ఒప్పందం ఉల్లంఘిస్తే యుద్ధానికి రెడీగా ఉన్నాం
Breaking News
ఉమెన్ పవర్...పంచ్
Published on Thu, 04/09/2026 - 05:23
‘అమ్మాయిలకు బాక్సింగ్ ఎందుకండీ!’ అనే మాట అప్పుడెప్పుడో కాదు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటుంది. లింగ వివక్షతతో కూడిన మాటలను, అడ్డంకులను పట్టించుకోకుండా తమ దారిలో తాము దూసుకుపోతూ సత్తా చాటుతున్నారు యువ మహిళా బాక్సర్‌లు. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్–2026లో మన దేశానికి చెందిన ఆరుగురు మహిళా బాక్సర్‌లు ఫైనల్‌లోకి దూసుకొచ్చి స్వర్ణపతక పోరులో స్థానాన్ని ఖరారు చేసుకున్నారు. వారు...మీనాక్షి (48 కేజి), ప్రీతి (54 కేజి), జాస్మిన్ (57 కేజి), ప్రియ (60 కేజీ), అరుంధతి చౌదరి (70 కేజీ), అల్ఫియా పఠాన్ (81 కేజి).
కుంచె నుంచి పంచ్ దాకా...
చిన్నప్పటి నుంచి ప్రీతి పవార్‌కు బొమ్మలు వేయడం అంటే ఇష్టం. బాక్సర్‌గా తన భవిష్యత్ చిత్రపటాన్ని కూడా అందంగా తీర్చిదిద్దుకుంది. భారత బాక్సింగ్‌లో అత్యంత ప్రతిభావంతులైన యువతారలలో ఒకరిగా వేగంగా ఎదిగింది. హరియాణాలో భివానీలో జన్మించింది ప్రీతి. బాక్సర్‌ల ఊరుగా భివానీకి పేరున్నప్పటికీ మొదట్లో బాక్సింగ్‌పై ప్రీతికి పెద్దగా ఆసక్తి లేదు. ఆమె మామ వినోద్ జాతీయస్థాయిలో పేరు తెచ్చుకున్న బాక్సర్. ఆయన ప్రోత్సాహంతో పద్నాలుగేళ్ల వయసులో బాక్సింగ్‌లోకి వచ్చింది ప్రీతి పవార్.
పానిపట్‌లో జరిగిన ఓపెన్ స్టేట్ టోర్నమెంట్‌తో తన విజయయాత్ర మొదలుపెట్టింది. ఆ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలుచుకుంది. జాతీయ స్థాయికి చేరుకోవడానికి ఆమెకు ఎంతోకాలం పట్టలేదు. అంతర్జాతీయ స్థాయిలో జరిగిన యూత్ ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో రజత పతకం గెలుచుకుంది. మరుసటి సంవత్సరం సీనియర్ స్థాయిలో ఆసియా ఛాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం గెలుచుకుంది. 2023 ఆసియా గేమ్స్‌లో మహిళల 54 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకోవడం ప్రీతి కెరీర్‌లో కీలక మలుపుగా నిలిచింది. 2024లో కజకిస్తాన్‌లో జరిగిన ఆసియా అండర్–22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణపతకం గెలిచిన ప్రీతి తన అద్భుతమైన ఫామ్ కొనసాగించింది. 2024లో ఒలింపిక్ ఆరంగేట్రం చేసింది.
ఎంతోసేపు ఏడ్చిన తరువాత..
రాజస్థాన్‌లోని కోటా శిక్షణ సంస్థలకు పెట్టింది పేరు. అలాంటి నగరంలో పెరిగిన అరుంధతి చౌదరి చదువులో ముందుండేది. గణితంలో కూడా అద్భుత ప్రతిభ చూపేది. అదే సమయంలో ఆమెకు ఆటలు అంటే కూడా ఇష్టం. ‘ఆటల్లో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను’ అని తండ్రితో చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యంగా చూసి ‘ఆటలు వద్దు. ఐఐటీ చేయాల్సిందే’ అని ఆదేశించాడు. తండ్రి ఆదేశంతో ఇక ఆటలకు దూరం కావాల్సిందే అనుకున్న సమయంలో తల్లిని పట్టుకొని గట్టిగా ఏడ్చిన అరుంధతి తనకు ఆటలు అంటే ప్రాణం అని చెప్పింది. తండ్రిని తల్లి చాలాసేపు బతిమిలాడిన తరువాత ‘చదువుతో పాటు ఆటలు కూడా ఓకే’ అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అరుంధతికి అప్పట్లో బాక్సింగ్‌పై ఆసక్తి లేదు. బాస్కెట్ బాల్ అంటే ఇష్టం. రాష్ట్రస్థాయిలో కూడా ఆడింది. ఇండివిడ్యువల్ గేమ్‌ను ఎంచుకుంటే మంచిది అని చె΄్పాడు తండ్రి. అప్పుడే ‘బాక్సింగ్’ ఆలోచన ఆమె మదిలోకి వచ్చింది.
‘బాక్సింగ్‌లో నీ పళ్లు ఊడిపోవచ్చు. ముఖం వికృతంగా మారిపోవచ్చు’ అని హెచ్చరించాడు తండ్రి. ‘నేను కూడా నా ప్రత్యర్థి పళ్లు ఊడగొడతాను. ఆమె ముఖాన్ని వికృతంగా మారుస్తాను’ అని అరుంధతి అన్నప్పుడు తండ్రి పెద్దగా నవ్వాడు. తన కూతురు బాక్సింగ్ ఆటపై సరదా పడుతుంది అనుకున్నాడేగానీ పెద్ద స్థాయికి వెళుతుందని ఆ తండ్రి అనుకోలేదు. కల కనలేదు. అతడు అనుకోక పోయినా, కల కనకపోయినా ప్రపంచ స్థాయిలో బాక్సింగ్‌లో మెరుస్తోంది అరుంధతి చౌదరి.
