చెత్త వేయొద్దన్నందుకు GHMC మహిళపై దాడి!
Breaking News
‘ప్రైమేట్’ రివ్యూ : అలాంటివాళ్లు చూడకూడని సినిమా
Published on Sat, 06/27/2026 - 08:26
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ప్రైమేట్’ ఒకటి. ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
భయం... మనిషిని, మనిషి ఆలోచనలను ఎలాంటి స్థితిలోనైనా ఏ క్షణమైనా ఆపేయగల ఏకైక భావోద్వేగం ఈ భయం. ఎంతటి ధైర్యవంతులైనా, దమ్మున్నవారైనా ఈ భయమనేది ఒక్కసారి కలిగితే పరిగెత్తాల్సిందే. ఆ నేపథ్యంలో ఎన్నో సినిమాలను ఇప్పటికే మనం చూశాం. కానీ ఈ ‘ప్రైమేట్’ సినిమా కొంత విభిన్నం. ప్రైమ్ వీడియో వేదికగా ఈ చిత్రం స్టీమ్ అవుతోంది. మొదటి పది నిమిషాలు వదిలేస్తే మిగతా ప్రతి నిమిషం ప్రేక్షకుడిని భయంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందీ సినిమా. అందుకే భయపడేవారు, అనారోగ్యంగా ఉన్నవారు ఈ సినిమాకి దూరంగా ఉండడమే మంచిది. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓసారి చూద్దాం.
హవాయి కొండ ప్రాంతంలో లూసీ కుటుంబం ఓ చింపాజీతో పాటు ఉంటుంది. చింపాంజీని తమ కన్నబిడ్డలకన్నా మమకారంగా పెంచుకుంటుంటారు. చింపాంజీని బెన్ అని పిలుచుకుంటారు. ఓ రోజు ఎక్కడ నుండో వచ్చిన మంగూస్ అనుకోకుండా బెన్‌ని కరిచి వెళ్ళగా దానికి ర్యాబిస్ వ్యాధి సోకుతుంది. దాంతో బెన్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుంటుంది. ఇవేమీ తెలియని లూసీ తన స్నేహితులను చిన్న పార్టీ కోసం ఇంటికి పిలుస్తుంది. ఇంతలో పిచ్చి పట్టిన బెన్ ఏమో లూసీ స్నేహితులలో ఒకరిని అత్యంత కిరాతకంగా దాడి చేసి, చంపేస్తుంది.
దీంతో బిత్తరపోయి భయపడ్డ లూసీ బృందం స్విమ్మింగ్ పూల్‌లో దూకేస్తుంది. ర్యాబిస్ సోకిన చింపాంజీకి నీళ్ళంటే అలర్జీ కాబట్టి వాళ్ళ దగ్గరకు రావాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటుంది. మరి... నీళ్ళలో ఉన్న లూసీ బృందం బెన్ చేతికి చిక్కుతుందా? లేక లూసీవాళ్ళు తప్పించుకుంటారా? అన్న విషయాన్ని మాత్రం ‘ప్రైమేట్’ సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా సూపర్ థ్రిల్లింగ్. అందుకే భయపడేవారు, అనారోగ్యం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని చూడకూడదు. థ్రిల్లింగ్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ఈ సినిమా ఓ ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. ప్రేక్షకుడు సినిమా మొత్తం కన్నార్పకుండా కూర్చోబెట్టే స్క్రీన్‌ప్లేతో కూడుకున్నదీ సినిమా. మస్ట్ వాచ్ ఫర్ థ్రిల్లింగ్ లవర్స్.
– హరికృష్ణ ఇంటూరు
Tags : 1