మేకప్ మినిస్టర్ ఏమైపోయాడు..? సత్యకుమార్ యాదవ్‌పై కారుమూరి సెటైర్లు..!
Breaking News
‘ది ఒడిస్సీ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
Published on Sat, 07/18/2026 - 15:17
దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ అంటే సంక్లిష్టమైన కథలు, కాలాల ఇంద్రజాలంతో ఆడుకునే కథన శైలి, అద్భుతమైన విజువల్ అనుభవాలకే ఇప్పటివరకు చిరునామా, అయితే ’ది ఒడిస్సీ’ తర్వాత తో ఆయన పట్ల ఈ అభిప్రాయాలు సమూలంగా మారిపోతాయి. వేల ఏళ్ల క్రితం హోమర్ రాసిన మహాకావ్యాన్ని ఆధునిక తరపు ప్రేక్షకులకు సైతం సులభంగా అర్థమయ్యేలా నోలన్ తెరకెక్కించాడు. విశేషం ఏమిటంటే ఈ చిత్రం కేవలం యాక్షన్ లేదా ఫాంటసీ కాదు; యుద్ధం, పశ్చాత్తాపం, కుటుంబం, ప్రేమ, విముక్తి వంటి మానవీయ భావోద్వేగాల సమ్మేళనంగా సాగిన సమున్నత ప్రయాణం.
కధ ఏమిటి?
యుద్ధకళల్లో ఆరితేరిన పరాక్రమవంతుడైన రాజు... తప్పని పరిస్థితుల్లో ఒక భీకర యుద్ధంలో పాల్గొని అతి కష్టం మీద గెలిచి తిరిగి తన రాజ్యానికి తిరిగివచ్చే మార్గంలో ఎదుర్కున్న అడ్డంకులు, రాజ్యానికి తిరిగి వచ్చాక ఎదురైన అనూహ్య పరిస్థితులు అక్కడ మళ్లీ తన వాళ్లతోనే యుద్ధం చేయాల్సి రావడం...వీటన్నింటినీ ఎలా ఎదుర్కున్నాడు? దీనికి సమాధానమే ఈ చిత్రం.. కట్టె కొట్టె తెచ్చేలా చెప్పాలంటే ఇంతే ’ది ఒడిస్సీ’ కథ, గతంలో వచ్చిన ’ట్రాయ్’ సినిమాకు ఒక విధంగా కొనసాగింపులా అనిపిస్తుంది. ఆ సినిమాలో ట్రోజన్ యుద్ధం ఎలా ముగిసిందో చూసిన ప్రేక్షకులకు, ఆ యుద్ధంలో విజేతలైన గ్రీకు వీరులు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి చేసిన పోరాట సహిత ప్రయాణమే ఈ చిత్రంలో ప్రధాన కథ.
హైలెట్...దర్శకత్వం...
తన గత సినిమాల్లోలాగే ఈ సినిమా సక్సెస్‌లో కూడా దర్శకుడు నోలన్ ఫుల్ మార్కులు అందుకుంటాడు. ఆయన ప్రతీసారీలాగే ఈసారి కూడా చిత్రీకరణలో తన మేధస్సును ప్రదర్శించడమే కాకుండా, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేశాడు. అయితే గత చిత్రాల్లా ప్రేక్షకుడిని పజిల్స్‌తో గందరగోళానికి గురిచేయకుండా, కథనం సాగే క్రమంలో ప్రతీ దశలోనూ మానవీయ కోణాన్ని స్పర్శించడం ఆకట్టుకుంటుంది.
సాంకేతి‘కధ’
నోలన్ సినిమాల్లో సాంకేతిక నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రంలో కూడా హోయ్టే వాన్ హోయ్టెమా సినిమాటోగ్రఫీ అద్భుతంగా మెరిసింది. సముద్ర ప్రయాణాలు, యుద్ధ దృశ్యాలు, ప్రకృతి ప్రకోపాల సమయంలో సన్నివేశాలు... ప్రతీ ఫ్రేమ్ భారీ కాన్వాస్‌పై వేసిన చిత్రంలా కనిపిస్తుంది. దీని తర్వాత తప్పకుండా చెప్పుకుని తీరాల్సింది లుడ్విగ్ గోరాన్సన్ నేపథ్య సంగీతం. అది ప్రతి భావోద్వేగాన్ని మరింత బలంగా ప్రేక్షకుడికి చేరుస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాల్లో ఎంత ప్రభావం చూపుతుందో, నిశ్శబ్దమైన భావోద్వేగ భరిత సన్నివేశాల్లో కూడా అంతే గాఢతను ప్రేక్షకులు అనుభవించేలా చేయగలిగారు.
