్ ఖాన్ క్యారెక్టర్లో నెగటివ్ షేడ్స్ ఉంటాయి. ఓ హంతకుడు పాత్రలో ఆయన కనిపిస్తారట.
(చదవండి: ‘రణబాలి’పై సందీప్ రెడ్డి వంగా రివ్యూ)
‘పఠాన్’ సినిమాతో షారుక్ ఖాన్‌కు హిట్ ఇచ్చిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ ‘కింగ్’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. షారుక్ ఖాన్ తనయ సుహానా ఖాన్ ఈ చిత్రంలో మరో లీడ్ రోల్ చేయగా, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ, అనిల్ కపూర్ ఇతర ప్రధాన ప్రాతల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో షారుక్ ఖాన్ – సుహానా ఖాన్ గురుశిష్యుల పాత్రల్లో నటిస్తున్నారు. గౌరీ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్, మమతా ఆనంద్ నిర్మించిన ‘కింగ్’ ఈ ఏడాది డిసెంబరు 24న విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే... థియేట్రికల్‌గా సుహానా ఖాన్‌కు ఇది తొలి చిత్రం కావడం విశేషం.
విదేశాల్లో థ్రిల్
అక్షయ్ కుమార్ సరికొత్త జానర్లోకి ఎంట్రీ అయ్యారు. ఏలియన్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ‘సమూక్’ సినిమాలో అక్షయ్ కుమార్ నటిస్తున్నారు. గతంలో యాక్షన్, థ్రిల్లర్ జానర్స్‌లో సినిమాలు చేసినప్పటికీ కథలో గ్రహాంతరవాసుల ప్రస్తావన మిళితమైన చిత్రంలో అక్షయ్ కుమార్ నటించలేదు. ఈ విషయాన్నే ఇటీవల అక్షయ్ కుమార్ కూడా ప్రస్తావించారు. ‘సమూక్’ తనకొక సరికొత్త జానర్ అని, యాక్టర్‌గా కొత్తగా నటించబోతున్నానని పేర్కొన్నారు.
ఈ సినిమా విశేషం ఏంటంటే... దాదాపు 70 శాతం షూటింగ్ లండన్‌లో జరుగుతుంది. మిగిలిన పది శాతం చిత్రీకరణ ముంబైలో ప్లాన్ చేశారు. ఆల్రెడీ లండన్‌లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ చిత్రంలో వివాన్ అహుజా పాత్రలో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. మిలి టరీ రియలిజమ్, సర్వైవల్ హారర్, ఏలియన్ మైథాలజీ అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుంది. విపుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్న ‘సమూక్’ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
ప్రళయ్
‘ధురంధర్, ధురంధర్: ది రివెంజ్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత రణ్వీర్ సింగ్ మరో కమర్షియల్ మూవీ చేస్తారేమో అనే టాక్ బాలీవుడ్లో బలంగా వినిపించింది. కానీ రణ్వీర్ సింగ్ డిఫరెంట్‌గా ఆలోచించారు. సర్వైవల్ థ్రిల్లర్ జానర్లో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైందని తెలిసింది. ఈ చిత్రానికి జై మెహతా దర్శకత్వం వహిస్తుండగా, కళ్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తున్నారు.
ఈ సినిమాకు ‘ప్రళయ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని బాలీవుడ్ సమాచారం. అనన్య బిర్లా, హన్సల్ మెహతా, సాహిల్ సైగల్, రణ్వీర్ సింగ్ ఈ సినిమాను దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారని సమాచారం. తొలి షూటింగ్ షెడ్యూల్‌ను మేకర్స్ ఆస్ట్రేలియాలో ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ ముంబైలోనే మొదలైంది. ప్రపంచం అంతమయ్యే సమయంలో సర్వైవల్ కోసం భార్యభర్తలు చేసే పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందనే ప్రచారం వినిపిస్తోంది.
కన్ఫ్యూజన్ గురు
బాలీవుడ్లో యాక్షన్ హీరోగా పేరున్న జాన్ అబ్రహాం సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘గురు’ అనే టైటిల్ అనుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రానికి రిబుదాస్ గు΄్తా దర్శకత్వం వహిస్తున్నారు. ఆల్రెడీ లండన్‌లో షూటింగ్ ్ర΄ారంభమైందని తెలిసింది. ఈ చిత్రంలో కొంత కన్ఫ్యూజన్తో కూడిన క్యారెక్టరైజేషన్లో నటిస్తున్నారట జాన్ అబ్రహాం. అంటే... తన చుట్టూ ఉన్నవారిపై అతనికి నమ్మకం ఉండదు... అలాగే పదే పదే జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుతంలో ఇబ్బంది పడుతుంటాడు. చె΄్పాలంటే... ‘గజిని’ చిత్రంలో సూర్య క్యారెక్టర్లా ‘గురు’ సినిమాలో జాన్ అబ్రహాం క్యారెక్టర్ ఉంటుందట. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.
మైథాలజీ థ్రిల్లర్
దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం ఎలాంటి అంచానలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమా ‘తుంబాడ్’ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. 2024లో ‘తుంబాడ్’ సినిమా రీ రిలీజైతే, ఈ చిత్రానికి దాదాపు రూ. 35 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. రిలీజైనప్పటి కంటే రీ రిలీజ్లో ఈ ‘తుంబాడ్’ చిత్రానికి అత్యధిక కలెక్షన్స్ రావడం విశేషం. ఇంత క్రేజ్ ఉన్న ‘తుంబాడ్’ను మేకర్స్ క్యాష్ చేసుకోకుండా ఉండరు. అందుకే సీక్వెల్‌గా ‘తుంబాడ్ 2’ను ప్రకటించారు.
‘తుంబాడ్’లో నటించిన సోహమ్ షా సీక్వెల్లోనూ లీడ్ రోల్ చేస్తున్నారు. ఆలియా భట్, నవాజుద్దీన్ సిద్ధిఖీ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే సీక్వెల్‌కు మాత్రం దర్శకుడు మారారు. తొలి భాగానికి రాహి అనిల్ బర్వే దర్శకత్వం వహించగా, మలి భాగాన్ని మాత్రం ఆదేశ్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. సోహమ్ షా, జయంతిలాల్ గడా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబరు 3న విడుదల కానుంది. ఇలా బాలీవుడ్లో థ్రిల్లర్ జానర్లో రూపొందుతున్న సినిమాలు మరికొన్ని ఉన్నాయి.
Tags : 1