ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్
Breaking News
'తెల్లకాగితం' సినిమా రివ్యూ
Published on Fri, 10/02/2026 - 12:48
థియేటర్లలో విడుదలవడానికి ముందే ఆన్‌లైన్‌లో లీకైపోయి వార్తల్లో నిలిచిన లేటెస్ట్ తెలుగు సినిమా 'తెల్లకాగితం'. పలు చిత్రాల్లో బాలనటుడిగా ఆకట్టుకున్న హర్ష్ రోషన్ ఇందులో లీడ్ రోల్ చేశాడు. 'కోర్ట్'తో హీరోగా హిట్ కొట్టిన ఇతడు చేసిన మరో టీనేజీ 'షాకింగ్' ప్రేమకథే ఈ చిత్రం. నక్షత్ర హీరోయిన్. రమేశ్ బండ్రెడ్డి దర్శకుడు. ఈరోజే(అక్టోబరు 02) థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి?
భీమవరం దగ్గరలోని ఓ పల్లెటూరిలో రాము(హర్ష్ రోషన్).. అన్న,వదినలతో కలిసి బతుకుతుంటాడు. అదే ఊరిలో ఉండే ఆశ(నక్షత్ర).. రాము చదివే స్కూల్‌లోనే చదువుతూ ఉంటుంది. ఓసారి లంచ్ బాక్స్‌లు మారిపోవడం వల్ల మొదలైన వీరి పరిచయం.. స్నేహంగా మారి ప్రేమలో పడేంతవరకు వెళ్తుంది. ఓ ఏకాంత సందర్భంలో శృంగారంలోనూ పాల్గొంటారు. తెలిసీ తెలియని వయసులో మొదలైన ప్రేమ.. వీళ్ల జీవితాల్ని ఎలాంటి మలుపుల్ని తిప్పింది? చివరకు వీళ్లిద్దరూ ఒక్కటయ్యారా లేదా అనేది మిగతా స్టోరీ.

ఎలా ఉందంటే?
'ప్రేమ' అనే పాయింట్ ఆధారంగా తెలుగులో ఇప్పటికే కొన్ని వేల సినిమాలు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి. అయితే ప్రేమకథతో మూవీ తీసి జనాల్ని ఎంటర్‌టైన్ చేశారా? చెప్పాలనుకున్న మెసేజ్‌ని ప్రేక్షకులకు అర్థమయ్యేలా ప్రెజెంట్ చేశారా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఈ విషయంలో 'తెల్లకాగితం' టీమ్ పాస్ అయిపోయింది.
ఇప్పటి జనరేషన్ టీనేజీ పిల్లలు, మరీ ముఖ్యంగా యువత.. సొంత తల్లిదండ్రులు చెప్పే విషయాల్ని పెడచెవిన పెడుతున్నారు. తామే పెద్దోళ్లలా ఫీలైపోయి ఇంట్లో వాళ్లకు తెలియకుండా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నారు. పెద్దల దృష్టికి రాకుండా చాలా వాటిని మేనేజ్ చేస్తున్నామని అనుకుంటున్నారు. అయితే ఇలాంటి వాళ్లు చేసే తప్పులు ఎంతటి అనర్థాలకు దారితీస్తాయో చూపించే ప్రయత్నమే ఈ సినిమా.
ఓ పల్లెటూరు.. పదో క్లాస్ చదివే ఓ అబ్బాయి, అమ్మాయి మధ్య అనుకోకుండా పరిచయం, అది కాస్త ప్రేమగా మారడం.. ఇలా పెద్దగా హడావుడి లేకుండానే సినిమా మొదలవుతుంది. తెరపై చూస్తున్నది కొత్తగా ఏం లేనప్పటికీ కామెడీ, సరదా ప్రేమ సన్నివేశాల కారణంగా బోర్ కొట్టకుండా సాగిపోతుంది. 'ప్రెగ్నెన్సీ' ట్విస్ట్‌తో ఇంటర్వెల్ పడుతుంది. మరి 'ప్రెగ్నెన్సీ' అనే చిక్కుముడిని సెకండాఫ్‌లో ఎలా విప్పారనేది థియేటర్లలో చూడాలి.

