ఎవరిది గోల్డ్.. ఎవరిది రోల్ గోల్డ్..?
Breaking News
ఒంటరితనం తెచ్చిపెడుతున్న ముప్పు..
Published on Wed, 04/01/2026 - 13:34
ఇల్లు ఆమెదే! ఆ ఇంటికి ఆమే యజమానురాలు! ఉదయం లేచింది మొదలు భర్త, పిల్లలు, అత్త, మామ..ఇంటిల్లిపాది అవసరాలు చూడటంలో క్షణం తీరికలేనట్టు ఉరుకులు, పరుగులు.. కానీ, ఆమె ఎప్పుడూ ఒంటరితనం మూటను భుజాన వేసుకునే ఉంటుంది. ఎవ్వరితోనూ చెప్పుకోలేని సమస్యల నిశ్శబ్దాన్ని మోస్తుంది.శరీరంలో వచ్చే మార్పులు, కుటుంబ బాధ్యతల చిక్కులు, ఆర్థిక అవసరాలు, సామాజిక ఒత్తిళ్లు... వీటిల్లో తనను తాను ఎక్కడో పోగొట్టుకున్నట్టు తెలియని శూన్యం ఆవరించినట్టు ఆత్మహత్యలవైపు అడుగులు వేస్తుందా..?! ఈ రోజుల్లో వివిధ దశలలో మహిళలు ఒంటరితనం అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకునే శాతం పెరుగుతోందని నివేదికలు చూపుతున్నాయి. కారణాలు ఉంటే.. పరిష్కారమూ ఉంటుంది..
యాభై ఏళ్ల కిరణ్మయి చెన్నైలో తన కుమార్తె ఇంట్లో ఆత్మహత్యకు ప్రయత్నించింది. భర్త రిటైర్ అయిన తర్వాత ఆమె కుమార్తె కుటుంబంతో కలిసి నివసిస్తోంది. ఓరోజు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సకాలంలో ఆమెను ఆసుపత్రిలో చేర్చడంతో గండం నుంచి బయటపడింది. ఎందుకిలా చేశావని అడిగితే – ‘నా ఇంట్లో నేనే కనిపించకుండా పోయినట్టుగా అనిపించింది. నా మాటకు ఎక్కడా విలువలేదు’ అని చెబుతూ ఎంతో బాధపడింది.
మెనోపాజ్ సమయంలో ఆమె భావోద్వేగ సంబంధ మార్పులు, చిరాకు, నిద్రలేమి వంటి సమస్యలను ఎదుర్కొంది. తన పరిస్థితిని ఎవరికైనా చెప్పుకోబోతే ‘అతిగా ఆలోచిస్తున్నావు, అంతే’ అని తేలికగా కొట్టిపారేసేవారు ఇంట్లో. అందుకే, ఆ నిర్ణయం తీసుకుందామె.
రవీనా శరణ్ అనే న్యాయవాదికి నాల్గవ నెల ప్రెగ్నెన్సీలో గర్భస్రావం జరిగింది. ఆ బాధకన్నా ‘మేం ముందే చెప్పాం, జాగ్రత్తగా ఉండమని..’ అనే మాటలు తరచూ వినాల్సి రావడమే పెద్ద బాధ. దానిని అధిగమించలేక... ఎవరితో కలవలేక ఒంటరితనంతో బాధపడుతూ ‘ఈ గిల్ట్‌తో నేను చనిపోయేదాన్నే’ అంటోంది.
ఈ మహిళల వయస్సు, పరిస్థితులు వేరయినా, వారి బాధ ఒకటే. భారతదేశంలో మహిళల మానసిక ఆరోగ్య సమస్యలకు సామాజిక ఒత్తిళ్లు, హార్మోన్ల మార్పులు, లింగవివక్ష, ఆర్థిక సమస్యలు ప్రధాన కారణాలు అవుతున్నాయి. కొన్ని హెల్త్ సర్వేల ప్రకారం ఇటీవల మహిళల్లో డిప్రెషన్, ఆందోళన ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కూడా పురుషుల కంటే మహిళల్లోనే కుంగుబాటు ఎక్కువగా ఉందట.
నిశ్శబ్దానికి బ్రేక్...
ఆత్మహత్యల్లో 15–34 సంవత్సరాల లోపు మహిళలు 63 శాతం ఉండగా, తల్లుల మరణాల్లో ఈ శాతం 39గా ఉంది. ప్రతి 5గురిలో ఒక తల్లి మానసిక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటుంది.
70–80 శాతం మందికి తగిన చికిత్స అందట్లేదు. మహిళలు మౌనంగా బాధపడుతూ ‘బలంగా’ ఉండాలని చెప్పే గతకాలపు సూక్తుల వల్ల కూడా బయటకు చెప్పుకోలేని మధనంలో కాలం వెళ్లదీస్తున్నారనేది నిపుణుల మాట.
