రాజీనామా చెయ్! నీకు రోజులు దగ్గర పడ్డాయి ధూళిపాళ్ల నరేంద్ర... బ్రాహ్మణుల ఉసురు ఊరికే పోదు
Breaking News
ఆకాశమే హద్దు అభద్రత వద్దు
Published on Thu, 08/27/2026 - 04:44
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని చింథ్వారా అనే మారుమూల గ్రామం నుంచి వచ్చిన పాయల్ అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా గేమింగ్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరు. ‘పాయల్ గేమింగ్’ పేరుతో యూట్యూబ్, ఇన్ స్టాగ్రామ్‌లలో లక్షలాదిగా అభిమానులను సంపాదించుకున్నారు.
మన దేశంలో పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ఈ–స్పోర్ట్స్, గేమింగ్ రంగంలో దేశవ్యాప్త పాపులారిటీతోపాటు మొబైల్స్ అవార్డ్స్ జెడ్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ అవార్నూ, గేమింగ్ క్రియేటర్ అండ్ ఫిమేల్ ఆఫ్ ది ఇయర్ గా జాతీయ స్థాయి గుర్తింపునూ దక్కించుకున్నారు.
ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా జరిగిన గేమింగ్ ఇంటరాక్షన్, రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనడం ద్వారా వార్తల్లో నిలిచారు. హైదరాబాద్‌లో తాజాగా నిర్వహించిన సంగీత–సాంకేతిక–గేమింగ్ ఉత్సవం రాయల్‌స్టాగ్ బూమ్బాక్స్లో పాల్గొన్న సందర్భంగా ఈ భారతీయ అగ్రగామి గేమర్... పాయల్ ధారే ‘సాక్షి’కి ఇచ్చినప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే..
అమ్మ సంకోచం.. నాన్న సరే...
సోషల్ మీడియా అమ్మాయిలకు మంచిది కాదనే అపనమ్మకాల మధ్య ఆన్ లైన్ గేమింగ్, యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ చేస్తానని చెప్పినప్పుడు మా అమ్మ అంగీకరించలేదు. అయితే నాన్న మాత్రం నా పట్టుదల గమనించాక నాకు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత నిదానంగా అమ్మను కూడా ఒప్పించగలిగాను.
వ్యతిరేకతను ఎదుర్కొన్నా...
గేమింగ్ ప్రయాణం ప్రారంభించిన కొత్తలో చాలా వ్యతిరేకత, విమర్శలు ఎదుర్కొన్నాను. నా చుట్టూ వచ్చిన నెగెటివిటీ, ముఖ్యంగా మగవారి నుంచి వచ్చిన విమర్శలకు తొలిదశలో తడబడినా, ఆ తర్వాత పట్టించుకోకుండా ముందుకు సాగాను. గేమింగ్ అంటే కేవలం పోటీ మాత్రమే కాదు. ఎంటర్టైన్ చేయవచ్చు, క్యాజువల్ గేమింగ్ చేయవచ్చు, ముఖ్యంగా మనలా మనం ఉండొచ్చు.. అదే నాకు స్ఫూర్తిని ఇచ్చింది. లక్షలాది మందికి నన్ను చేరువ చేసింది.
ప్రధానితో భేటీ.. ప్రయాణంలో మేటి...
నా గేమింగ్ ప్రయాణంలో ప్రధాని నరేంద్ర మోదీని కలవడం అత్యంత ముఖ్యమైన మైలురాయి. ఆయనను వ్యక్తిగతంగా కలిసి దాదాపు రెండు గంటల పాటు మాట్లాడటం కలలో కూడా ఊహించని గొప్ప అనుభవం. గేమింగ్, గేమింగ్ పరిశ్రమ, ఈ–స్పోర్ట్స్‌తో పాటు భారత్‌లో గేమ్ డెవలప్మెంట్ గురించి ఆయన నాతో చర్చించారు. ఆ సంభాషణలోని ప్రతిమాటా జీవితంలో మరచిపోలేను.
కెరీర్‌గా బెస్ట్... బ్యాకప్ ఫస్ట్...
ప్రపంచవ్యాప్తంగా చూస్తే గేమింగ్ రంగంలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. మన దేశంలో పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. అయితే గేమింగ్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే యువత ముందుగా తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. అదే సమయంలో చదువును వదిలిపెట్టకూడదు. నేను గేమింగ్ ప్రారంభించినప్పటికీ కొద్దికొద్దిగా పేరు ప్రఖ్యాతులు రావడం మొదలైనప్పటికీ కూడా చదువు కొనసాగిస్తూనే ఉన్నా. ఈ ఆటల పోటీ ప్రపంచంలో ఈ రోజు మీరు బాగా ఆడొచ్చు, రేపు మీకంటే మెరుగైన ఆటగాడు రావచ్చు. అందుకే గేమింగ్‌తోపాటు ఒక బ్యాకప్ ఆప్షన్ తప్పనిసరి. గేమింగ్‌ను సెకండరీగా తీసుకుని ముందుకెళ్లాలి.
ఆన్ స్క్రీన్... ఆఫ్ స్క్రీన్... ఒకటే నేను
‘పాయల్ గేమింగ్’గా అందరికీ తెలిసిన నాకు వ్యక్తిగత జీవితంలోని నాకు పెద్దగా తేడా ఉండదు. నా సహజమైన స్వభావాన్ని దాచుకోవాలనో, మార్చుకోవాలనో అనుకోను. ఇటీవల నేను పాల్గొన్న అలయెన్స్ రియాలిటీ షోలో చాలా మంది నా స్వభావాన్ని గమనించారు. నేను ఎప్పుడూ ఇలాగే అందరితో మాట్లాడతా. సరదాగా ఉంటానని అందరికీ అర్ధమైంది.
అమ్మాయిలూ... అలా చేయండి
అమ్మాయిలకి నా సలహా ఒకటే...‘మీకు నచ్చిన పని మనస్ఫూర్తిగా చేయండి. చుట్టూ ఉన్నవాళ్లు చేసే విమర్శలు, మాటలను బట్టి అపోహలు, అభధ్రతా భావం పెంచుకోకండి. మీరు మీలా ఉండండి. మీరు ఎంచుకున్నది మీకు నచ్చినది ఒకటే అయినప్పుడు మీరు తప్పకుండా విజయం సాధిస్తారు
అభిమానుల ప్రేమే.. ఆశీర్వాదం..
దేశంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఎవరైనా వచ్చి ‘మీరు పాయల్ గేమింగ్ కదా.. మీరంటే నాకు చాలా ఇష్టం’ అని చెప్పడం అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ నాకు అత్యుత్తమ అనుభూతి. నాకు లభిస్తున్న ప్రేమ ఒక ఆశీర్వాదం. కుటుంబంతో ఉన్నప్పుడు అభిమానులు ఫొటో కోసం వస్తే మా వాళ్లు కూడా గర్వంగా ఫీలవుతారు. అందుకే పాపులారిటీ వల్ల ప్రైవసీ కోల్పోయానని అనుకోవడం లేదు. దాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాను.
– సత్యబాబు, సాక్షి
Tags : 1