Breaking News

వేయి యుద్ధాల విజేత

Published on Mon, 04/13/2026 - 05:46

ఆమె పాడటానికి పోరాడింది. జీవించడానికి పోరాడింది. ‘సింగిల్‌ మదర్‌’గా పిల్లల్ని పెంచడానికి పోరాడింది. తన కంటే వయసులో చిన్నవాడైన వ్యక్తిని రెండో వివాహం చేసుకొని లోకంతో పోరాడింది. పాటకు చిరునామాగా ఎదిగిన సొంత అక్కను ఎదిరించి తన ఉనికి చాటుకోవడానికి పోరాడింది. ఆశా భోంస్లే తన అంతిమ శ్వాస వరకూ పోరాడుతూనే ఉంది. ప్రతి యుద్ధాన్ని గెలుస్తూనే ఉంది. ఆమె జీవితం అసామాన్యం. ఆమెకే సాధ్యం.

తన సొంత అక్క లతా మంగేష్కర్‌ లానే ఆశా భోంస్లేకు కూడా చదువు లేదు. షోలాపూర్‌లో వీరి కుటుంబం ఉన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్‌ ఫీజ్‌ కట్టలేక అక్కచెల్లెళ్లు ఇద్దరూ బడికి వెళ్లడం మానేశారు. నలుగురు అక్కచెల్లెళ్లు లత, ఆశ, ఉష, మీన... ఒక తమ్ముడు హృదయనాథ్‌... మొత్తం అయిదుగురు సంతానం. తమ్ముడు శారీరకంగా బలహీనుడు. తండ్రి దీనానాథ్‌ మరణానంతరం కుటుంబాన్ని మోయాల్సిన భారం లత తీసుకుంది.

 బొంబైలో చాలీ చాలని జీవితం మొదలైంది. ఆ సమయంలోనే ఆశాకు ఇంట్లో ఉక్కపోత మొదలైంది. ఆశా భోంస్లేది తన అక్కలాగా ఒద్దిక స్వభావం కాదు. స్వేచ్ఛ, సాహసం, తెగింపు ఆమె సొంతం. ఆకాశానికి తొందరగా ఎగిరి ఏమేమి వింతలున్నాయో చూద్దామని కోరిక. ఆ కోరిక ఆమెను తన కంటే వయసులో 20 ఏళ్లు పెద్దవాడైన గణ్‌పత్‌రావు భోంస్లేతో ప్రేమ వివాహం చేసుకునేలా ప్రేరేపించింది. గణ్‌పత్‌రావు అప్పుడప్పుడే సంగీతంలో ఎదుగుతున్న లతా మంగేష్కర్‌కు మేనేజర్‌. ఈ పెళ్లి లతాను శరాఘాతంగా తాకింది. మంగేష్కర్‌ కుటుంబ పరువు గంగలో కలిసిందని లతాకు అనిపించింది. 

ఈ పెద్ద సంసారంలో  నుంచి బయటపడే వాకిలి దొరికిందని ఆశా భావించింది. కాని ఈ నిర్ణయం ఆశాను జీవితాంతం వెంటాడింది. అత్తగారింటిలో నానా బాధలు పడింది. చిన్న వయసులో ఇద్దరు పిల్లల్ని కని, ఆ తర్వాత మూడోసారి గర్భంతో ఉండగా ఇక ఆత్మహత్య చేసు కోలేక ఇంటి నుంచి పారిపోయింది. అయితే లత ఆమెను అడుగు పెట్టనివ్వలేదు. సినిమా రంగం ఇంకా ఆమెను గుర్తించనే లేదు. 18 ఏళ్లు కూడా నిండని గాయని, ముగ్గురు పిల్లల తల్లి, సినిమా రంగంలో నిలదొక్కుకోవాలి. ఆశా తన పోరాటం మొదలెట్టింది.

