రావణ్ సంచలన వీడియో పవన్ వెన్నులో వణుకు
Breaking News
స్మాల్‌క్యాప్‌ల కొత్త ర్యాలీ.. మారుతున్న మార్కెట్ సైకిల్స్!
Published on Mon, 07/06/2026 - 11:26
మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల విషయంలో ఇటీవలి రాబడులే ప్రామాణికం. ఏ విభాగం ర్యాలీ చేస్తుంటే, అటు వైపే దూకుడుగా వెళుతుంటారు. కానీ, ఏ ఒక్క విభాగం కూడా నాన్‌స్టాప్‌గా అన్ని వేళలా ర్యాలీ చేయదన్న వాస్తవం ఎంత మందికి తెలుసు..?
ఏడాది పాటు రాబడుల్లేక విసిగించిన స్మాల్‌క్యాప్ ఫండ్స్, మళ్లీ ఇటీవలి కాలంలో ర్యాలీతో అదరగొడుతున్నాయి. లార్జ్‌క్యాప్ కంటే అధిక రాబడులతో మురిపిస్తున్నాయి. ఏడాది కాలంలో 20 శాతానికి పైనే రాబడులు ఇచ్చిన స్మాల్‌క్యాఫ్ పథకాలు ఎన్నో. ఈ కాలంలో లార్జ్‌క్యాఫ్ ఫండ్స్ సానుకూల రాబడులతో సరిపెట్టాయి. ఇలా ఏడాది, రెండేళ్లు లేదా మూడేళ్ల కాల రాబడులను ఆధారంగా చేసుకుని పెట్టుబడులను మార్చుకుంటూ వెళ్లడం మంచి ధోరణి కాదన్నది నిపుణుల హెచ్చరిక.
ఎందుకంటే ప్రతి కొన్నేళ్లకొకసారి లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్-స్మాల్‌క్యాప్ మధ్య పనితీరులో ఈ మార్పులు సహజం. తమ పెట్టుబడుల లక్ష్యం, కాల వ్యవధి, ఎంత మేర రిస్క్ తీసుకోగలరు? వీటి ఆధారంగానే కేటాయింపులు ఉండేలా చూసుకోవాలి. అప్పుడే అనుకున్న ఫలితాలు సాధించగలరు.
స్మాల్‌క్యాప్స్ ర్యాలీకి కారణాలు?
2020 నుంచి 2024 మధ్యకాలంలో (కరోనా సమయంలో మార్కెట్ పతనం తర్వాత నుంచి) స్మాల్‌క్యాప్ స్టాక్స్ బ్రహ్మాండమైన ర్యాలీ చేశాయి. దీంతో వాటి విలువలు అసాధారణ స్థాయికి (గరిష్ట స్థాయికి) చేరిపోయాయి.
ఫలితంగా 2025లో వీటిల్లో దిద్దుబాటు ఎక్కువగా కనిపించింది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను విక్రయించి లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.
ఈ పరిణామాలతో 2025లో చాలా స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో రాబడులు కాదు కదా నష్టాలు దర్శనమిచ్చాయి. కొన్నింటిలో లాభాలు నమోదైనా, అవి ఒక అంకెను మించలేదు.
ఇన్వెస్టర్ల అమ్మకాలతో వీటి విలువలు ఆకర్షణీయ స్థాయిలకు దిగొ చ్చాయి. అప్పటివరకు ఉన్న అసాధారణ విలువలు ఆవిరయ్యాయి.
దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టేవారు, సంస్థాగత ఇన్వెస్టర్లు క్రమంగా స్మాల్ స్టాక్స్‌లో కొనుగోళ్లు మొదలుపెట్టారు.
చిన్న, మధ్యస్థాయి విభాగంలో కొన్ని రంగాల కంపెనీలు ఈ కాలంలోనూ పటిష్ట పనితీరుతో బలంగా నిలిచాయి. ముఖ్యంగా తయారీ, రక్షణ, క్యాపిటల్ గూడ్స్, రైల్వే, ఈఎంఎస్, ఇండ్రస్టియల్స్ కంపెనీల్లో మ్యూచువల్ ఫండ్స్ తమ పెట్టుబడులను పెంచుకున్నాయి.