నటీనటుల ప్రదర్శన
ఒడిసియస్ పాత్రలో మ్యాట్ డేమన్ తన కెరీర్‌లోని అత్యుత్తమ నటనల్లో ఒకదాన్ని కనబరిచాడు. యుద్ధ వీరుడి గర్వం, తన అనుచరులను కాపాడలనే థీరత్వం, కుటుంబాన్ని చేరాలనే తపన, యుద్ధ ఫలితాలపై అంతర్మధనం... అన్నింటినీ సమ తూకంలో ప్రదర్శించాడు. ప్రేక్షకులను తన పాత్రతో ప్రయాణం చేసేలా చేయగలిగాడు. ఆయన భార్యగా నటించిన యాన్ హాతవే పెనెలోపీగా తక్కువ సన్నివేశాలున్నా, భావోద్వేగాలకు బలమైన కేంద్రంగా నిలుస్తుంది. ఆమె నటన సినిమాకు ఆత్మలా మారిందనొచ్చు. రాజ కుమారుడిగా, టామ్ హాలండ్ టెలిమాకస్ పాత్రలో పరిపక్వతను చూపించాడు. రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రతి నాయకుడిగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు.
భారతీయ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు...
గ్రీకు పురాణాల ఆధారంగా రూపొందిన కథ అయినప్పటికీ, ఇందులో కనిపించే అనేక అంశాలు భారతీయ ఇతిహాసాలను గుర్తు చేస్తాయి. యుద్ధం ముగిసిన తర్వాత ఎన్నో కష్టాలు దాటి ఇంటికి చేరాలనే నాయకుడి ప్రయాణం, రెండు దశాబ్ధాల సుదీర్ఘకాలం గడిచినా భార్యాభర్తల మధ్య సడలిపోని అనుబంధం , తండ్రి మరణించలేదని నమ్ముతూ కుమారుడు తండ్రి కోసం ఎదురుచూడటం వంటి కుటుంబ విలువలు మన ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయి. అలాగే ధర్మం కోసం చేసే యుద్ధంలో గెలిచినా ఎందరో ఆప్తుల్ని కోల్పోవడం లాంటి బాధించే వాస్తవాల్ని గుర్తించడం...ఇలాంటి భావాలు రామాయణం, మహాభారతంలో కనిపించే విలువలను తలపిస్తాయి. అందుకే ఈ కథ భారతీయ ప్రేక్షకులకు కొత్తగా కాకుండా, బాగా పరిచయమున్నట్టు అనుభూతిని కలిగిస్తుంది. చివర్లో వచ్చే విల్లు ఎక్కుపెట్టే పరీక్ష చాలామందికి రామాయణంలో శ్రీరాముడు శివధనుస్సును ఎత్తిన ఘట్టాన్ని గుర్తు చేస్తుంది. అలాగే బలవంతుడే కాదు, నిజమైన అర్హుడే ఆ విల్లును ప్రయోగించగలడనే భావన మన పురాణాల్లో కనిపించే వీర పరీక్షలను తలపిస్తుంది.
హైలెట్స్...
ట్రోజన్ యుద్ధంలో గ్రీకులు ఉపయోగించిన భారీ చెక్క గుర్రం ఇప్పటికీ ప్రపంచ చరిత్రలో అత్యంత తెలివైన యుద్ధ వ్యూహంగా చెప్పుకుంటారు. ఓటమి అంచుల్లో నిలిచినప్పటికీ... గుర్రం లోపల సైనికులను దాచిపెట్టి ట్రోయ్ నగరంలోకి ప్రవేశించి చివరి క్షణంలో యుద్ధాన్ని గెలిచిన ఘట్టాన్ని ఈ సినిమాలో కూడా గుర్తు చేస్తారు.