క్లబ్‌ సాంగ్స్‌ కనికరం
ఆ రోజుల్లో ‘వ్యక్తిత్వం’ చాలా ప్రధానం. హీరోయిన్  వ్యక్తిత్వం, ఆమెకు పాడే గాయని వ్యక్తిత్వం పాత్రను బట్టి, పాటను బట్టి వెల్లడి అవుతాయి. హీరోయిన్ కు లతా మంగేష్కర్‌ పాడేది. అవి ‘వ్యక్తిత్వం’ ఉన్న పాటలు. కాని వేంప్‌లు ఉంటారు. వాళ్లకు ఎవరు పాడాలి? ఆశా భోంస్లేకు పిలుపు వచ్చింది. అలాంటి పాటలు పాడితే లోకం ఏమనుకుంటుంది? బతకడానికి దోవ చూపని లోకం ఏమనుకుంటే ఏమిటి... అని ఆశా రంగంలోకి దిగింది.

 ‘ముడ్‌ ముడ్‌ కే నా దేఖ్‌ ముడ్‌ ముడ్‌ కే’ (‘శ్రీ 420’)లో నాదిరా పాట గుర్తు ఉందా? అది ఆశా పాడింది. అప్పుడే అదృష్టవశాత్తు హెలెన్  రంగ ప్రవేశం చేసింది. ఆమె డాన్సింగ్‌ గర్ల్‌. ఆమెకు సరిపడా డాన్సింగ్‌ వాయిస్‌ కావాలి. ఆశా భోంస్లే ఈ అవకాశాన్ని అందుకుంది. ఆశా ఫీల్డ్‌లో నిలవడానికి హెలెన్  డాన్స్, హెలెన్  డాన్స్లో రాణించడానికి ఆశా గొంతు ఒకరికి ఒకరు సాయం చేసుకున్నాయి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో లెక్కలేనన్ని హిట్‌ పాటలు వచ్చాయి. ‘పియా తూ అబ్‌ తో ఆజా’... ఇప్పటికీ మార్మోగుతూనే ఉంటుంది. ‘డాన్ ’లో ‘అయ్‌ మేరా దిల్‌ ΄్యార్‌ కా దీవానా’.... మెరుపుతీగ.

నయ్యర్‌ సహకారం
ఎంత చెప్పినా ఎన్ని చేసినా సినిమా రంగం మగవారి సామ్రాజ్యం. ఇక్కడ ఎవరో ఒకరు అండగా ఉంటే తప్ప ఎదగడం కష్టం. అయితే ప్రతిభ లేకపోతే ఎవరూ అండగా నిలవరు. ఆశాకు ప్రతిభ ఉన్నా లతాకు భయపడి అవకాశాలు ఇవ్వడానికి జంకేవారు. ఆ రోజుల్లో ఆశా కోసం నిలబడిన వాడు సంగీత దర్శకుడు ఓ.పి. నయ్యర్‌. లతాతో అస్సలు పాడించడానికి ఇష్టపడని ఈ మొండివాడు ఆశాకు పాటల దారులు పరిచాడు.

 ఆమె గొంతు చేరగల ఎత్తులకు చేర్చాడు. వీరిద్దరూ కలిసి లెక్కలేనన్ని హిట్స్‌ ఇచ్చారు. ‘జాయియే ఆప్‌ కహా జాయేంగే’ (మేరే సనమ్‌), ‘మాంగ్‌ కే సాథ్‌ తుమ్హారా’ (నయా దౌర్‌), ‘ఆయియే మెహర్‌బాన్ ’ (హౌరా బ్రిడ్జ్‌), ‘ఆవో హుజూర్‌ తుమ్‌కో’ (కిస్మత్‌)... ఎన్నని. ‘కాశ్మీర్‌ కీ కలీ’లో రఫీ, ఆశాలు చేసిన మేజిక్‌ ఓ.పి. నయ్యర్‌ వల్ల సాధ్యమైందే. అయితే నయ్యర్‌ ఆశా ఘనతను చాటాడే తప్ప గాయనిగా ఆశా స్టేటస్‌ పెంచలేకపోయాడు. దానికి ఖయ్యాం కావాల్సి వచ్చింది.

