ఉద్యోగాల్లో ‘కొత్త రిజర్వేషన్లు’ కావాలి!!

Published on Wed, 09/02/2026 - 21:35

ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే కృత్రిమ మేధ (AI) విస్తృతంగా పెరుగుతూ ఉద్యోగాలను మింగేస్తున్న నేపథ్యంలో కొత్త రకం రిజర్వేషన్లు కావాలన్న భావనలు పెరుగుతున్నాయి. అవే ‘మానవ రిజర్వేషన్లు’.

కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ (Bill Gates) కీలక ప్రతిపాదన చేశారు. సాంకేతికంగా ఏఐ చేయగలిగినప్పటికీ, కొన్ని ఉద్యోగాలను పూర్తిగా మనుషులకే కేటాయించే ‘హ్యూమన్‌ రిజర్వ్డ్‌’ (Human Reserved) కేటగిరీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రచురించిన దాదాపు 6,000 పదాల వ్యాసంలో గేట్స్‌ ఈ ఆలోచనను వెల్లడించారు.

వేగంగా మారనున్న ఉద్యోగ ప్రపంచం

ఏఐ ప్రభావం గతంలోని కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ వంటి సాంకేతిక మార్పుల కంటే వేగంగా ఉండొచ్చని గేట్స్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిజిటల్‌ వ్యవస్థల్లో ఏఐని అమలు చేసే అవకాశం ఉండటంతో, ఉద్యోగాల్లో మార్పులు దశాబ్దాల సమయం తీసుకోకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్‌, మిడ్‌-లెవల్‌ ఉద్యోగాలు గణనీయంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు.

కస్టమర్‌ సపోర్ట్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌, డేటా విశ్లేషణ, రుణాల అంచనా వంటి అనేక పనులను భవిష్యత్తులో ఏఐ నిర్వహించే అవకాశం ఉందని గేట్స్‌ పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో ఉద్యోగం కోసం శిక్షణ ఇవ్వడం మాత్రమే సరిపోదని, ప్రభుత్వాలు ముందుగానే ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

‘హ్యూమన్‌ రిజర్వ్డ్‌’ అంటే?

గేట్స్‌ ప్రతిపాదించిన ఈ విధానం ప్రకారం, AI లేదా రోబోట్లు ఒక పనిని చేయగలిగినా.. సమాజం నిర్ణయిస్తే ఆ పనిని మనుషులకే పరిమితం చేయవచ్చు. ప్రకృతి రిజర్వ్‌లలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచినట్లే, కొన్ని ఉద్యోగాలను కూడా సాంకేతిక ఆటోమేషన్‌ నుంచి రక్షించాలన్నది ఈ ఆలోచన.

ప్రత్యేకంగా వృద్ధుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య సేవలు వంటి రంగాల్లో మానవ సంబంధాలు, భావోద్వేగం, నమ్మకం కీలకమని గేట్స్‌ అభిప్రాయపడ్డారు. తన తండ్రికి అల్జీమర్స్‌ వ్యాధి సమయంలో అందిన సంరక్షణను ఉదాహరణగా తీసుకున్న ఆయన.. కొన్ని సందర్భాల్లో మానవీయ స్పర్శకు ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

అయితే ప్రతి రంగంలోనూ AIని నిషేధించాలని ఆయన చెప్పలేదు. ఉదాహరణకు విద్య, వైద్యంలో AIని పూర్తిగా తొలగించడం కాకుండా, మనుషుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఉపయోగించవచ్చని సూచించారు. కొన్ని ఉద్యోగాలను శాశ్వతంగా, మరికొన్నింటిని కొంతకాలం మాత్రమే ‘హ్యూమన్‌ రిజర్వ్డ్‌’గా ఉంచే అవకాశం ఉండాలని గేట్స్‌ అభిప్రాయపడ్డారు.

