వైరల్ వీడియో వోడ్కా తాగి వైన్స్ లోనే పడుకున్న కోతి
Breaking News
బుల్లి ఎలక్ట్రిక్ కారు.. భలే రేంజు!
Published on Sat, 09/26/2026 - 12:56
ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా రోజువారీ వినియోగానికి అనువుగా ఉండే వాహనాలకు ఆదరణ ఎక్కువగా ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కార్ల తయారీ సంస్థ నిస్సాన్ ఓ బుల్లి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ‘పిక్సో’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఎ-సెగ్మెంట్ కారు 27.5 కిలోవాట్ల ఎల్‌ఎఫ్‌పీ బ్యాటరీతో ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 259 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ తెలిపింది.
రెనాల్ట్‌తో భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన పిక్సోను నిస్సాన్ డిజైన్ చేసింది. స్లోవేనియాలోని రెనాల్ట్ నోవో మెస్టో ప్లాంట్‌లో ఈ కారును తయారు చేయనున్నారు. 2027 ప్రారంభంలో యూరప్ మార్కెట్లలో వినియోగదారులకు డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ఈ పిక్సో కారు పొడవు 3,796 మిల్లీమీటర్లు, వెడల్పు 1,790 మిల్లీమీటర్లు, వీల్‌బేస్ 2,492 మిల్లీమీటర్లు. 9.9 మీటర్ల టర్నింగ్ సర్కిల్‌తో ఇరుకైన నగర రహదారుల్లో సులభంగా మలుపులు తీసుకునేలా దీన్ని రూపొందించారు. క్యాబిన్ నలుగురికి సరిపోతుంది. వెనుక సీట్లను అవసరానికి అనుగుణంగా ముందుకు, వెనక్కు జరుపుకోవచ్చు.
కారు చిన్నదే అయినా ఇందులో ఫీచర్లు మాత్రం అదుర్స్ అంటోంది కంపెనీ. లోపల 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో పాటు 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వ్యవస్థ ఉంది. గూగుల్ బిల్ట్-ఇన్ సేవలు, గూగుల్ జెమిని, మైనిస్సాన్ యాప్, డ్రైవర్ గుర్తింపు కోసం ఫేస్ ఐడీ వంటి సాంకేతికతలను నిస్సాన్ అందిస్తోంది.అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లలో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ సిస్టమ్, ఆటోమేటెడ్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హ్యాండ్స్-ఫ్రీ పార్కింగ్ ఉన్నాయి.
పిక్సోలో 60 కిలోవాట్ల గరిష్ఠ సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. 50 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో బ్యాటరీని 15 నుంచి 80 శాతం వరకు సుమారు 28 నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. 11 కిలోవాట్ల ద్విముఖ ఏసీ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. అంటే అవసరాన్ని బట్టి వాహనం నుంచి ఇతర పరికరాలు లేదా విద్యుత్ వ్యవస్థలకు కూడా పవర్‌ను అందించే అవకాశం ఉంటుంది.
వండర్ పర్పుల్, గేర్ బ్లూ వంటి రంగుల్లో బ్లాక్ కలర్ డీటెయిల్స్‌తో ఈ కారు లభిస్తుంది. ఇంతకీ ఈ కారు ధరంతో చెప్పలేదు కదా.. కారు ధరను కంపెనీ కూడా ప్రకటించలేదు. ధర, మార్కెట్ ఆధారిత ఫీచర్లు, ముందస్తు బుకింగ్ వివరాలను వచ్చే డిసెంబర్ నుంచి వెల్లడిస్తామని నిస్సాన్ ప్రకటించింది.
ఇదీ చదవండి: 100% ఇథనాల్ కారు.. లాంచ్ ఎప్పుడో చెప్పేసిన గడ్కరీ
Tags : 1