కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..
Breaking News
అందుకే వెండి ధరలు.. భారీగా తగ్గాయ్!
Published on Sun, 08/02/2026 - 15:14
గత ఏడాది వెండి ధరలు భారీగా ఊహకందని రీతిలో పెరిగిపోయాయి. దీంతో పెట్టుబడిదారులు కొంతవరకు లాభాలను గడించారు. అయితే.. ఈ సంవత్సరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2026 ప్రారంభం నుంచి సిల్వర్ రేటు 23 శాతం తగ్గగా.. జూన్ నెలలో దాదాపు 22 శాతం పతనమైందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో చాలామందిలో వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?, మళ్లీ పెరుగుతాయా?, అనే సందేహాలు మొదలయ్యాయి.
ధరలు తగ్గడానికి కారణాలు
వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ చమురు మార్కెట్‌లో అనిశ్చితి ఏర్పడింది. ప్రపంచంలో ఎక్కువ చమురు రవాణా జరిగే హర్మూజ్ ప్రాంతంలో సమస్యలు తలెత్తడంతో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. చమురు ధరలు పెరగడం అంటే.. కేవలం పెట్రోల్, డీజిల్ మాత్రమే ఖరీదవడం కాదు. రవాణా ఖర్చులు, ఉత్పత్తి వ్యయాలు పెరిగి దాదాపు అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. దీనినే ద్రవ్యోల్బణం అంటారు.
ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు.. అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ పరిస్థితిని నియంత్రించడానికి వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కూడా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు మార్కెట్‌లో ఉన్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బ్యాంకుల్లో డబ్బు పెట్టడం, ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టడం వంటి మార్గాలు మరింత ఆకర్షణీయంగా మారుతాయి. ఫలితంగా బంగారం, వెండి వంటి వడ్డీ రాని ఆస్తుల్లో పెట్టుబడులు తగ్గుతాయి. ఈ కారణంగా వెండి రేటు తగ్గుముఖం పట్టింది.
బంగారంతో పోలిస్తే.. వెండి కొంత భిన్నం
మరో ముఖ్యమైన కారణం.. అమెరికా డాలర్ బలపడటం. ప్రపంచవ్యాప్తంగా చమురు, బంగారం, వెండి వంటి వస్తువుల కొనుగోలు ఎక్కువగా డాలర్లలోనే జరుగుతుంది. చమురు ధరలు పెరిగినప్పుడు డాలర్‌కు డిమాండ్ కూడా పెరుగుతుంది. డాలర్ విలువ పెరిగితే వెండి వంటి విలువైన లోహాల ధరలు సాధారణంగా తగ్గే అవకాశం ఉంటుంది.
అయితే.. వెండి ధరలను ప్రభావితం చేసే అంశాలు బంగారంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. బంగారం ప్రధానంగా పెట్టుబడులు, ఆభరణాల కోసం ఉపయోగిస్తే.. వెండి పరిశ్రమల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సోలార్ ప్యానెల్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, విద్యుత్ పరికరాలు, డేటా సెంటర్లు వంటి అనేక రంగాల్లో వెండికి మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి పరిశ్రమల్లో డిమాండ్ తగ్గినా, పెరిగినా వెండి ధరలు వెంటనే ప్రభావితమవుతాయి.
వెండి మార్కెట్ పరిమాణం కూడా బంగారంతో పోలిస్తే చాలా చిన్నది. అందువల్ల కొద్దిమంది పెద్ద పెట్టుబడిదారులు కొనుగోలు చేసినా లేదా అమ్మినా వెండి ధరల్లో పెద్ద మార్పులు కనిపిస్తాయి. అందుకే.. వెండి ధరలు బంగారంతో పోలిస్తే ఎక్కువ ఒడిదుడుకులకు గురవుతుంటాయి.
రాబోయే రోజుల్లో ధరలు పెరుగుతాయా?
ప్రస్తుతం వెండి ధరలు మళ్లీ వేగంగా పెరుగుతాయని.. చెప్పడానికి స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదు. చమురు ధరలు తగ్గడం, ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం వంటి పరిణామాలు జరిగితేనే వెండి మార్కెట్‌లు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంటుంది.
కాబట్టి.. వెండిలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అయితే కొద్దికొద్దిగా దీర్ఘకాల దృష్టితో పెట్టుబడి పెట్టడం ఉత్తమం. మొత్తం పెట్టుబడుల్లో వెండి, బంగారం కలిపి పరిమిత శాతమే ఉంచాలి. వెండి మంచి అవకాశాలు ఇచ్చే ఆస్తి అయినప్పటికీ, ఇందులో ఒడిదుడుకులు ఎక్కువగా ఉంటాయని గుర్తుంచుకుని జాగ్రత్తగా పెట్టుబడి పెట్టాలి.
ఇదీ చదవండి: బ్యాంకులు మీ డబ్బుతో ఏం చేస్తాయో తెలుసా?
Tags : 1