ఇక ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో స్మాల్, మిడ్‌క్యాప్ స్టాక్స్ పథకాల్లోకి రూ.6–7 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వచ్చాయి. దీంతో ఫండ్ మేనేజర్లు కరెక్షన్ సమయంలో నాణ్యమైన కంపెనీల్లో వాటాలు పెంచుకున్నారు.
దీర్ఘకాలంలో ఇలా స్టాక్స్ విలువలు గరిష్టాలకు చేరడం, తర్వాత దిద్దుబాటుకు లోను కావడం.. అక్కడి నుంచి మళ్లీ ర్యాలీబాట పట్టడం ప్రతి 2–5 ఏళ్లకు ఒకసారి తప్పకుండా కనిపిస్తుంటుంది. అందుకే దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టేటప్పుడు ప్రతి విభాగానికి నిర్ణీత మొత్తాన్ని కేటాయించుకుని, స్థిరంగా కొనసాగించడం సంపద సృష్టికి కీలకం.
ఐదేళ్లలో ఏం జరిగింది
➤2020: కరోనా వైరస్ రాకతో రేపు ఏం జరుగుతోందన్న భయంతో అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో బ్యాలెన్స్ షీట్ల పరంగా సున్నితంగా ఉండే స్మాల్‌క్యాప్ కంపెనీల షేర్ల ధరలు 40–80 శాతం మధ్య పడిపోయాయి.
➤2021: కరోనా విపత్తు నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎన్నో ఉద్దీపన చర్యలను ప్రకటించాయి. దీంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఎలా పడ్డాయో అదే మాదిరి స్టాక్స్ మళ్లీ రికవరీ చూశాయి. దీంతో స్మాల్‌క్యాప్ ఫండ్స్ ఏడాది కాలంలోనే 50–80% రాబడులను అందించాయి.
➤2022: లిక్విడిటీ మితిమీరిపోవడంతో ఆర్‌బీఐ కీలక రేట్ల పెంపును మొదలు పెట్టింది. దీంతో లార్జ్‌క్యాప్ కంపెనీలు మెరుగైన ప్రదర్శన చేశాయి. లిక్విడిటీ తగ్గితే చిన్న కంపెనీలకు ఆకర్షణ తగ్గుతుంది.
➤2023-24: తయారీ, మూలధన వ్యయాల బూమ్ మొదలైంది.
రక్షణ, రైల్వే, ప్రభుత్వరంగ సంస్థలు, ఈఎంఎస్, ఇన్‌ఫ్రా స్టాక్స్ మంచి ర్యాలీ చేశాయి.
మరోసారి స్మాల్‌క్యాప్ స్టాక్స్ లైమ్‌లైట్‌లోకి వచ్చాయి.
ఇవన్నీ చూసి స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక కూడా గణనీయంగా పెరిగిపోయింది.
స్మాల్‌క్యాప్ స్టాక్స్ పెరిగిపోవడంతో వాటి విలువలపై ఆందోళన మొదలైంది. నిపుణుల హెచ్చరికలు రావడం మొదలైంది.
దీంతో దిద్దుబాటు చోటుచేసుకుంది. స్మాల్‌క్యాప్ స్టాక్స్ పడిపోవడం చూసి రిటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన చెందారు. ఇది అమ్మకాలను మరింత పెంచింది.
➤2026: ఆకర్షణీయమైన స్థాయిల నుంచి స్మాల్‌క్యాప్ స్టాక్స్‌లో రికవరీ మొదలైంది. పశ్చిమాసియా ఘర్షణలు తగ్గడం కలిసొచ్చింది.
లార్జ్‌క్యాప్ కంటే స్మాల్‌క్యాప్ వైపే ఇన్వెస్టర్ల మొగ్గు కనిపించింది. దీంతో వాటి రాబడులు మెరుగయ్యాయి.
ఇటీవలి మూడు నెలల కాలంలో వీటి రాబడులు సానుకూలంగా ఉండడం గమనించొచ్చు.
ఇన్వెస్టర్ల కర్తవ్యం..
2020: లార్జ్‌క్యాప్స్ ఆకర్షణీయం
2021–24: స్మాల్‌క్యాప్స్ ర్యాలీ
2025: వీటిల్లో దిద్దుబాటు
2026: తిరిగి స్మాల్‌క్యాప్స్‌లో రికవరీ
అందుకే ఇన్వెస్టర్లు ఏడాది కాలం పనితీరు ఆధారంగా ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడం సరికాదు.
