SBI క్రెడిట్ కార్డులు వాడేవారికి షాక్.. జులై 1 నుంచి కొత్త రూల్స్
Breaking News
ఏఐ మౌలిక సదుపాయాల ‘మహారాజులు’!
Published on Sat, 06/06/2026 - 10:01
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే ప్రపంచవ్యాప్తంగా అందరికీ మైక్రోసాఫ్ట్, గూగుల్ లేదా ఎన్విడియా వంటి సాఫ్ట్‌వేర్, సెమీకండక్టర్ దిగ్గజాలే గుర్తుకు వస్తాయి. ఈ రేసులో భారతదేశం నేరుగా సాఫ్ట్‌వేర్ రంగంలో అగ్రగామిగా కనిపించకపోవచ్చు. కానీ, ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఈ ఏఐ విప్లవానికి వెన్నుముకగా నిలుస్తూ భారత్‌కు చెందిన చిన్న, మధ్యతరహా పారిశ్రామిక సంస్థలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. డేటా సెంటర్లు, ఏఐ మౌలిక సదుపాయాల కల్పనలో కీలక పాత్ర పోషిస్తూ 2026 స్టాక్ మార్కెట్‌లో ఈ కంపెనీలు మెరుగ్గా రాణిస్తున్నాయి.
ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ఏఐ మౌలిక సదుపాయాల సరఫరా గొలుసుతో ముడిపడి ఉన్న 28 భారతీయ కంపెనీలు ఈ ఏడాది మార్కెట్లో ఏకంగా 47 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.9 లక్షల కోట్లు) అదనపు విలువను జోడించాయి. వీటి ఉమ్మడి మార్కెట్ విలువ ఒక్క సంవత్సరంలోనే దాదాపు 50 శాతం పెరగడం గమనార్హం.
దలాల్ స్ట్రీట్‌లో కొత్త ట్రెండ్
భారతీయ స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు ప్రస్తుతం ఈ ధోరణిని ‘ఏఐ కాపెక్స్ ట్రేడ్’ అని పిలుస్తున్నారు. దీనిపై యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (సీఐఓ) ఆర్.శివకుమార్ మాట్లాడుతూ ‘ఏఐ సాఫ్ట్‌వేర్ రేసులో భారతదేశం ముందంజలో లేకపోవచ్చు. కానీ గ్లోబల్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై జరుగుతున్న భారీ వ్యయం నుంచి మన కంపెనీలు భారీగా లబ్ధి పొందుతున్నాయి. పెట్టుబడిదారులు డేటా సెంటర్లు, విస్తృత సరఫరా గొలుసుతో అనుసంధానించిన కంపెనీలపై దృష్టి పెట్టాలి’ అని విశ్లేషించారు.
దూసుకుపోతున్న స్వదేశీ కంపెనీలు
స్టెర్లైట్ టెక్నాలజీస్ లిమిటెడ్: వేదాంత గ్రూప్‌నకు చెందిన ఈ ఆప్టికల్-ఫైబర్ కంపెనీ షేర్లు 2026లో ఏకంగా 530 శాతానికి పైగా పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ ఏడాది మే నెలలో ఈ కంపెనీ 1.1 బిలియన్ డాలర్ల (రూ.9,000 కోట్లకు పైగా) మల్టీ ఇయర్ మెగా ఒప్పందాన్ని దక్కించుకోవడమే ఇందుకు ప్రధాన కారణం.
హెచ్‌ఎఫ్‌సీఎల్ లిమిటెడ్: స్టెర్లైట్ ప్రత్యర్థి అయిన హెచ్‌ఎఫ్‌సీఎల్ షేర్లు కూడా ఈ ఏడాది 191 శాతం మేర లాభపడ్డాయి.
ఎంటార్ టెక్నాలజీస్ లిమిటెడ్: ప్రెసిషన్ కూలింగ్, పవర్ కాంపోనెంట్స్ తయారు చేసే ఈ కంపెనీ మార్కెట్ విలువ ఈ ఏడాది ఏకంగా మూడు రెట్లు పెరిగింది.
గ్లోబల్ ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు అవసరమైన పరికరాలను అందిస్తూ హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్, ఏబీబీ ఇండియా లిమిటెడ్, కమ్మిన్స్ ఇండియా లిమిటెడ్ వంటి పారిశ్రామిక కంపెనీలు కూడా ఈ ర్యాలీలో భారీగా లబ్ధి పొందుతున్నాయి.