ఉమ్రావ్‌ జాన్  కీ అదా
ఒక ఛాలెంజింగ్‌ వ్యక్తిత్వం మరో ఛాలెంజింగ్‌ గాయనికి జీవితం ఇవ్వడం ఇండియన్  స్క్రీన్  మీదే జరిగింది. ఉమ్రావ్‌ జాన్  అనే ‘తవాయిఫ్‌’ (దర్బారు గాయక నర్తకి) జీవితాన్ని సినిమాగా తీసినప్పుడు ఆమెకు మేచ్‌ అయ్యే గొంతు ఆశాదే అని భావించాడు సంగీత దర్శకుడు ఖయ్యాం. అప్పటివరకూ గజల్స్‌ను లతా మాత్రమే పాడాలనుకునేవారు. కాని ఖయ్యాం ఆశాతో పాడించాడు. ‘దిల్‌ చీజ్‌ క్యా హై ఆప్‌ మేరే జాన్  లీజియే’... ఉమ్రావ్‌ జాన్‌లో ఈ పాట ఆశాను జాతీయ గాయనిగా మార్చింది. జాతీయ పురస్కారం తెచ్చి పెట్టింది. తన సుదీర్ఘ పోరాటంతో తాను కేవలం క్లబ్‌ సాంగ్స్‌ గాయని కాదనీ ఉత్కృష్ట గాయని అని ఆశా నిరూపించింది.

ఆర్‌.డి. బర్మన్  శకం
ఆ తర్వాత ఆర్‌.డి. బర్మన్  వచ్చి ఆశా గొంతు ఎంత వర్సటైలో లోకానికి చూపించాడు. ‘తీస్రీ మంజిల్‌’లో ‘ఆజా ఆజా మై హూ ΄్యార్‌ తేరా’ సంచలనం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఒక పాట ముళ్లు లేని గులాబి పువ్వులా శోభిస్తూనే ఉంది. అది – ‘చురాలియా హై తుమ్‌ మేరే దిల్‌కో’. తర్వాతి రోజుల్లో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ జోడీకి గుల్జార్‌ తోడయ్యాక ఇంకా గొప్ప పాటలు చోటు చేసుకున్నాయి. ‘మేరా కుచ్‌ సామాన్ ’ (ఇజాజత్‌)... ‘రోజ్‌ రోజ్‌ ఆంఖో తలే’ (జీవా)... అభిరుచి ఉన్న రసజ్ఞులను అలరిస్తూనే ఉన్నాయి. తెలుగులో వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘జీవితం సప్త సాగర గీతం’ ఒక మనోహర గీతం.

పాట... వంట
స్త్రీకి ఆర్థిక స్వాతంత్రం, ఆత్మనిర్భరత ఉండాలని భావించిన ఆశా భోంస్లే గాయనిగా కొనసాగుతూనే వ్యాపార రంగంలో కూడా తన ప్రతిభ చూపింది. ఆమె స్వయంగా గొప్ప వంటగత్తె. అందుకని దేశంలోనే కాదు దుబాయ్‌లో కూడా అనేక రెస్టరెంట్‌లను ప్రారంభించింది. ఆమె అన్ని రెస్టరెంట్‌లు గొప్ప జనాదరణ ΄÷ందుతున్నాయి. జీవితంలో బంధాల రుచి కూడా ఉండాలని భావించిన ఆమె ఆ తర్వాతి రోజుల్లో అక్క లతాతో సయోధ్య చేసుకోగలిగింది.

ఉత్సాహ స్వరం
జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఉన్నా ఆశా తన స్వరంలో ఉత్సాహాన్ని తప్పిపోనివ్వ లేదు. లైవ్‌షోస్‌ చేస్తూ ప్రపంచాన్ని చుట్టిందామె. నాటి తరంతో నేటి తరం వరకూ పని చేసింది. ఏ.ఆర్‌. రెహమాన్  ‘రంగీలా’ పాటలు సూపర్‌ హిట్‌ కావడానికి ఆశా భోంస్లే గళం ఒక కారణం. దక్షణాదిలో ఇళయరాజా సంగీతంలో చాలా పాటలు పాడిందామె. ‘నా అభిమాన గాయని ఆశా’ అని ఇళయరాజా చెప్పుకున్నారు. ఆయన సంగీతంలో ఆశా పాడిన ‘ఓ ప్రేమా’ (అశ్వమే థం) పాట చాలా బాగుంటుంది. కృష్ణవంశీ తీసిన ‘చందమామ’లో ఆశా పాట ‘నాలో ఊహలకు నాలో ఊసులకు’ చాలా బాగుంటుంది. ఆశా భోంస్లే జీవితం ఓటమికి వెరువకు అని చెప్తుంది. జీవన గీతాన్ని కొనసాగిస్తూ ఉండమని ఉపదేశం ఇస్తుంటుంది. 

