AP BJP చీఫ్ లేఖ.. ఏమని ఉంది అంటే..!
Breaking News
అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ నియామకం
Published on Mon, 06/15/2026 - 19:15
ప్రముఖ కార్పొరేట్ వైద్య సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ తమ సరికొత్త హెల్త్ టెక్ స్పిన్-ఆఫ్ (నూతన విభాగం) పునర్నిర్మాణంలో భాగంగా కీలక ప్రకటన చేసింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) నుంచి ఈ ప్రతిపాదిత పథకానికి తుది ఆమోదం లభించిన అనంతరం అపోలో హెల్త్ టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభన కామినేనిని నియమించనున్నట్లు అధికారికంగా ధ్రువీకరించింది. కంపెనీ ప్రతిపాదిత విభజన, అపోలో హెల్త్ టెక్ లిస్టింగ్ (స్టాక్ మార్కెట్లో నమోదు), కార్పొరేట్ గవర్నెన్స్ (పాలనా ఫ్రేమ్ వర్క్)కు సంబంధించిన అదనపు వివరాలను ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
12 మందితో బోర్డు ఏర్పాటు
దీర్ఘకాలిక విలువ సృష్టి, పారదర్శకమైన పర్యవేక్షణను నిర్ధారించడానికి ఈ పునర్నిర్మాణ పథకంలో బలమైన అడ్మినిస్ట్రేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించినట్లు అపోలో తెలిపింది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. అపోలో హెల్త్ టెక్ బోర్డులో మొత్తం 12 మంది డైరెక్టర్లు ఉంటారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బోర్డులో సగం మంది (ఆరుగురు) స్వతంత్ర డైరెక్టర్లుగా వ్యవహరిస్తారు. బోర్డులోని ప్రతి డైరెక్టర్ తమ విశ్వసనీయ విధులకు కట్టుబడి ఉంటారని, స్వతంత్ర డైరెక్టర్లు స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ సమతుల్య నిర్ణయాలు తీసుకునేలా చూస్తారని కంపెనీ పేర్కొంది. నిబంధనలను పర్యవేక్షించేందుకు ఒక లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌ను నియమించనున్నట్లు, బోర్డు వ్యవహారాలను క్రమానుగతంగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది.
శోభన కామినేని నియామక నిబంధనలు, పదవీకాలం, వేతన ప్యాకేజీకి సంబంధించి వాటాదారుల అనుమతిని త్వరలోనే కోరనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. అలాగే, పాలనాపరమైన పారదర్శకత కోసం పెట్టుబడిదారు లేదా ప్రమోటర్ గ్రూప్ వాటా 10 శాతం కంటే తగ్గితే వారి నామినేషన్ హక్కులు ముగుస్తాయి.
అప్‌సైడ్ అగ్రిమెంట్ వివరాలు
ఈ విలీన పథకంలో భాగమైన ‘అప్‌సైడ్ అగ్రిమెంట్’ గురించి వస్తున్న ఊహాగానాలకు అపోలో తెరదించింది. ఈ ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిధులను వ్యూహాత్మక పెట్టుబడిదారు రాస్మేలి (Rasmeley) మాత్రమే సమకూరుస్తుందని స్పష్టం చేసింది. ఈ ఒప్పందం వల్ల అపోలో హెల్త్ టెక్ నుంచి గానీ, దాని ప్రస్తుత వాటాదారుల నుంచి గానీ ఎటువంటి నగదు బయటకు వెళ్లదు.
వ్యూహాత్మక పునర్నిర్మాణం లక్ష్యం ఇదే..
అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చేపట్టిన ఈ భారీ విభజన, పునర్నిర్మాణ పథకం వెనుక స్పష్టమైన వ్యాపార వ్యూహం ఉంది. కంపెనీకి చెందిన సేవలను విడివిడిగా విభజించి (స్పిన్ ఆఫ్), విలీనం చేయడం ద్వారా స్వతంత్రంగా మార్కెట్లో లిస్ట్ చేయనున్నారు. ఇందులో ప్రధానంగా ఓమ్నిఛానల్ రిటైల్ ఫార్మసీ, ఫార్మసీ పంపిణీ వ్యాపారం, డిజిటల్ హెల్త్ వ్యాపారం (Apollo 24/7 వంటి డిజిటల్ సేవలు) వంటి విభాగాలన్నింటినీ ‘అపోలో హెల్త్ టెక్’ గొడుగు కిందికి తెచ్చి ప్రత్యేకంగా వృద్ధి పథంలో నడిపించనున్నారు.
ఇదీ చదవండి: డబ్బుతో కొనలేని ‘జన్మ’బంధం
Tags : 1