లోకేష్ నిద్రపోడు, నీ మేనత్తలు ఎక్కడున్నారో తెలుసా!
బహుభాషావేత్త... సోలో ట్రావెలర్ అందం బహుముఖం
Published on Tue, 04/21/2026 - 00:06
ముప్పై రాష్ట్రాల అందాల ప్రతినిధులతో భువనేశ్వర్‌లో జరిగిన ‘మిస్ ఇండియా వరల్డ్ 2026’ పోటీలో విజేతగా నిలిచిన గోవా అమ్మాయి సాధ్వీ సతీష్ విశేషాలు తెలుసుకునేకొద్దీ ఆశ్చర్యపోతున్నారు అంతా. ఆమె రెండు చేతులతోనూ రాస్తుంది. చాలా స్పీడ్‌గా కారు నడుపుతుంది.
ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. కెనెడాలో ఎకనామిక్స్ చదివి సోలో ట్రావెలర్‌గా దేశాలు తిరుగుతుంది. ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలిచి, గోవా ఘనతను చాటింది. ఈ కాలపు అమ్మాయంటే సాధ్వీ సతీషే.
‘చిన్నప్పటి నుంచి నేను కొంచెం తేడా. నలుగురితో పెద్దగా కలిసే దాన్ని కాదు. చిన్నప్పుడు ఖాళీ టైమ్ దొరికితే రెండు చేతులతో ఒకేసారి రాయడం ప్రాక్టీసు చేసేదాన్ని’ అంటోంది గోవా అందాల బరిణె సాధ్వీ సతీష్. గోవా ఇసుక తీరాల్లో ఆడుకున్న ఈ అమ్మాయి ‘మిస్ ఇండియా 2026 వరల్డ్’ టైటిల్ గెలుచుకొని 2027లో జరగనున్న ‘మిస్ వరల్డ్’ పోటీలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.
→ మొదటి గోవా అమ్మాయి
భువనేశ్వర్‌లోని ‘కె.ఐ.ఐ.టి. విశ్వవిద్యాలయం’లో ఏప్రిల్ 18న వైభవంగా జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ ఫైనల్స్‌లో 25 ఏళ్ల సాధ్వీ సతీష్ విజేతగా గెలిస్తే, మొదటి రన్నరప్‌గా మహారాష్ట్రకు చెందిన రజ్‌నందిని పవార్, రెండో రన్నరప్‌గా జమ్మూ కశ్మీర్‌కు చెందిన శ్రీఅద్వైత నిలిచారు. న్యాయనిర్ణేతలుగా జీనత్ అమన్, నేహా ధూపియా, మధుర్ భండార్కర్, ఒలింపిక్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ లాంటి దిగ్గజాలు ఉన్నారు.
సాధ్వీ సతీష్ ఈ టైటిల్‌ను గెలవడం వల్ల ‘మిస్ వరల్డ్’కు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న తోలి గోవా అమ్మాయి అయ్యింది. స్వాధ్వీ సతీష్ కర్ణాటకలోని కార్వార్‌లో పుట్టినా తను పెరిగిన గోవానే∙ఊపిరిగా భావిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి గోవా సంస్కృతి, సముద్రం ఇష్టం. బెంగళూరులోని అమృత విద్యాలయంలో చదివి, ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డబుల్ మేజర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించి అందాల పోటీ వరకూ ఎదిగింది.
→ నాన్న ప్రోత్సాహం
అమ్మా నాన్నల ప్రోత్సాహం లేకుండా పిల్లలకు ఏ విజయమూ సిద్ధించదు. సాధ్వీ సతీష్ విజయం వెనుక తండ్రి సతీష్ కృష్ణ సెయిల్, తల్లి ప్రియాంక సెయిల్ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి సతీష్ కూతురి కలలకు రెక్కలు తొడిగిన వ్యక్తి. ‘ఆడపిల్ల అయినా ప్రపంచం చుట్టి రావాలి’ అని కెనడా చదువుకు, సోలో ట్రావెలింగ్‌కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లి ప్రియాంక గోవా సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను సాధ్వీలో నింపింది. ‘నాన్న నన్ను ఆకాశానికి ఎగిరేలా చేశారు. అమ్మ నా కాళ్లు నేల మీద ఉంచింది. మిస్ ఇండియా కిరీటం నాది కాదు, మా అమ్మా నాన్నలది’ అంది సాధ్వీ.
→ సోలో ట్రావెలర్
‘కెనెడాలో చదువు పూర్తయ్యాక మెక్సికోకు మొదటి సోలో ట్రావెల్ చేశాను’ అని తెలిపింది సా«ధ్వీ. లోకం చూడటానికి ఇష్టపడే సాధ్వీ మూడేళ్లలో పది దేశాలు ఒంటరిగా తిరిగింది. కొత్త సంస్కృతులు, కొత్త మనుషులు, కొత్త సవాళ్లు అన్నింటినీ ఆహ్వానించింది. ఈ ప్రయాణాలే తనకు స్వతంత్రంగా ఆలోచించడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పాయి అంటుందామె. మరో విశేషం ఏమిటంటే సాధ్వీకి తేనెటీగలంటే విపరీతమైన భయం. ఫోబియా. ఆ ఫోబియాను జయించడానికి సర్టిఫైడ్ బీకీపర్‌గా శిక్షణ తీసుకుంది. భయాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే.
→ బ్యూటీ విత్ ఏ పర్పస్
మిస్ ఇండియా పోటీకి కేవలం మూడు నెలల ముందే సిద్ధమైన సాధ్వీ క్రమశిక్షణతో పది కిలోలకు పైగా బరువు తగ్గి ‘టాప్ 5 బెస్ట్ బాడీ’లో నిలిచింది. తర్వాత కిరీటం గెలుచుకుంది. కానీ ఆమె లక్ష్యం కిరీటం కంటే పెద్దది. వినికిడి, మాటల లోపం ఉన్న పిల్లలకు మెరుగైన పోషకాహారం, సమాన అవకాశాలు కల్పించడం ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్. టాంజానియా వేదిక కానున్న ‘మిస్ వరల్డ్ 2027’ పోటీలో భారత్ తరపున ఇలాగే విజయం సాధించాలని కోరుకుందాం.
Tags : 1