ఆశా నోట తెలుగు పాట
ఆశా భోంస్లే హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, బెంగాలీ, కన్నడ, మలయాళం వంటి 20కి పైగా భాషల్లో సుమారు 11,000లకు పై చిలుకు పాటలు పాడారు. అంతేకాదు అన్ని పాటలు పాడినందుకుగానూ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం సొంతం చేసుకున్నారామె. అయితే తెలుగులో ఆమె తక్కువ పాటలు పాడినప్పటికీ అన్నీ ఆల్‌ టైమ్‌ హిట్స్‌గా నిలవడంతో ప్రేక్షకుల మనసుల్లో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సొంతం చేసుకున్నారు ఆశా భోంస్లే. తెలుగులో ఎంతో మధురంగా ఆమె పాడిన పాటలు నేటికీ సంగీత ప్రియుల ప్లేలిస్టులో ఉంటాయనడం అతిశయోక్తి కాదు. మంచు మోహన్ బాబు, జయప్రద జోడీగా దాసరి నారా యణరావు దర్శకత్వం వహించిన ‘పాలు–నీళ్లు’ (1981) తెలుగులో ఆమెకు తొలి చిత్రం. ఈ మూవీలో ‘ఇది మౌనగీతం ఒక మూగరాగం పాడింది...’ అనే పాటని ఆలపించారు.

 ‘చిన్ని కృష్ణుడు’ (1988) చిత్రంలో ‘జీవితం సప్త సాగరం..’, ‘అశ్వమేథం’ (1992) మూవీలో ‘సీతాకాలం ప్రేమకు, ఓ ప్రేమ’ వంటి పాటలు ఆలపించారు. అలాగే ‘ప్రేమకు ప్రేమంటే తెలుసా’ (1995) సినిమాలో ‘జలంధి మధి..’, ‘పవిత్ర బంధం’ (1996) చిత్రంలో ‘ఐస్సలకిడి..’ పాట ఆలపించారు. అదే విధంగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించడంతో పాటు సంగీతం అందించిన ‘ఇద్దరు’ (1997) మూవీలో ‘వెన్నెల..’ పాట పాడారామె. కృష్ణవంశీ దర్శకత్వంలో నవదీప్, శివబాలాజీ, కాజల్‌ అగర్వాల్, సింధు మీనన్  ప్రధాన పాత్రల్లో నటించిన ‘చందమామ’ సినిమాలో ‘నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు...’ పాట ఎంత ఫేమస్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మెలోడీ సాంగ్‌ని ఇప్పటికీ యువత తెగ ఇష్టపడుతుంటారు.

అవార్డులు
అద్భుతమైన గాత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆశా భోంస్లే తన ప్రతిభకి గుర్తింపుగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ‘ఉమ్రావ్‌ జాన్ ’ సినిమా కోసం పాడిన ‘దిల్‌ చీజ్‌ క్యా హై...’ పాటకి బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌గా 1981లో, ‘ఇజ్జత్‌’ చిత్రంలో పాడిన ‘మేరా కుచ్‌ సమాన్ ...’ సాంగ్‌కి బెస్ట్‌ ఫీమేల్‌ ప్లే బ్యాక్‌ సింగర్‌గా 1986లో రెండు జాతీయ అవార్డులు అందుకున్నారు ఆశా భోంస్లే. 

అదే విధంగా చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారంగా భావించే ‘దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు’ని (2000) అందుకున్నారు. అలాగే భారత ప్రభుత్వం నుంచి 2008లో ‘పద్మ విభూషణ్‌’ అవార్డు సొంతం చేసుకున్నారు. అదే విధంగా 2001లో ఫిల్మ్‌ ఫేర్‌ నుంచి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు 18 మహారాష్ట్ర స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు, 9 ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డులు సొంతం చేసుకున్నారు.