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజాలు భారతదేశాన్ని ఏఐ, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా మారుస్తున్నాయి. ఇందులో భాగంగా భారీ పెట్టుబడులు దేశంలోకి వస్తున్నాయి.
అమెజాన్: 2030 నాటికి క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ కోసం 12.7 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెడుతుంది.
ఆల్ఫాబెట్ (గూగుల్): విశాఖపట్నంలోని ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్ కోసం 15.0 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది.
రిలయన్స్ జాయింట్ వెంచర్: దేశీయంగా స్థానిక డేటా సెంటర్ల నిర్మాణం కోసం 11.0 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది.
అదానీకనెక్స్: గూగుల్, ఉబెర్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకొని అంతర్జాతీయ స్థాయి డేటా సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
సెల్లర్స్ మార్కెట్‌గా..
‘డేటా సెంటర్లను నిర్మించడానికి, పవర్ సప్లై చేయడానికి, వాటిని చల్లబరచడానికి అవసరమైన పరికరాలకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన కొరత ఉంది. కొన్ని విడిభాగాల డెలివరీ కోసం ప్రస్తుతం 2 నుంచి 4 ఏళ్ల వెయింటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఇది తయారీదారులకు ‘సెల్లర్స్ మార్కెట్’గా మారింది. ఇప్పుడు గెలుచుకుంటున్న ఆర్డర్లు 2027-2029 మధ్య కంపెనీలకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెడతాయి’ అని నోమురా నివేదికలో విశ్లేషించింది. నోమురా అంచనా ప్రకారం, ప్రస్తుత డేటా-సెంటర్ బూమ్ అనేది గతంలోని గ్లోబల్ 4జీ వైర్‌లెస్ రోల్‌అవుట్, 2008 నాటి ఎల్‌ఎన్‌జీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విస్తరణ, 2010ల నాటి షేల్ గ్యాస్ బూమ్ కంటే చాలా పెద్దది.
రూ.100 లక్షల కోట్ల మార్కెట్.. కానీ..
మరో ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘ఏంజెల్ వన్’ నివేదిక ప్రకారం డేటా సెంటర్లలో ప్రపంచవ్యాప్త పెట్టుబడులు 2025-2027 మధ్య 1.2 ట్రిలియన్ డాలర్లు (దాదాపు రూ.100 లక్షల కోట్లు) దాటనున్నాయి. ఏఐ అనేది కేవలం సాఫ్ట్‌వేర్ అవకాశం మాత్రమే కాదని, ఇది దీర్ఘకాలిక మౌలిక సదుపాయాల పెట్టుబడి చక్రాన్ని సృష్టిస్తోందని ఇన్వెస్టర్లు బలంగా నమ్ముతున్నట్లు ఏంజెల్ వన్ చెప్పింది. అయితే, ఇదే సమయంలో వాల్యుయేషన్ల పరంగా హెచ్చరికలు కూడా వస్తున్నాయి.
ఏఐ అవకాశాల గురించి కేవలం ప్రకటనలు చేసే కంపెనీల కంటే ఇప్పటికే ఏఐ సంబంధిత వ్యాపారం ద్వారా ఆదాయాన్ని చూపిస్తున్న కంపెనీలకే మార్కెట్ ప్రాధాన్యత ఇస్తోంది. కానీ, కొన్ని కంపెనీల షేర్ల ధరలు ఇప్పటికే విపరీతంగా పెరగడం వల్ల అధిక వాల్యుయేషన్ల ముప్పు పొంచి ఉంది. ప్రస్తుత ధరల వద్ద కంపెనీల ఫలితాల్లో ఎలాంటి చిన్న తప్పు లేదా నిరాశ ఎదురైనా స్టాక్స్ పతనం కావడానికి ఆస్కారం ఉందని గమనించాలి.
గమనిక: స్టాక్ మార్కెట్ ద్వారా ఏదైనా కంపెనీలో నేరుగా పెట్టుబడి పెట్టేముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.
ఇదీ చదవండి: వ్యర్థాల్లో దాగున్న బంగారు అవకాశం!
Tags : 1