గొడ్డలి పార్టీ మాదే... ఒప్పుకున్నా టీడీపీ లీడర్
Breaking News
బెంగళూరులో ‘టెక్కీ గణేశుడు’.. ఐటీ ఉద్యోగుల క్యూ!
Published on Thu, 07/09/2026 - 05:32
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని కోరమంగళలో ఉన్న శ్రీ ప్రసన్న గణపతి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఈ ఆలయం ‘టెక్కీ గణేశుడు’ (Techie Ganesha)గా వైరల్ కావడంతో ఉద్యోగాలు, ప్రమోషన్లు, మంచి అప్రైజల్స్ కోసం ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
1979లో నిర్మించిన ఈ ఆలయం మొదట స్థానిక భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. అయితే బెంగళూరు ఐటీ హబ్‌గా ఎదిగిన తర్వాత కోరమంగళ, హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్, సర్జాపూర్, ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్ పరిసరాల్లో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇక్కడికి అధిక సంఖ్యలో రావడం ప్రారంభించారు. ఉద్యోగ మార్పు, జీతం పెంపు, ప్రమోషన్, కొత్త అవకాశాల కోసం గణపతిని దర్శించుకుంటే శుభఫలితాలు వస్తాయని చాలామంది విశ్వసిస్తుండటంతో ఈ ఆలయానికి ‘టెక్కీ గణేశుడు’ అనే పేరు ప్రాచుర్యం పొందింది.
ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ స్థానిక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్‌తో ఈ ఆలయం మళ్లీ చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం సోషల్ మీడియా ప్రచారం వల్ల ఇప్పుడు నిరంతరం రద్దీగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. రీల్స్, వైరల్ పోస్టుల కారణంగా ఆలయ ప్రశాంతత దెబ్బతిందని, స్థానికులు ఎన్నాళ్లుగానో చూసిన వాతావరణం మారిపోయిందని పేర్కొన్నారు.
అయితే నెటిజన్ల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. "దేవాలయానికి ఎక్కువ మంది రావడం మంచి విషయమే", "ప్రజలకు నమ్మకం ఉంటే వెళ్లనివ్వాలి", "భక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు" అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు మాత్రం "సోషల్ మీడియా హైప్ వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ట్రెండ్‌లుగా మారుతున్నాయి" అని అభిప్రాయపడ్డారు. మరో వినియోగదారు హైదరాబాద్‌లోని ‘వీసా బాలాజీ’గా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ప్రత్యేక కోరికల కోసం ప్రసిద్ధి చెందిన ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయని గుర్తు చేశారు.
Tags : 1