మట్టి కరిపించేలా...
మాజీ ప్రపంచ ఛాంపియన్‌ను మట్టి కరిపించి సంచలనం సృష్టించిన ప్రియ ఘంగాస్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. బాక్సింగ్‌ను తొలిసారిగా ప్రియకు పరిచయం చేసింది హరియాణా కోచ్ రవి సంగ్వాన్. మాజీ జాతీయ ఛాంపియన్ అయిన రవి దగ్గర ఏడేళ్ల పాటు శిక్షణ తీసుకున్న ప్రియ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంది. తాజాగా... ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో ప్రియ ఫైనల్లోకి అడుగు పెట్టడం గురించి రవి సంతోషంతో పులకించిపోయారు.
‘దాద్రీ బాక్సింగ్ అకాడమీ అనే ఒక అకాడమీని ప్రారంభించాను. అప్పుడు ప్రియ ఆరవ తరగతి చదువుతుంది కావచ్చు. తన సోదరుడితో కలిసి అకాడమీకి వచ్చేది. నేర్చుకోవాలి, గెలవాలి అనే తపన ఆ చిన్నారి కళ్లలో కనిపించేది. ఆమెలో అంకితభావంతో పాటు ప్రతిభ కూడా ఉంది’ అంటూ జ్ఞాపకాల్లోకి వెళ్లారు రవి. అప్పట్లో అకాడమీలో సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉండేవి. అవేమీ పట్టించుకోకుండా పట్దుదలతో కష్టపడి ముందుకు సాగాలనే ఆమె సంకల్పబలం రవికి బాగా గుర్తుండి పోయింది.
తాతగారు ససేమిరా అన్నా...
జాస్మిన్ కుటుంబ సభ్యులు, బంధువులలో ఎంతోమంది బాక్సర్‌లు ఉన్నారు. అయినప్పటికీ జాస్మిన్ బాక్సింగ్ రింగ్‌లోకి అడుగు పెట్టడం ఆమె తాతగారికి నచ్చలేదు. అయితే బాక్సర్ అయిన బాబాయ్ ఆమెను ప్రోత్సహించాడు. జాస్మిన్ పతకాలు గెలుచుకున్నప్పుడల్లా ఆయన కళ్లలో వెలుగు కనిపించేది.
‘నా కలలను నిజం చేస్తున్నావు’ అనేవాడు ఆనంద బాష్పాలతో. ‘రింగ్‌లోకి అడుగు పెట్టగానే నా మదిలోని ఆలోచనలన్నీ మాయమైపోతాయి. గెలవడం గురించి మాత్రమే ఆలోచిస్తాను’ అని తన సక్సెస్ మంత్రాను చెప్పనే చెప్పింది ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న జాస్మిన్. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో 57 కేజీల విభాగంలో ఉబ్జెకిస్తాన్‌కు చెందిన నిగిన ఉక్తమోనాపై విజయం సాధించింది.
కష్టమైనా... ఇష్టంగా!
హరియాణాలోని రూర్కికి చెందిన మీనాక్షి హూడా తండ్రి ఆటోడ్రైవర్. ఆరుగురు కుటుంబ సభ్యులలో మీనాక్షి చిన్నది. బాక్సింగ్ అంటే మీనాక్షికి ఇష్టం. ‘ఆడపిల్లకు బాక్సింగ్ ఎందుకు?’ ‘నీకు బాక్సింగ్‌లో శిక్షణ ఇప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు’ అని ఆ తండ్రి అనలేదు. బాక్సింగ్ అంటే కూతురికి ఉన్న ఇష్టానికి ముచ్చటపడి శిక్షణ ఇప్పించాడు. 
బాక్సింగ్‌లో తన కూతురు పెద్ద పేరు తెచ్చుకుంటుందనే నమ్మకంతో ఆర్థిక కష్టాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. 2014లో ‘ఖేల్ ఇండియా’ పోటీలో బంగారు పతకం గెలుచుకుంది మీనాక్షి. తాజాగా... ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో మహిళల 48 కేజీల సెమీ ఫైనల్çలో థాయ్‌లాండ్‌కు చెందిన థిప్సచాపై విజయాన్ని సాదించి స్వర్ణపతక పోరులో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది.
అనుకోకుండా వచ్చి...
అల్ఫియా పఠాన్ సోదరుడు రాష్ట్ర స్థాయి బాక్సర్, నాగ్‌పూర్‌లో తన సోదరుడు శిక్షణ తీసుకుంటున్న సమయంలో హాల్ బయట అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చునేది అల్ఫియా. ఆ తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరేవారు. ఒకరోజు కోచ్ పురోహిత్ ఆమెతో సరదాగా ‘బాక్సింగ్ చేస్తావా?’ అన్నాడు. ‘ఆ.. ఏముంది గొప్ప. తన్నడం లేదా తన్నులు తినడం’ అన్నది అల్ఫియా.

ఆమె చురుకుదనం చూసి ‘నువ్వు రేపటి నుంచి క్లాస్‌లో చేరాల్సిందే’ అంటూ వెళ్లిపోయాడు పురోహిత్. ఆయన యథాలాపంగా అన్నాడో, నిజంగానే అన్నాడో తెలియదుకానీ...ఆ మాటతో ఆల్ఫియా పఠాన్ బాక్సింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి రాకెట్ వేగంతో దూసుకుపోతోంది.
Tags : 1