ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
గాంధీ ఫొటోకు ముందు.. భారత కరెన్సీపై ఏముండేది?
Published on Fri, 10/02/2026 - 18:16
మనం రోజూ చూసే, వినియోగించే కరెన్సీ నోటు మీద గాంధీజీ ఫోటో కనిపిస్తుంది. కానీ.. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే కరెన్సీపై గాంధీజీ ఫొటో ముద్రించలేదు. బహుశా ఈ విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అయితే కరెన్సీ నోటుపై గాంధీ ఫోటో ఎప్పుడు వచ్చింది?, దీని చరిత్ర ఏమిటి అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
అశోక సింహాల గుర్తు
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. కరెన్సీ నోట్లపై ఉన్న బ్రిటిష్ రాజు కింగ్ జార్జ్ చిత్రాన్ని తొలగించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆయన స్థానంలో మహాత్మా గాంధీ ఫోటో ముద్రించాలనే ఆలోచన కూడా వచ్చింది. ఇందుకోసం.. కొన్ని డిజైన్లు కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. కానీ.. చివరికి గాంధీ ఫోటోకు బదులు, సారనాథ్‌లోని అశోక సింహాల గుర్తును ఉపయోగించాలని నిర్ణయించారు.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. భారత ప్రభుత్వం విడుదల చేసిన తొలి కరెన్సీ నోటు 1949లో వచ్చిన ఒక రూపాయి నోటు. ఈ నోటుపై బ్రిటిష్ రాజు ఫోటో.. స్థానంలో అశోక సింహాల గుర్తును ముద్రించారు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు భారత కరెన్సీపై గాంధీజీ ఫొటో కనిపించలేదు.
అప్పట్లో నోట్లపై ఇవే..
అప్పటి నోట్లపై భారతదేశ సంస్కృతి, కళలు, వ్యవసాయం, శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని ప్రతిబింబించే చిత్రాలు ఉండేవి. జంతువులు, ఆనకట్టలు, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన అంశాలకు కూడా నోట్లపై చోటు కల్పించారు. అంటే.. అప్పటి కరెన్సీ నోట్లు కేవలం డబ్బు విలువను చూపించడమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని కూడా ప్రతిబింబించేలా ఉండేవి.
1969లో తొలిసారి గాంధీజీ చిత్రం
1969లో గాంధీజీ ఫొటో తొలిసారి భారత కరెన్సీపై కనిపించింది. ఆ ఏడాది ఆయన 100వ జన్మదినం సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ప్రత్యేక స్మారక నోటును విడుదల చేసింది. ఈ నోటుపై గాంధీజీ కూర్చున్న చిత్రం ఉండగా, వెనుక భాగంలో సేవాగ్రామ్ ఆశ్రమం కనిపించేలా డిజైన్ చేశారు. అయితే ఇది సాధారణంగా చలామణిలో ఉండే నోటు కాదు. గాంధీజీ జన్మ శతాబ్ది సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక నోటుగా మాత్రమే ఉండేది.
రూ.500 నోటుపై గాంధీజీ
ఆ తర్వాత 1987లో గాంధీజీ చిత్రం మరోసారి కరెన్సీలోకి వచ్చింది. అక్టోబర్‌లో విడుదలైన కొత్త రూ.500 నోటుపై గాంధీజీ చిత్రం ముద్రించారు. ఇందులో గాంధీజీ ఒక బృందంతో కలిసి నడుస్తున్న చిత్రం ఉండేది. ఇది సాధారణంగా చలామణిలో ఉన్న కరెన్సీ నోటుపై గాంధీజీ చిత్రం కనిపించిన ముఖ్యమైన దశగా చెప్పుకోవచ్చు.
1996లో అసలు మార్పు
భారత కరెన్సీ చరిత్రలో మరో పెద్ద మార్పు 1996లో జరిగింది. ఆ సమయంలో ఆర్బీఐ మహాత్మా గాంధీ సిరీస్ ప్రారంభించింది. ఈ సిరీస్‌లో నోటు ముందు భాగంలో గాంధీజీ చిత్రాన్ని ప్రధానంగా ఉంచారు. అదే సమయంలో అశోక స్తంభం గుర్తును కూడా కొనసాగించారు. రూ.10, రూ.100 నోట్లతో ఈ సిరీస్ ప్రారంభమై, ఆ తర్వాత ఇతర డినామినేషన్లకు కూడా విస్తరించింది. ఈ కొత్త సిరీస్‌లో నకిలీ నోట్లను అరికట్టేందుకు సెక్యూరిటీ థ్రెడ్, వాటర్‌మార్క్ వంటి అదనపు భద్రతా లక్షణాలను కూడా తీసుకొచ్చారు.
ఇతర నాయకుల ఫోటోలు
భారత కరెన్సీపై గాంధీజీ ఫొటోను కొనసాగించాలా?, ఇతర ప్రముఖ నాయకుల చిత్రాలను కూడా చేర్చాలా?, అనే చర్చలు అప్పుడప్పుడు జరుగుతూనే ఉన్నాయి. జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి నాయకుల పేర్లు కూడా వివిధ సందర్భాల్లో చర్చకు వచ్చాయి. 2016లో రాజ్యసభలో ఈ అంశంపై ప్రశ్న వచ్చినప్పుడు, అప్పటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గాంధీజీ ఫొటోను మార్చాల్సిన అవసరం లేదని ఒక కమిటీ నిర్ణయించినట్లు తెలిపారు.
2022లో కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి ఫోటోలు ఉంచాలనే ప్రతిపాదన కూడా రాజకీయ చర్చకు దారితీసింది. డిజిటల్ రూపాయి డిజైన్‌లో గాంధీజీ చిత్రం లేకపోవడంపై ఆయన మునిమనవడు తుషార్ గాంధీ కూడా సోషల్ మీడియాలో స్పందించారు.
ఇదీ చదవండి: ఇదే జరిగితే.. బంగారం రూ.3 లక్షలకు!
Tags : 1