వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
అనుష్క శర్మ ఇన్‌స్టా పోస్ట్.. మారిపోయిన రెస్టారెంట్ రాత!
Published on Sat, 09/26/2026 - 16:56
ముంబైలోని చెంబూర్‌లో ఉన్న ఒక చిన్న చోలే భటూరే రెస్టారెంట్. దీని పేరు ఢిల్లీ సే (Delhi Se). ఇది ఒకప్పుడు దాదాపు రూ. 18 లక్షల అప్పులో కూరుకుపోయి మూతపడటానికి సిద్ధమైంది. కానీ నేడు.. కోట్లు సంపాదిస్తూ బాగా పాపులర్ అయింది. దీనికి కారణం నటి అనుష్క శర్మ చోలే భటూరే ఆర్డర్ చేయడమే. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
మూతపడే స్థితి నుంచి..
జస్పాల్ సింగ్ ఖాల్సా, మహీందర్ సింగ్ ఖాల్సా అనే ఇద్దరు సోదరులు 2021 అక్టోబర్‌లో 'ఢిల్లీ సే'ను ప్రారంభించారు. మొదట అది కేవలం 250 చదరపు అడుగుల చిన్న షాప్ మాత్రమే. అందులో మూడు టేబుళ్లు, తొమ్మిది సీట్లు మాత్రమే ఉండేవి. ప్రారంభంలో.. వ్యాపారం బాగానే ఉన్నప్పటికీ, 2022 జనవరి నుంచి కస్టమర్లు తగ్గడం మొదలైంది. సెప్టెంబర్ నాటికి పరిస్థితి మరింత దారుణంగా మారింది. దాదాపు రూ.18 లక్షల అప్పు పేరుకుపోవడంతో రెస్టారెంట్‌ను మూసేయాలని సోదరులు నిర్ణయించుకున్నారు.
అయితే అదే సమయంలో వారి జీవితాన్ని మార్చే ఒక సంఘటన జరిగింది. 2022 సెప్టెంబర్‌లో స్టాండప్ కమెడియన్ అభిషేక్ ఉపమన్యు ఢిల్లీ సేకి వచ్చి చోలే భటూరే తిన్నారు. అప్పట్లో.. ఆయన ఎవరో కూడా సోదరులకు తెలియదు. కానీ.. మరుసటి రోజు నుంచే రెస్టారెంట్‌కు కస్టమర్లు పెరగడం మొదలైంది. తర్వాత వారికి తెలిసింది ఏమిటంటే, అభిషేక్ ఉపమన్యు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తమ రెస్టారెంట్ గురించి ప్రస్తావించారు అని.
అనుష్క శర్మ ఇన్‌స్టా పోస్ట్
ఆ తర్వాత ఈ రెస్టారెంట్ గురించి అనుష్క శర్మకు కూడా తెలిసింది. ఆమె భర్త, క్రికెటర్ విరాట్ కోహ్లీకి చోలే భటూరే అంటే చాలా ఇష్టం. ముంబైలో అసలైన ఢిల్లీ రుచిలో చోలే భటూరే కోసం అనుష్క వెతుకుతున్న సమయంలో ఢిల్లీ సే గురించి తెలుసుకున్నారు.
ఒక రోజు విరాట్ కోహ్లీ ఇంటి నుంచి రెస్టారెంట్‌కు ఫోన్ వచ్చింది. రెండు ప్లేట్ల చోలే భటూరే జుహూకు పంపాలని అడిగారు. కానీ జస్పాల్‌కు అది నిజమైన ఫోన్ కాల్ అనిపించలేదు. ఎవరో తనను ఆటపట్టిస్తున్నారని అనుకున్నారు. ఎందుకంటే రెండు ప్లేట్ల ధర అప్పట్లో కేవలం రూ.120 మాత్రమే. పైగా చెంబూర్ నుంచి జుహూకు డెలివరీ చేయాలి.
ఫోన్ చేసిన వ్యక్తి డెలివరీ ఖర్చు కూడా ఇస్తామని, బ్యాంక్ వివరాలు పంపాలని చెప్పడంతో జస్పాల్‌కు మరింత అనుమానం వచ్చింది. చివరికి ఆమె విరాట్ కోహ్లీ ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నానని చెప్పినా ఆయన నమ్మలేకపోయారు. అయినా.. చివరకు ఆర్డర్‌ను తీసుకుని జుహూకు వెళ్లి చోలే భటూరే డెలివరీ చేశారు.
ఆ తర్వాత అసలు ట్విస్ట్ వచ్చింది. 'ముంబైలో చివరకు ఢిల్లీ రుచిలో ఉండే చోలే భటూరే దొరికాయని' అనుష్క శర్మ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ఈ రెస్టారెంట్ గురించి తనకు అభిషేక్ ఉపమన్యు ద్వారా తెలిసిందని కూడా చెప్పారు. ఆ ఒక్క పోస్టుతో ఢిల్లీ సే రెస్టారెంట్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది.
మారిపోయిన రెస్టారెంట్ పరిస్థితి
కొద్ది సమయంలోనే రెస్టారెంట్ ముందు భారీగా జనం చేరుకున్నారు. ఫోన్లు ఆగకుండా మోగాయి. కొంతమంది ఆరు, పది ప్లేట్ల చొప్పున ఆర్డర్ చేయడం మొదలుపెట్టారు. రెస్టారెంట్లో ఉన్న సరుకులు సరిపోలేదు. పరిస్థితి ఎంతగా పెరిగిందంటే, బయట భారీగా జనం చేరడంతో పోలీసులు కూడా అక్కడికి రావాల్సి వచ్చింది.
మొదట రోజుకు కేవలం 8 కిలోల చోలే మాత్రమే తయారు చేసేవారు. కానీ మూడు రోజుల్లోనే అది 100 కిలోలకు చేరింది. సరుకు సరిపోకపోవడంతో చుట్టుపక్కల ఇళ్లవారిని కూడా సహాయం అడిగారు. 'మీ ఇంట్లో చోలే నానబెట్టి పెట్టండి, నేను వచ్చి తీసుకెళ్తాను' అని అడిగేవారు. కొంతమంది కస్టమర్లు రెండు మూడు ప్లేట్ల కోసం కూడా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.
నెలకు రూ.2 కోట్లు
ఇంతకుముందు నెలకు కేవలం రూ.1 నుంచి 1.5 లక్షల వరకు అమ్మకాలు జరిగే పరిస్థితి నుంచి ఇప్పుడు నెలకు సుమారు రూ.2 కోట్ల అమ్మకాలు జరుగుతున్నాయని సోదరులు చెబుతున్నారు.
ఇప్పటికే ఢిల్లీ సేకి చెంబూర్, ములుండ్, అంధేరీ వెస్ట్, వాషీ ప్రాంతాల్లో నాలుగు ఔట్లెట్లు ఉన్నాయి. రోజుకు 3,000కు పైగా ప్లేట్ల చోలే భటూరే అమ్ముతున్నామని వారు చెబుతున్నారు. రోజూ సుమారు 125 కిలోల చోలే నానబెడుతున్నారు. ఒకప్పుడు రూ.18 లక్షల అప్పులతో రెస్టారెంట్‌ను మూసేయాలని అనుకున్న ఇద్దరు సోదరులు, ఇప్పుడు కోట్ల రూపాయల వ్యాపారాన్ని నడుపుతున్నారు.
ఇదీ చదవండి: బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.70 వేలు తగ్గింపు!
Tags : 1