సినిమా స్టోరీగా చెప్పుకొంటే జస్ట్ రెండే లైన్లలో తేలిపోతుంది. దీన్ని రెండున్నర గంటల మూవీగా తీశారు. ముఖ్యమైన సన్నివేశాలన్నీ చివర అరగంట కోసం దాచుకోవడం వల్ల అంతకు ముందు రెండు గంటల పాటు కాస్త ఎంటర్‌టైన్‌మెంట్, కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. కాకపోతే చివరలో ఇచ్చిన షాకింగ్ క్లైమాక్స్ ఎమోషనల్‌గా బాగుంది.
ఈ మూవీలో పీరియడ్స్, పుష్పవతి కావడం(మెచ్యూర్), కండోమ్.. ఇలా పలు సున్నితమైన అంశాల గురించి టీనేజీ పిల్లలు ఏమనుకుంటారో కామెడీగా బాగా చూపించారు. అలానే మనకు తెలిసినవాళ్లే కదా నమ్మితే.. ఎంతకు తెగిస్తారో ఇందులో చూపించారు. అలానే జీవితం అనే 'తెల్లకాగితం'పై ఒకసారి మచ్చ పడితే ఎంతలా అల్లకల్లోలం అయిపోతుందో ఈ మూవీలో ప్రెజెంట్ చేశారు.
'చెప్పకపోయినా సరే ఆడదాని కష్టం అర్థం చేసుకున్నప్పుడే మగాడు మెచ్యూర్ అయినట్లు' అని రాము వదిన పాత్ర చెప్పే డైలాగ్ ఆలోచింపజేస్తుంది. రాము చదువు కోసం ఈమె.. ఏకంగా కడుపులో బిడ్డని వద్దనుకుని ఆబార్షన్ చేయించుకునే సీన్ కూడా ఎమోషనల్‌గా అనిపిస్తుంది. వదిన పాత్రకు ఇలాంటి సీన్స్ ఇంకొన్ని పడుంటే బాగుండేది అనిపించింది.
ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని తల్లిదండ్రులకు నిజాయతీగా చెప్పేస్తే వాళ్లు ఎలాగోలా పరిష్కరిస్తారు. మనల్ని అపాయం నుంచి తప్పిస్తారు. అలా కాదని వాళ్లని వీళ్లని అడిగితే తప్పు మీద తప్పులు జరుగుతాయి. అలానే దారుణమైన పరిస్థితుల వరకు ఎలా వెళ్తుందో కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. టీనేజీ పిల్లలు, తల్లిదండ్రులు ఈ చిత్రం తప్పక చూడాలి!
ఎవరెలా చేశారు?
బాలనటుడిగా, 'కోర్ట్' సినిమాతో హీరోగా ఆకట్టుకున్న హర్ష్ రోషన్.. ఇందులో రాముగా ఆకట్టుకున్నాడు. తెలియని పసితనంతో ప్రేమలో పడటం, తప్పులు చేయడం, చివరకు రియలైజ్ కావడం లాంటి సీన్స్‌లో మెప్పించాడు. ఆశ పాత్రలో నటించిన నక్షత్రకు ఇదే తొలి మూవీ. చూడటానికి అందంగా ఉంది గానీ ఎమోషనల్ సన్నివేశాల్లో తేలిపోయింది. ఇంకాస్త బాగా చేసి ఉండాల్సింది. ఆశ తండ్రి మూర్తిగా అజయ్, రాము అన్న వదినలుగా చేసినవాళ్లు, అలానే మామయ్య క్యారెక్టర్ చేసిన రాజ్ కసిరెడ్డి తదితరులు బాగా నటించారు. కాకపోతే వీళ్లకు చివరి పావుగంటలోనే ఎక్కువ స్క్రీన్ స్పేస్ దొరికింది.

టెక్నికల్ విషయాలకొస్తే.. దర్శకుడు రమేశ్ బండ్రెడ్డి, టీనేజీ పిల్లలు, యువతకు చెప్పాలనుకున్న పాయింట్ తెరపైకి కన్వే అయింది. కాకపోతే క్లైమాక్స్‌లోనే కాకుండా అంతకు ముందు సీన్స్ ఇంకాస్త కనెక్ట్ అయ్యేలా రాసుకుని తీసుంటే బాగుండేది. విజయ్ బుల్గానిన్ అందించిన 'చిలక' పాట వినసొంపుగా ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఓవరాల్‌గా ఇదో డీసెంట్ మూవీ.
- చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్
Tags : 1