ఆ సినిమా చూడని ప్రేక్షకులకు ఇది ఉపశమనం ఇస్తుంది. గెలుపు తర్వాత ప్రారంభమయ్యే ఒడిసియస్ తిరుగు ప్రయాణంలో దేవతల శాపాలు ఎదుర్కుంటాడు. అలాగే సముద్ర తుఫాన్లు, భయంకరమైన రాక్షసులు, మంత్రగత్తెలు, ప్రాణాంతక ద్వీపాలు... ఇలా ప్రతి అడుగూ ఒక పరీక్షగా మారుతుంది. ఇవన్నీ విజువల్ ట్రీట్స్ అందిస్తాయి.
ప్రత్యేకంగా ఒంటికన్ను రాక్షసుడు సైక్లోప్స్ తో జరిపే పోరాటం సినిమా హైలైట్‌లలో ఒకటి. బలంతో కాకుండా తెలివితో అతడిని ఓడించే విధానం ఆకట్టుకుంటుంది. అలాగే సముద్ర దేవుడు పోసైడన్ కోపం వల్ల ఎదురయ్యే తుఫాన్లు, మోహింపజేసే సైరన్స్ , మంత్రగత్తె సిర్సే, చివర్లో తన రాజ్యంలోకి చేరాక శత్రువులను ఎదుర్కొనే పోరాటం... వేటికవే అన్నట్టుగా కళ్లకు విందు చేస్తాయి.
దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ఈ ప్రయాణాన్ని కేవలం ఫాంటసీగా కాకుండా, ఇంటికి చేరాలనే ఒక మనిషి ఆరాటం, కుటుంబ సభ్యుల మధ్య పరస్పర ఆరాటం, యుద్ధం తర్వాత మనిషి మానసిక సంఘర్షణ వంటి భావోద్వేగాలతో ముడిపెట్టడం వల్ల సినిమా మరింతగా హృదయానికి దగ్గరవుతుంది. ’ది ఒడిస్సీ’ కేవలం ఒక గ్రీకు పురాణ చిత్రం కాదు; భారతీయ ప్రేక్షకులు తమ ఇతిహాసాల జ్ఞాపకాలను కూడా ఆస్వాదిస్తూ చూడగలిగే గొప్ప విజువల్, ఎమోషనల్ అనుభవంగా నిలుస్తుంది.
లోపాలు
హెలెన్ పాత్రలో నటించిన లుపిటా న్యోంగో నటనపై పెద్దగా విమర్శలు లేవు. కానీ "ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళ"గా వర్ణించిన హెలెన్ పాత్రకు ఆమె ఎంపిక సరిపోలేదు. ఇది ప్రధానంగా నటన కంటే కాస్టింగ్‌కు సంబంధించిన చర్చ. మరోవైపు, నోలన్ తన కథన దృష్టికోణానికి అనుగుణంగానే ఈ ఎంపిక చేశారని, అందం కంటే పాత్రలోని మానవీయ కోణాన్ని చూపించాలని భావించారని అయన టీమ్ సభ్యులు అంటున్నారు.
హోమర్ రచనతో పోలిస్తే అథీనా, సిర్సే, కాలిప్సో వంటి పాత్రలను నోలన్ కుదించేశాడనే భావన కలుగుతుంది. అలాగే నిడివి కూడా కాస్త తగ్గిస్తే బాగుండేది.
ఒడిసియస్ ఎదుర్కొనే అనేక అడ్డంకుల్ని ఒకే సినిమాలో చెప్పాల్సి రావడంతో ముఖ్య మైన కొన్ని సంఘటనలు వేగంగా ముగిసి పోయాయి అనిపిస్తుంది
గ్రీకు పురాణ కథ అయినప్పటికీ, అమెరికన్ యాసలో సంభాషణలు, కొన్ని దుస్తులు, ఆయుధాల రూపకల్పన, విభిన్న జాతుల నటీనటుల ఎంపిక వల్ల "చారిత్రక వాస్తవికత తగ్గింది" అనిపిస్తుంది. అయితే ఇవి నోలన్ సృజనాత్మక నిర్ణయాలని టీం స్పష్టత ఇచ్చింది .
పెద్ద తారాగణం ఉన్నప్పటికీ, కొందరు ప్రముఖ నటీనటులకు చాలా తక్కువ స్క్రీన్ టైమ్ మాత్రమే దక్కడం ముఖ్యంగా హెలెన్ పాత్ర కథపై పెద్దగా ప్రభావం చూపలేకపోవడం...లోపాలు గా కనిపిస్తాయి.
–సత్యబాబు
Tags : 1