ఐదొందలు పందెం...
తన కెరీర్‌లో ఎన్నో వేలకు పైగా పాటలు పాడిన ఆశా భోంస్లేకి ఓ పాట సవాల్‌ విసిరిందంటే విశేషమనే చె΄్పాలి. షమ్మీ కపూర్, ఆశా పరేఖ్, హెలెన్, ప్రేమనాథ్, ఇఫ్తేకర్, ప్రేమ్‌ చోప్రా  ప్రధాన పాత్రల్లో విజయ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘తీస్రీ మంజిల్‌’. నాసిర్‌ హుస్సేన్  నిర్మించిన ఈ సినిమా 1966 అక్టోబరు 21న విడుదలైంది. ఆర్‌డీ బర్మన్  సంగీతం అందించిన ఈ చిత్రంలోని హిట్‌ సాంగ్‌ ‘అహహ ఆజా...’ పాటను మహ్మద్‌ రఫీతో కలిసి పాడారు ఆశా భోంస్లే. ఈ పాట పల్లవి ఆఖరున వచ్చే ‘అహహ ఆజా అఅ ఆజా..’ను విభిన్నంగా పాడాల్సి వచ్చిందట. అయితే అనుకున్నట్లు రాకపోవడంతో వేరే శైలిలో చేద్దామని ఆర్‌డీ బర్మన్  ఆమెను అడిగారట.. ‘వేరేలా అవసరం లేదు... నేను పాడగలను’ అన్నారట ఆశా. ‘అహహ ఆజా..’ను మహ్మద్‌ రఫీ బాగా పాడగలడని నాసిర్‌ హుస్సేన్, ఆయన కన్నా ఆశా భోంస్లే బాగా పాడగలదంటూ ఆర్‌డీ బర్మన్  సరదాగా రికార్డింగ్‌ స్టూడియోలోనే రూ. 500 పందెం వేసుకున్నారట. ఈ పాట సమయంలో బర్మన్ –ఆశా æ మధ్య ఏర్పడిన పరిచయం వివాహానికి దారి తీసింది. 1980లో వీరి పెళ్లి జరిగింది. 1994లో ఆర్‌డీ బర్మన్  మృతి చెందారు.

– ఖదీర్‌

Videos

లెక్క సెట్ చేస్తాం.. 2029లో చూపిస్తా..

అల్లు అర్జున్ రాకాపై షారుఖ్ షాకింగ్ కామెంట్స్..

టీడీపీ ఎమ్మెల్యే బంధువు అరాచకం.. తోటకు రమ్మని.. బాధిత మహిళ ఆవేదన

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ విజయారెడ్డి ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

89 బూతులలో ఓట్లే పడలేదు.. EVMల మాయ గెలుపే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

అమ్మకానికి అమరావతి!

విద్యార్థులకు ప్రేమ కవితలు పంపుతున్న ట్రిపుల్‌ ఐటీ అధ్యాపకులు

పొప్ పై విరుచుకుపడ్డ డోనాల్డ్ ట్రంప్

అతనికి శ్రీముఖి అంటే క్రష్.. ఫేమ్ కోసమే ఇందంతా ..!

ఎడ్ల బండిలో పెండ్లి పిల్ల

Photos

+5

భానుడి సెగలకు విశాఖ రుషికొండ తీరంలో పర్యాటకుల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో వైభవ్‌ సూర్యవంశీ ఆట.. SRH vs RR ప్రాక్టీస్‌ (ఫొటోలు)

+5

కూకట్‌పల్లిలో హీరో విక్టరీ వెంకటేష్ సందడి (ఫొటోలు)

+5

‘డెకాయిట్‌’ మూవీ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

కరీనకపూర్‌ రాజసం ఉట్టిపడేలా కుర్తాసెట్‌ స్టైలిష్‌ లుక్‌..!

+5

ఆశా భోంస్లే కన్నుమూత.. జీవితంలో ఇవన్నీ పదిలం (పోటోలు)

+5

హైదరాబాద్ లో మండుతున్న ఎండలు (ఫొటోలు)

+5

తమిళ హీరోయిన్‌ అతుల్య రవి డీసెంట్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

‘పాపం ప్రతాప్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ (ఫొటోలు)

+5

ఆర్టెమిస్‌-2 గ్రాండ్‌ సక్సెస్‌...నాసా విడుదల చేసిన (ఫొటోలు)