మహిళల్లో సాధికారత పెరిగితే, ఒంటరితనం సమస్యలు తగ్గుముఖం పడతాయి.
గుర్తించకపోవడమే అసలు సమస్య...
మన దేశంలో మనస్తత్వ నిపుణుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మానసిక వ్యాధుల ఆర్థిక భారం దేశంలో 2030 నాటికి లక్ష కోట్లు దాటే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే మహిళల మానసిక సమస్యలను ఒక సమస్యగా గుర్తించకపోవడం కూడా దీనికి ప్రధానకారణం.
ఎందుకు ఒంటరితనం అంటే...
జీవితం అంతా కుటుంబానికే అంకితం చేయడం. వ్యక్తిగత ఆసక్తులు, స్నేహితులను, కెరియర్‌ను వదిలేయడం.
భర్త బిజీగా ఉండి, ఎమోషనల్‌గా కనెక్ట్ అవకపోవడం. చుట్టూ అందరూ ఉన్నా మనసులో ఎవరూ లేనట్టుగా అనిపించడం.
ఇది చాలా చిన్న విషయం, ఎవరో దీనికన్నా పెద్ద సమస్యలు ఎదుర్కొంటున్నారని భావించడం. ఇవి ఇలాగే కొనసాగితే, జీవితంలో ఉత్సాహం స్థానంలో నిస్సత్తువ ఆవరిస్తుంది.
ఎలా అధిగమించాలంటే..
ముందు తనకు తాను ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. సమస్యను ఒక బలహీనతగా చూడకూడదు. నచ్చిన పనులవైపు దృష్టి పెట్టమని చెప్పే ఒక సంకేతంలా భావించాలి. స్వీయ ఆసక్తులు, అభిరుచులవైపు మనసు మళ్లించుకోవాలి.
కొత్తగ్రూప్స్‌తో కనెక్ట్ అవ్వాలి. అంటే, ఉదయం వేళల్లో యోగా, వాకింగ్ గ్రూప్‌లలో చేరడం, అభిరుచికి తగిన క్లాసుల్లో చేరితే కొత్త నైపుణ్యాలవైపు దృష్టి మరల్చవచ్చు, కొత్త వ్యక్తులతో పరిచయాలు పెంచుకోవచ్చు. దీనివల్ల మైండ్‌లో చేరిన గ్యాప్ మెల్ల మెల్లగా ఫిల్ అవుతుంది.
ఉద్యోగినులైతే సాయంకాలం ఇంటికి చేరుకున్నాక వెంటనే తమ ఒంటరి ప్రపంచంలోకి వెళ్లకుండా, గంటసేపైనా ఇంట్లో వాళ్లతో కబుర్లు చెప్పగలగాలి. లేదా, తమవారితో ఫోన్‌లోనైనా మనసు విప్పి మాట్లాడగలగాలి.
ఎంత పెద్దసమస్య అయినా తన భావాలను ఎవరితోనైనా పంచుకోవాలి. మనసుకు నచ్చిన విషయాలను రాయడం, చదవడం వంటివి కూడా ఒంటరితనాన్ని దూరం చేస్తాయి. మహిళలు ఎప్పుడూ ఇతరుల కోసం జీవిస్తారు. కానీ, తమకోసం తాము జీవించడం నేర్చుకున్నప్పుడు జీవనశైలి కూడా మెరుగవుతుంది.
కొత్త గ్రూప్స్‌తో కనెక్ట్ అవ్వాలి
మనిషి ఇంట్లో ఉన్నా మనసు ఎక్కడో ఉన్నట్టు ఫీలయితే ఒంటరితనాన్ని మోస్తున్నట్టే. మనిషి ఎంత దూరంలో ఉన్నా మనసు తమ వారికి దగ్గరగా ఉంటే ఒంటరి కానట్టే. ఇంట్లో తమ ప్రాధాన్యత తగ్గిందనో, ఎవరూ పట్టించుకోవడం లేదనో, ఏదైనా అపరాధన భావనో, సన్నిహితులు దూరమయ్యారనో, ఆర్థిక పరిస్థితులు బాగా లేవనో, బతుకు భారంగా మారిందనో.. అందరిలో ఉన్నా ఒంటరితనాన్ని అనుభవించే రోజులు పెరిగితే, ఇక జీవితాన్ని చాలించాలనుకునే ఆలోచనలూ పెరుగుతుంటాయి.
సూసైడ్ టెండెన్సీ ఉన్న వాళ్లలో రెండు నెలల ముందు నుంచే ఆత్మహత్య చేసుకుంటామన్న విషయాన్ని బయటకు ఏదో ఒక రూపకంగా చెబుతుంటారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు ఇంట్లోనూ, సన్నిహితులు అలెర్ట్ అయ్యి, కౌన్సెలర్ సాయం తీసుకుంటే ఈ సమస్యను అధిగమించవచ్చు.
– డాక్టర్ సునీతా ప్రసాద్, సైకాలజిస్ట్
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Tags : 1