9 నెలలుగా జీతం ఇవ్వకపోతే ఎలా బ్రతకాలి.. ఏయూలో దళితులపై వివక్ష
Breaking News
డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్కి ఎందుకంత ప్రాధాన్యత ఇస్తారు?
Published on Sun, 05/31/2026 - 09:32
నా వయసు ఇరవై ఐదేళ్లు. మొదటిసారి గర్భం దాల్చాను. రెండు నెలలు నిండాయి, పరీక్ష చేస్తే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. కానీ నా బ్లడ్ గ్రూప్ ‘బి నెగటివ్’ అని తేలింది. దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? అసలు ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అలాగే ఒకవేళ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లికి ఈ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ సమస్య అసలు రాకుండా ఉండటానికి ఇంకా ఎలాంటి సమయాల్లో యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుందో, డెలివరీ సమయంలో బ్లడ్ అరేంజ్మెంట్ గురించి ఎందుకు అంత ప్రాధాన్యం ఇస్తారో దయచేసి వివరంగా చెప్పండి.
– లక్ష్మీ ప్రసన్న, హైదరాబాద్.
సాధారణంగా కాబోయే తల్లి బ్లడ్ గ్రూప్ నెగటివ్ (ఆర్‌హెచ్ నెగటివ్) ఉండి, భర్త బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అయితే పుట్టబోయే బిడ్డపై ఆ ప్రభావం పడకుండా ఉండటానికి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా మొదటగా భర్తకు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ ఆయనది కూడా నెగటివ్ బ్లడ్ గ్రూప్ అయితే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ భర్తది పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే మాత్రం, ఈ ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి శరీరంలో యాంటీబాడీలు తయారై బిడ్డపై ప్రభావం పడకుండా ఉండటానికి ‘ఇండైరెక్ట్ కూంబ్స్ టెస్ట్’ (ఐసీటీ) అనే రక్త పరీక్షను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే ఒకసారి చేస్తారు.
ఒకవేళ ఈ పరీక్ష ఫలితం సాధారణంగా (నెగటివ్) వస్తే తల్లి శరీరం ఇంకా సెన్సిటైజ్ అవ్వలేదని అర్థం. కాబట్టి గర్భాధారణ ఇరవై ఎనిమిదవ వారంలో మళ్ళీ ఈ పరీక్ష చేసి, అప్పుడు కూడా నెగటివ్ వస్తే తల్లికి ’యాంటీ–డి’ నివారణ ఇంజెక్షన్ ఇస్తారు. అలాగే కాన్పు అయిన తర్వాత పుట్టిన బిడ్డ బ్లడ్ గ్రూప్ పాజిటివ్ అని తేలితే డెలివరీ అయిన డెబ్బై రెండు గంటల లోపు తల్లికి మళ్ళీ యాంటీ–డి ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆమెను, భవిష్యత్తులో వచ్చే గర్భాలను సురక్షితంగా కాపాడుకోవచ్చు.
అయితే, ఒకవేళ ఈ ఐసీటీ పరీక్ష ఫలితం పాజిటివ్ వస్తే మాత్రం దానిని ‘ఇమ్యూనైజ్డ్ ప్రెగ్నెన్సీ’ అంటారు, అప్పుడు బిడ్డకు రక్తహీనత (ఎనీమియా) వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, స్కానింగ్ (మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ డాప్లర్ పరీక్ష) ద్వారా బిడ్డ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే కడుపులోనే బిడ్డకు రక్తం ఎక్కించే (ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్ఫ్యూషన్) అత్యాధునిక వసతులు, నియోనేటాలజీ విభాగాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలోనే (టెర్షియరీ సెంటర్) డెలివరీ చేయించుకోవడం చాలా సురక్షితం.
ప్రెగ్నెన్సీ కొనసాగుతున్న సమయంలో మొదటి మూడు నెలల కాలంలో గర్భస్రావం అయినా, మహిళలు స్వచ్ఛందంగా గర్భాన్ని తీసివేయించుకున్నా, గర్భాశయాన్ని క్లీన్ చేసే ప్రక్రియ జరిగినా, గర్భాశయం వెలుపల పిండం పెరిగే ‘ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ’ లాంటి సమస్యలు ఉన్నప్పుడు, మధ్యమధ్యలో కొద్దిగా బ్లీడింగ్ కనిపిస్తున్నా, గర్భం చివరలో బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు తీసి పరీక్షించే ‘అమ్నియోసెంటసిస్’ లాంటి ప్రత్యేక పరీక్షలు చేసినా, లేదా నెలలు నిండకుండానే కాన్పు అయినా సరే తల్లి శరీరం సెన్సిటైజ్ అవ్వకుండా ఉండటానికి ఈ యాంటీ–డి ఇంజెక్షన్ కచ్చితంగా రక్షణగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక డెలివరీ సమయంలో రక్త లభ్యత (బ్లడ్ అరేంజ్మెంట్) విషయానికి వస్తే, ’నెగటివ్’ బ్లడ్ గ్రూపులు అనేవి చాలా అరుదైనవి కావడంతో అత్యవసర సమయంలో ఇవి బయట త్వరగా దొరకవు, కాబట్టి డెలివరీ సమయంలో ఒకవేళ తల్లికి అధిక రక్తస్రావం లాంటి అత్యవసర పరిస్థితి ఎదురైతే రక్తం కోసం ఇబ్బంది పడకుండా ఉండటానికి ముందస్తు జాగ్రత్తగా ఒక బ్లడ్ డోనర్‌ను సిద్ధంగా ఉంచుకోవడం, ఆసుపత్రిలో రక్తం అందుబాటులో ఉండేలా చూసుకోవడం తల్లి, బిడ్డ ఇద్దరి ప్రాణాలకూ ఎంతో రక్షణ ఇస్తుంది. సరైన జాగ్రత్తలు పాటిస్తూ క్రమం తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో ఉంటే నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ మరియు డెలివరీని సురక్షితంగా పూర్తి చేసుకోవచ్చు, ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
డా. కప్పగంతుల అపర్ణ, సీనియర్ గైనకాలజిస్ట్, అబ్‌స్టెట్రీషియన్, ల్యాపరోస్కోపిక్ సర్జన్, సికింద్రాబాద్
(చదవండి: ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్‌గా 94 ఏళ్ల వ్యాపారి కథ!)
Tags : 1