Breaking News

పరిమిత శ్రేణిలోనే ట్రేడింగ్‌!

Published on Mon, 08/17/2026 - 05:11

ముంబై: దేశీ స్టాక్‌ మార్కెట్‌ ఈ వారంలో పరిమిత శ్రేణిలోనే కదలాడొచ్చని నిపుణులు భావిస్తున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలు, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే అవకాశముంది. కార్పొరేట్‌ తొలి త్రైమాసిక (క్యూ1) ఫలితాల ప్రకటన దాదాపు ముగియడంతో, ఇకపై విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐ) పెట్టుబడుల సరళి, స్థూల ఆర్థిక గణాంకాలే మార్కెట్‌కు కీలకం కానున్నాయి. ‘హార్మూజ్‌ జలసంధి పరిణామాలు, అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలపైనే ఇన్వెస్టర్ల దృష్టి ప్రధానంగా ఉండనుంది. అంతర్జాతీయ ఫెడ్‌ విధానాలు, రూపాయి మారకం విలువ, క్రూడాయిల్‌ ధరల ఆధారంగానే సూచీలు కదులుతాయి’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ హెడ్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.  

చల్లారని చమురు ధరలు 
ట్రంప్‌ పరిపాలనా యంత్రాంగం, ఇరాన్‌ నాయకత్వం మధ్య శాంతి ఒప్పందంలో ఎలాంటి పురోగతి చోటు చేసుకోవడం లేదు. మరోవైపు హార్మూజ్‌ జలసంధిలో చమురు నౌకలపై(ట్యాంకర్లు) దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 88 డాలర్లకు చేరుకుంది. ఇరాన్‌పై నౌకాదళ దిగ్బంధనాన్ని నిరవధికంగా కొనసాగించడంతో పాటు ఆర్థిక ఒత్తిడిని మరింత పెంచుతామని అమెరికా స్పష్టం చేసింది. ఈ పశ్చిమాసియా పరిణామాలతో క్రూడ్‌ ధరలు మళ్లీ పెరగొచ్చనే అంచనాలు దలాల్‌ స్ట్రీట్‌కు ప్రతికూలాంశంగా మారొచ్చు.  

ఫెడ్‌ మినిట్స్‌పై దృష్టి 
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ సమావేశ వివరాలు (ఫెడ్‌ మినిట్స్‌) ఆగస్టు 19న విడుదల కానున్నాయి. కీలక వడ్డీ రేట్ల అంశంపై ఫెడ్‌ ఎలాంటి దృక్పథాన్ని అవలంబించనుందనే సంకేతాల కోసం మార్కెట్‌ వర్గాలు వేచిచూస్తున్నాయి. మినిట్స్‌లో ఫెడ్‌ ‘కఠిన వైఖరి’ ప్రదర్శించినట్లు కనిపిస్తే విదేశీ నిధుల రాక మందగించి భారత మార్కెట్లలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అయితే, ఇటీవల అమెరికా లేబర్‌ మార్కెట్‌ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడంతో, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపును కొంత కాలం వాయిదా వేయవచ్చనే అంచనాలున్నాయి. 

తుది దశకు ఆర్థిక ఫలితాలు 
కార్పొరేట్‌ క్యూ1 ఫలితాల ఘట్టం ముగింపునకు వచ్చింది. అంతర్జాతీయ ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా విడుదలైన ఫలితాలు మార్కెట్‌కు బలమైన మద్దతిచ్చాయి. నిఫ్టీ 50 లో 33 కంపెనీల క్యూ1 ఫలితాలు అంచనాలను మించాయి.

కొనుగోళ్ల బాటలో ఎఫ్‌పీఐలు  
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) ఆగస్టు తొలి అర్ధభాగంలో నికర కొనుగోలుదారులుగా నిలిచారు. ఆగస్టు 1–15 తేదీల మధ్య నికరంగా రూ.16,621 కోట్లు పెట్టుబడి పెట్టారు. నాణ్యమైన షేర్లు చవక వాల్యుయేషన్ల వద్ద లభిస్తుండటం, కార్పొరేట్‌ క్యూ1 ఆర్థిక ఫలితాలు మెప్పించడం, ఫెడ్‌ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలు ఎఫ్‌పీఐల కొనుగోళ్లకు కారణమయ్యాయి. అంతకు ముందు నెల (జూలై)లో రూ.20,200 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈక్విటీలతో పాటు డెట్‌ (రుణ) మార్కెట్‌పైనా విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు.

గతవారం ట్రేడింగ్‌ ఇలా.. 
వరుసగా రెండు వారాల లాభాలకు అడ్డుకట్ట వేస్తూ గతవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. దేశీయ కంపెనీల క్యూ1 ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఎగువ స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్‌ గమనాన్ని నియంత్రించాయి. బెంచ్‌మార్క్‌ సహా ప్రధాన సూచీలన్నీ స్వల్ప శ్రేణిలోనే ట్రేడయ్యాయి. ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటిస్తూ ఎంపిక చేసిన షేర్లలో మాత్రమే కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. ఫలితంగా, గత వారం మొత్తంగా సెన్సెక్స్‌ 490 పాయింట్లు (–0.62%), నిఫ్టీ 205 పాయింట్లు (–0.83%) చొప్పున నష్టపోయాయి.

నిఫ్టీ టెక్నికల్‌ అవుట్‌లుక్‌ 
ఇటీవల నిఫ్టీ సూచీకి 24,000–24,500 శ్రేణి అత్యంత కీలకమైన నిరోధంగా మారింది. ఒకవేళ షార్ట్‌ కవరింగ్‌ జరిగి ఈ స్థాయిని ఛేదిస్తే... ఆపై స్థాయిలో 24,600 – 24,800 వద్ద మరో బలమైన నిరోధం ఎదురుకావచ్చు. అమ్మకాలు చోటు చేసుకుంటే దిగువ స్థాయిలో 24,250, 24,000 వద్ద కీలక మద్దతు లభిస్తోంది. నిఫ్టీ 24,000 కంటే పైన ఉన్నంతవరకు మార్కెట్‌ కన్సాలిడేషన్‌ (స్థిరీకరణ) దశలోనే ఉంటుంది. అందుకే కీలక సపోర్ట్‌ వద్ద ‘పతనమైన ప్రతిసారి కొనుగోళ్లు’ (బై ఆన్‌ డిప్స్‌) వ్యూహాన్ని పాటించవచ్చని టెక్నికల్‌ నిపుణులు సూచిస్తున్నారు.  

Videos

అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు

దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్

రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్

సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు

కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?

పోలీసుల వాహనంలో గంజాయి, మద్యం దొరకడంపై YS జగన్ ఫైర్

చింతాడ రవికుమార్ కు బెయిల్

బీజేపీ కొత్త టీమ్ ఇదే..! DK అరుణ, లక్ష్మణకు బిగ్ షాక్

PV సింధుని 384 మంది ఫేక్ వాళ్లతో పోల్చటం సిగ్గుచేటు

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)