మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో దుశ్శాసన పర్వం
Breaking News
వృద్ధికి పశ్చిమాసియా గండం
Published on Sat, 07/18/2026 - 06:00
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధం, రుతుపవనాలపై అనిశ్చితి నెలకొనడం తదితర అంశాలు దేశ ఆర్థిక వృద్ధికి కీలక రిస్కులుగా పరిణమించవచ్చని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. ద్రవ్య, ఆర్థిక విధానాలు పటిష్టంగా ఉండటం వల్లే భారత్ జీడీపీ వృద్ధి అధిక స్థాయిలో ఉంటోందని ఆయన చెప్పారు. ‘అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత్ గత కొన్నేళ్లుగా 7 శాతం పైగా వృద్ధి రేటు సాధిస్తోంది. ఆర్థికంగా ఫండమెంటల్స్ బలంగా ఉండటంతో గత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం సాధించింది‘ అని పేర్కొన్నారు.
పలు సవాళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.6 శాతం స్థాయిలో ఉండొచ్చనే ఆర్‌బీఐ అంచనా వేస్తున్నట్లు మల్హోత్రా వివరించారు. సరఫరా తరఫు సవాళ్ల కారణంగా జూన్‌లో ద్రవ్యోల్బణం, ఆర్‌బీఐ నిర్దేశించుకున్న 4 శాతం లక్ష్యానికి మించి నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణ అంచనాలను 4.6 శాతం నుంచి 5.1 శాతానికి ఆర్‌బీఐ పెంచినట్లు మల్హోత్రా చెప్పారు. పెద్ద సంఖ్యలో జనాభా వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్న నేపథ్యంలో రుతుపవనాల తీరుతెన్నులు కీలకంగా ఉండనున్నాయని ఆయన పేర్కొన్నారు. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 17 శాతంగా ఉంటుంది.
స్థిరంగా రూపాయి...
అంతర్జాతీయంగా అనిశ్చితి పెరగడం, డాలరు బలపడటంలాంటి అంశాలు ఉన్నప్పటికీ పోటీ దేశాలతో పోలిస్తే రూపాయి స్థిరంగానే ఉన్నట్లు మల్హోత్రా చెప్పారు. ‘పశ్చిమాసియాలో యుద్ధం తర్వాత డాలరు మరింత బలపడింది. చాలా మటుకు దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. గ్లోబల్ కోణంలో చూస్తే రూపాయి పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు భావించవచ్చు‘ అని పేర్కొన్నారు.
రికార్డు ఎఫ్‌డీఐలు..
గతేడాది స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రికార్డు స్థాయిలో 95 బిలియన్ డాలర్లకి చేరినట్లు మల్హోత్రా వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే 7 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌డీఐలు వచ్చినట్లు చెప్పారు. మధ్యకాలికంగా, దీర్ఘకాలికంగా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితి పటిష్టంగానే ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందిస్తూనే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తుందన్నారు. ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో, స్థిరంగా ఉంటే నిలకడగా వృద్ధి సాధించేందుకు దోహదపడగలదని చెప్పారు. మరోవైపు, వివిధ రంగాలవ్యాప్తంగా రుణ వృద్ధి మెరుగ్గానే ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం మీద బ్యాంక్ క్రెడిట్ వార్షికంగా 18 శాతం, మే నెలతో పోలిస్తే జూన్‌లో 17.8 శాతంగా నమోదైనట్లు వివరించారు. కస్టమర్ సరీ్వస్‌ను మెరుగుపర్చుకునేందుకు, నిర్వహణ వ్యయాలను తగ్గించుకునేందుకు, సైబర్‌సెక్యూరిటీ, డేటా ప్రైవసీ లీక్‌లను నిరోధించేందుకు గాను ఏఐని వినియోగించుకునేలా బ్యాంకులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Tags : 1