AI వినియోగంపై ‘టోకెన్‌ ట్యాక్స్‌’

ఉద్యోగాలపై AI ప్రభావాన్ని తగ్గించేందుకు మరో ఆసక్తికరమైన ప్రతిపాదనను గేట్స్‌ చేశారు. AI టోకెన్లు, రోబోట్లపై పన్ను విధించాలని సూచించారు. ప్రస్తుతం ఒక ఉద్యోగిని నియమిస్తే కంపెనీ పేరోల్‌ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదే పనిని రోబోట్‌ లేదా AI ద్వారా చేయిస్తే ఆ విధమైన పన్ను భారం ఉండకపోవడం వల్ల కంపెనీలు ఆటోమేషన్‌ వైపు వేగంగా వెళ్లే అవకాశం ఉందని ఆయన వాదించారు.

ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగాలు కోల్పోయిన వారికి రీ-స్కిల్లింగ్‌, శిక్షణ, సామాజిక భద్రతా కార్యక్రమాలకు వినియోగించవచ్చని గేట్స్‌ సూచించారు. AI వినియోగాన్ని పూర్తిగా అడ్డుకోవడం కాకుండా, మానవ కార్మికులను ఒక్కసారిగా భర్తీ చేసే వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉందని తెలుస్తోంది.

40 శాతం ఉద్యోగాలు రిజర్వ్‌ చేయొచ్చా?

గేట్స్‌ చేసిన వ్యాఖ్యల్లో మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అమెరికన్‌ మీడియా సంస్థ ఆక్సియోస్‌తో మాట్లాడిన సందర్భంగా, అత్యంత కఠినమైన రూపంలో అమలు చేస్తే ప్రారంభ దశలో దాదాపు 40 శాతం ఉద్యోగాలను ‘హ్యూమన్‌ రిజర్వ్డ్‌’గా ఉంచే అవకాశం ఉందని ఆయన ఊహించారు. అయితే ఇది తుది లక్ష్యం లేదా అధికారిక విధాన ప్రతిపాదన కాదని, ఇలాంటి సంఖ్యను నిర్ణయించడం కూడా చాలా క్లిష్టమని ఆయన అంగీకరించారు.

ప్రభుత్వాలకు గేట్స్‌ సూచన

AI ప్రభావాన్ని ఎదుర్కోవడానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ కొత్త వ్యవస్థలు అవసరమని గేట్స్‌ చెబుతున్నారు. ఉద్యోగాలు మాత్రమే కాకుండా సైబర్‌ భద్రత, ఆరోగ్యం, విద్య, పిల్లలపై AI ప్రభావం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపైనా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. AI ప్రయోజనాలు అందరికీ చేరాలంటే, దాని వల్ల ఏర్పడే నష్టాలను కూడా సమాజం ముందుగానే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నది ఆయన వాదన.

Videos

వరదకు ఎదురీది.. ప్రాణం కాపాడిన యువకుడు

మా వెనుక శేఖర్ మాస్టర్.. సుమలత మాకు అవసరం లేదు, మాకు రఘు మాస్టర్ బెస్ట్

రేవెంత్ కు కొండా పంచ్ అదిరిపోయే పంచ్

అమెరికా పునాదులు కదిలిస్తాం?

డబ్బు కోసం స్నేహితుడినే కిడ్నాప్.. పట్టించిన వాట్సాప్ మెసేజ్

చంద్రబాబు చీప్ పబ్లిసిటీపై వైఎస్ జగన్ ఆగ్రహం

ఇచ్చి ఒక నెల కూడా కాలేదు లోకేష్ ని ఏకిపారేసిన శ్రీదేవి

నచ్చకపోతే వెళ్లిపోండి జపాన్ క్రికెట్ CEO బీసీసీఐకి షాక్

దొంగతనం ఒప్పుకోమంటూ..! పోలీసుల వేధింపులపై అర్చకుడి తల్లి కన్నీళ్లు

నేనూ సీఎం అవుతా టైం వస్తే అన్నీ అవే వస్తాయి

Photos

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)

+5

అందాల ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్ (ఫొటోలు)

+5

ప్రభాస్‌ని కలిసిన డై హార్డ్ ఫ్యాన్.. షర్ట్‌పై ఆటోగ్రాఫ్‌ తీసుకున్న యంగ్‌ హీరో (ఫోటోలు)

+5

పని.. ‍ప్రకృతిలో మమేకం.. శ్రీనిధి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)