ట్రంప్ వెనక్కి తగ్గిన వెనుక షాకింగ్ నిజాలు
Breaking News
ఉదయం 3:30 వరకు పబ్‌లు, రెస్టారెంట్లు ఓపెన్!
Published on Wed, 07/15/2026 - 13:20
ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాల నేపథ్యంలో సిలికాన్ సిటీ బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోర్నమెంట్‌కు సంబంధించిన సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్ ఉన్న రోజుల్లో (జులై 14, 15, 19 తేదీలు) నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లను రాత్రి 1 గంటకు బదులు తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచేందుకు బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. కర్ణాటక పోలీస్ చట్టం పరిధిలో ఈ తాత్కాలిక సడలింపు ఇచ్చారు. అయితే, ఈ ఉత్తర్వులు కేవలం ఆహార పదార్థాల (ఫుడ్) సరఫరాకేనా లేక మద్యం (లిక్కర్) విక్రయాలకు కూడా వర్తిస్తాయా అనే అంశంపై గందరగోళం నెలకొంది.
నిర్ణయ నేపథ్యం ఏమిటి?
ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికో దేశాల వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 2:30 గంటల వరకు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్ఆర్ఏఐ) బెంగళూరు ప్రతినిధులు కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌ను కలిసి మ్యాచ్‌లు వీక్షించేందుకు వచ్చే కస్టమర్ల సౌకర్యార్థం నగరంలోని వ్యాపార వేళలను పొడిగించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి క్రీడాభిమానుల ఉత్సాహాన్ని గౌరవిస్తూనే ప్రజా భద్రత, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
లిక్కర్ అనుమతిపై సందిగ్ధత!
పోలీస్ కమిషనరేట్ జారీ చేసిన అధికారిక నోటిఫికేషన్లో ఆహార సేవలను తెల్లవారుజామున 3:30 గంటల వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. కానీ, మద్యం సరఫరా, విక్రయాలపై ఎలాంటి ప్రత్యేక ప్రస్తావన చేయలేదు. సాధారణ నిబంధనల ప్రకారం బెంగళూరులో రాత్రి 1 గంట తర్వాత మద్యం విక్రయించడం చట్టవిరుద్ధం. దీంతో పబ్‌లు, బార్ల యజమానులు ఈ ఉత్తర్వులపై సందిగ్ధత వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి స్పష్టమైన రాతపూర్వక అనుమతి లేదా నిబంధనల సడలింపు వస్తేనే తెల్లవారుజాము వరకు మద్యం సరఫరా చేయడానికి వీలవుతుందని వాదిస్తున్నారు.
శాంతిభద్రతలపై పోలీసుల నిఘా
మరోవైపు రాత్రి వేళల్లో సమయాన్ని పొడిగించడం వల్ల నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠిన నిబంధనలను విధించారు. లైవ్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసే యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ఫుట్‌బాల్ అభిమానులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నైట్‌లైఫ్ సంస్కృతికి భంగం కలగకుండా పోలీసులకు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏదేమైనా ఈ నిర్ణయం బెంగళూరు నైట్‌లైఫ్‌కు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందా లేక లిక్కర్ సందిగ్ధత వల్ల నీరుగారిపోతుందా అనేది ఎక్సైజ్ శాఖ ఇచ్చే తదుపరి స్పష్టతపైనే ఆధారపడి ఉంది.
ఇదీ చదవండి: మళ్లీ సీన్ రివర్స్.. ధరల దడ
Tags : 1