ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం
Breaking News
'బుజ్జి ఫొటోగ్రాఫర్'..! జస్ట్ 18 నెలల వయసుకే..
Published on Thu, 04/09/2026 - 12:11
కొందరు చిన్నారులు వయసు పెరిగే కొద్ది తమలోని అసాధారణ ప్రతిభను కనబరుస్తారు. ఇంకొందరు బైబర్త్ నైపుణ్యం పెంపొందించుకుంటారు. వయసుకి వారి ప్రదర్శించే ప్రతిభకు పొంతనలేని వారి సామర్థ్యం అందర్నీ మంత్రముగ్ధుల్ని చేసేలా కట్టిపడేస్తుంది. అలాంటి కోవకు చెందిందే కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన నాలుగేళ్ల పిహు. ఆమె పిట్ట కుంచెం కుత ఘనం అన్నట్లుగా ఫోటోగ్రఫీలో అసామాన్య ప్రజ్ఞతో ఆకట్టుకుంటోంది. ఆమె ఏ వయసులో కెమెరా పట్టుకుని క్లిక్ మనిపించిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
కేరళలోని పాలక్కాడ్ నగరానికి చెందిన నాలుగేళ్ల పిహు వృత్తిరీత్యా ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్దాస్, తల్లి శ్రీ హేమ శ్రీధరన్ దంపుతుల పెద్ద కుమార్తె. తన వయసు పిల్లలు బొమ్మలతో ఆడుకుంటుంటే ఆమె మాత్రం తన చిట్టి చేతులతో కెమెరాతో ఆడుకోవడం మొదలుపెట్టింది. ఈ చిన్నారి కెమెరాల పట్ల అసాధారణమైన ఆసక్తిని కనబరుస్తోంది. 15 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ అయిన తండ్రి విపిన్ దాస్ అడుగుజాడల్లో నడిచేస్తోంది.
అంత చిన్న వయసులోనే ఆ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవడం విశేషం. పైగా తన టాలెంట్‌తో ఆ అభిరుచి తన డీఎన్ఏలోనే ఉంది అని చెప్పకనే చెబుతోంది పిహు. కేవలం 18 నెలల వయసులోనే బొమ్మ కెమరా కాకుండా, ఒరిజనల్ కెమెరాను పట్టుకుంది. ఆ పరికరం తన బరువులో దాదాపు సగం బరువు అయినా..ఆమె దానిని జాగ్రత్తగా ఎత్తి తనకు ఇష్టమైన ఏనుగు బొమ్మ ఫోటోని తీసింది. అది చూసిన తల్లిదండ్రులు ఓ చిన్న పసిపాప తీసిన ఫోటోనేనా..? అని విస్తుపోయారు.
పైగా అంత చిన్నవయసులోనే కెమెరాలోని రకారకాల లెన్స్‌లు, గింబల్ వంటి వాటిపై ఆకస్తి చూపించేది. ప్రతి బటన్ ఎలా పనిచేస్తుందనేది తల్లిదండ్రులను అడిగి తెలుసుకునేది. అయితే తల్లిదండ్రులు అంత చిన్నవయసుకు కెమెరా ఎందుకని బొమ్మ కెమెరా ఇచ్చేందుకు యత్నిస్తే అస్సలు ఒప్పుకునేది కాదని చెప్పుకొచ్చారు.
ఎలా నేర్చుకుందంటే..
పిహు ఫొటోలు అందంగా తీయడం ఎలా నేర్చుకుందంటే..తన స్నేహితుడి బిడ్డ పుట్టినరోజు వేడుకలో సదరాగా ఇచ్చిన చిన్న కెమెరాను ప్రోఫెషనల్ కెమెరా మ్యాన్లు పట్టుకున్నట్లుగా పట్టుకుని ఫొటోలు తీసిందని చెబుతున్నారు ఆమె తండ్రి విపిన్ దాస్. అక్కడే తీస్తున్న ఇతర ఫొటోగ్రాఫర్లను పరిశీలిస్తూ తీయడం నేర్చుకుందని, పైగా ఆ వేడుకలో తీసిన పది ఫొటోలు నిజంగా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు.
అలా అప్పటి నుంచి పిహు తండ్రి తోపాటు అవుట్డోర్ ఫొటోషూట్లకు వెళ్లడం ప్రారంభించింది. అలాగే తన తల్లి శ్రీహేమ రెండోసారి గర్భవతి అయినప్పుడు తల్లికి ఆ చిన్నారి వ్యక్తిగత ఫొటోగ్రాఫర్‌గా మారింది. నేచురల్ వెలుగులో అద్భుతమైన పోర్ట్రెయిట్లను తీసింది ఆ చిన్నారి.
ఆ చిన్నారికి పేరొచ్చింది అప్పుడే..
గతేడాది నవంబర్‌లో రాజకీయ నాయకుడు, ఎంపీ షఫీ పరంబిల్ ఆమె వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో పిహు పేరు మారుమ్రోగిపోయింది. ఆ వీడియోలో పిహు ఎంపీకి సంబంధించిన కొన్ని ఫొటోలు క్లిక్‌మనిపించింది. అంత ఎవరా ఆ చిన్నారి అంటూ తెలుసుకోవడం ప్రారంభించారు. ఇక తన కూతురుకి ఏ యాంగిల్ ఫోటోలు తీస్తే బాగా వస్తాయనే దానిపై మంచి పట్టుందని చెబుతున్నారు విపిన్ దాస్.
ఇవేగాక ఆమె ఇటీవలే, పాలక్కాడ్‌లోని శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగే పదిరోజుల వార్షిక రథోత్సవమైన ప్రసిద్ధ కల్పతి రథోత్సవంలో సైతం అద్భుతంగా ఫొటోలు తీసిందన్నారు. అక్కడ కమనీయ దృశ్యాలను చాలా అద్భుతంగా కెమెరాలో బంధించిందని చెప్పారు. అంతేకాదండోయో ఈ చిన్నారి పిహుకి 'cam_girl_pihu' అనే పేరుతో ఇన్స్టాగ్రామ్ ఖాతా కూడా ఉంది. దానిని ఆమె తల్లిదండ్రులే నిర్వహిస్తున్నారు.
(చదవండి: నాడు సాధారణ తోపుడు బండి వ్యాపారం..! కట్‌చేస్తే..)
Tags : 1