వివిధ మార్కెట్ సైకిల్స్‌లో స్థిరమైన పనితీరు, పోర్ట్‌ఫోలియో నాణ్యత, ఫండ్ మేనేజర్‌కు ఉన్న ట్రాక్ రికార్డు (పనితీరు చరిత్ర), రిస్క్, పెట్టుబడుల కాల వ్యవధి ఆధారంగా ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవాలి.
7–10 ఏళ్ల కాలం అంతకుమించిన లక్ష్యాల కోసం సిప్ రూపంలో మెరుగైన స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులతో సంపద సృష్టి సాధ్యమే.
కొంచెం రాబడి తక్కువ అయినా ఫర్వాలేదు స్థిరత్వం కావాలని కోరుకునే వారు, లార్జ్‌క్యాప్ లేదా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ వెంట వెళ్లొచ్చు.
లార్జ్‌క్యాప్‌లో బలహీనత ఎందుకు?
లార్జ్‌క్యాప్ ఫండ్స్ ప్రధానంగా నిఫ్టీ 50, సెన్సెక్స్ కంపెనీల్లోనే పెట్టుబడులు పెడతాయి.
ఈ ప్రధాన సూచీల్లో ఐటీ, బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకు వెయిటేజీ ఎక్కువగా ఉంది.
ఏఐ రాకతో ఐటీ కంపెనీల భవిష్యత్‌పై అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియా సంక్షోభంతో ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ వైపు ఇన్వెస్టర్లు ముఖం చాటేశారు.
వీటిల్లో చాలా స్టాక్స్‌లో సంస్థాగత ఇన్వెస్టర్ల ప్రాతినిధ్యం ఇప్పటికే గణనీయంగా ఉంది. ఈ పరిణామాలతో లార్జ్‌క్యాప్ ఫండ్స్ రాబడులు పరిమితంగానే ఉన్నాయి.
వచ్చే రెండేళ్లలో.. ఆదాయాల్లో అదే జోరు..
కంపెనీల ఆదాయాలు, నిర్వహణ లాభాలు ఇక ముందూ బలంగానే వృద్ధి చెందితే స్మాల్‌క్యాప్ ఫండ్స్ మెరుగైన ప్రదర్శన కొనసాగుతుంది.
రాబడులు మాత్రం 2021–24 మధ్య కాలంలో వచ్చినంత స్థాయిలో ఉండవు. మోస్తరు డబుల్ డిజిట్ రాబడులు (12–16 శాతం) ఉండొచ్చన్నది నిపుణుల అంచనా.
అంతర్జాతీయంగా అనిశ్చితులు పెరిగితే..
యూఎస్‌లో వడ్డీ రేట్లు గరిష్టాల్లో కొనసాగడం, ఇక్కడి నుంచి ఇంకా పెరుగుతూ వెళ్లడం, భౌగోళిక రాజకీయ ఘర్షణలు, వృద్ధి బలహీనత కొనసాగితే స్మాల్‌క్యాప్‌నకు సానుకూలం కాదు.
ఇన్వెస్టర్లు స్మాల్‌క్యాప్ నుంచి భద్రత కోసం లార్జ్‌క్యాప్ స్టాక్స్ వైపు మళ్లొచ్చు. అనిశ్చితుల్లో సంస్థాగత ఇన్వెస్టర్లు బ్లూచిప్ కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తుంటారు. దాంతో లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో ర్యాలీ చూడొచ్చు.
ఎంపిక చేసిన కంపెనీల్లో ర్యాలీ..
ఇలాంటి పరిస్థితుల్లో ఫండ్ మేనేజర్లు ఎంపిక చేసిన కంపెనీలకే పెట్టుబడుల పరంగా ప్రాధాన్యం ఇస్తుంటారు.
బలమైన క్యాష్ ఫ్లో, తక్కువ రుణ భారం, ఆదాయం, లాభాల్లో స్థిరమైన వృద్ధి, వ్యాల్యుయేషన్స్ సహేతుక స్థాయిలో ఉన్న వాటివైపు మొగ్గుచూపిస్తారు.
దీంతో స్మాల్‌క్యాప్‌లోనే కొన్ని ఫండ్స్ మెరుగైన రాబడులు ఇస్తే, కొన్ని ఢీలాపడొచ్చు.
Tags : 1