థ్యాంక్స్ జైపాల్.. మీకు నా సెల్యూట్.. పేర్ని నాని సెటైర్లు
Breaking News
వెండితెరపైకి వీరుల పోరాటం
Published on Fri, 04/03/2026 - 00:02
స్వాతంత్య్ర సంగ్రామంలో ఎందరో మహానుభావులు పోరాటాలు చేశారు. బ్రిటిషర్లకు ఎదురు నిలిచి అమరులైన వారు ఎందరో ఉన్నారు. ఈ వీరుల పోరాట స్ఫూర్తిని కథలుగా మలిచి, వెండితెరపైకి తెస్తున్నారు కొందరు దర్శకులు. ఆ సినిమాల విశేషాలు తెలుసుకుందాం.
పోరాటానికి కొత్త నిర్వచనం
‘‘ఆదిపత్యం కోసమే యుద్ధాలు జరుగుతున్న సమయంలో పోరాటానికి ఓ యోధుడు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చాడు. అదేంటి అనేది ‘ఫౌజి’ సినిమాలో చూడొచ్చు’’ అని ఈ చిత్రం యూనిట్ చెబుతోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇది. ఈ సినిమా ప్రధానంగా 1940 నేపథ్యంలో సాగుతుందని తెలిసింది. ఇందులో బ్రిటిష్ సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని సమాచారం. ఈ చిత్రకథ ప్రధానంగా ప్రేమ, త్యాగం, యుద్ధం వంటి అంశాల మేళవింపుతో ముడి పడి ఉంటుందని తెలిసింది. ‘ఫౌజి’లో ఇమాన్వీ ఇస్మాయిల్ హీరోయిన్గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
గత నెలలో ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొన్నారు ప్రభాస్. అయితే వేసవి కావడంతో ఓ చిన్న బ్రేక్‌లో భాగంగా ప్రభాస్ విదేశాలకు వెళ్లారని, వచ్చే నెలాఖర్లో తిరిగి ఆయన ‘ఫౌజి’ షూట్లో పాల్గొంటారని సమాచారం. హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ దసరా సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా మేకర్స్ ఇటీవల ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది.
రణబాలి తిరుగుబాటు
బ్రిటిషర్లకు ఎదురు నిలిచి, తిరుగుబాటు చేసిన ఓ యోధుడి కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘రణబాలి’. రాయలసీమ ప్రాంతంలో 1854–1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. ఆ సమయంలో భారతదేశ ప్రజల పట్ల బ్రిటిష్ పాలకులు ఎలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డారు? మాతృభూమి కోసం రణబాలి ఎలాంటి పోరాటం చేశాడు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుందని తెలిసింది. ‘డియర్ కామ్రేడ్ (2019), ఖుషి (2023)’ వంటి చిత్రాల తర్వాత ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మికా మందన్నా ముచ్చటగా మూడోసారి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
విజయ్ దేవరకొండతో ‘టాక్సీవాలా’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తీసిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టైటిల్ రోల్లో విజయ్ దేవరకొండ నటిస్తుండగా, జయమ్మగా రష్మికా మందన్నా నటిస్తున్నారు. విలన్ సర్ థియోడోర్ హెక్టార్ పాత్రను ‘మమ్మీ’ సినిమా ఫేమ్ ఆర్నాల్డ్ వోస్లూ పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ అనంతపురంలో జరుగుతోందని తెలిసింది. విజయ్ దేవరకొండతో పాటు ప్రధాన తారాగణం పాల్గొంటుండగా, కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట.
టీ సిరీస్ ఫిలింస్, గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ల సమర్పణలో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబరు 11న రిలీజ్ కానుంది.
డేవిడ్ రెడ్డి
‘మనల్ని ఇండియన్ డాగ్స్ అనే బ్రిటిషర్లకు అతను వార్ డాగ్ అయ్యాడు..’, ‘ఏ బ్రిటిష్ ఇండియా నహీ హై, ఏ డేవిడ్ రెడ్డీకా ఇండియా హై’... ఇటీవల విడుదలైన ‘స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి’ గ్లింప్స్‌లోని రెండు డైలాగ్స్ ఇవి. మంచు మనోజ్ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం ‘డేవిడ్ రెడ్డి’. 1897 నుంచి 1920 మధ్య బ్రిటిష్ పాలనా కాలం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. బ్రిటిష్ క్రూర పాలనకు ఎదురు నిలిచి పోరాడిన యోధుడి పాత్రలో మనోజ్ నటిస్తున్నారు. ఉక్రెయిన్ నటి మరియా ర్యబోషప్క హీరోయిన్గా నటిస్తుండగా, ఆర్. పార్తీబన్, కాంచన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. హనుమ రెడ్డి యక్కంటి దర్శకత్వంలో భరత్ మోటుకూరి,
నల్లగంగుల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే విడుదల కానుందని తెలిసింది.
ది ఇండియా హౌస్
నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘ది ఇండియా హౌస్’. రామ్ వంశీకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వి మెగా పిక్చర్స్ పతాకంపై విక్రమ్ రెడ్డితో కలిసి రామ్ చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం అప్పట్లో లండన్‌లో కొందరు భారతీయుల వ్యూహాత్మక కార్యాచరణ, అమలు వంటి అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుందని తెలిసింది. ప్రధాన సినిమా కథాంశం 1905 నేపథ్యంలో సాగుతుంది. స్వాతంత్య్ర సమర యోధుడు వీర్ సావర్కార్ ప్రస్తావన ఈ సినిమా కథనంలో ఉంటుందని సమాచారం. సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్ కీలక పాత్రæపోషిస్తున్నారు.
ఒక తిరుగుబాటుదారుని కథ
‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా అశ్విన్ గంగరాజు దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించనున్నారు. ‘అన్ని తిరుగుబాటులకు యుద్ధ రంగమే ఆధారం కాదు. కొన్ని విధి చేత ఎంపిక చేయబడతాయి. ఇది ఒక తిరుగుబాటుదారుని కథ’ అని ఈ సినిమా కాన్సెప్ట్ గురించి మేకర్స్ తెలి΄ారు. 18వ శతాబ్దంలో బెంగాల్ ప్రావిన్స్‌లో బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఓ తిరుగుబాటుదారుని నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. తిరుగుబాటు
దారునిగా రిషబ్ శెట్టి నటిస్తారు.
ఈ కోవలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి.
Tags : 1