Breaking News

‘పరాభవ’అంటే అవమానం కాదు, ఇదీ అర్థం!

Published on Thu, 03/19/2026 - 13:25

Ugadi 2026 తెలుగువారు జరుపుకునే మొదటి పండుగ ఉగాది. ఉగాది అంటే ‘యుగమునకు ఆది’ అని అర్థం. బ్రహ్మదేవుడు సృష్టిని  ప్రాంభించిన రోజుగా దీనిని మనం జరుపుకుంటాం. కాలగమనంలో వచ్చే  60 సంవత్సరాలలో ‘పరాభవ’ నామ సంవత్సరం (Sri Parabhava Nama Samvatsara ugadi) ఒకటి.

సాధారణంగా ‘పరాభవం’ అంటే అవమానం అనే అర్థం స్ఫురిస్తుంది. కానీ శాస్త్రపరంగా, ఆధ్యాత్మికంగా దీనికి లోతైన అర్థం ఉంది. ‘పరా’ అంటే గొప్పదైన, ‘భవ’ అంటే పుట్టుక లేదా స్థితి. అంటే, అహంకారాన్ని విడిచిపెట్టి, వినయంతో మెలగడం ద్వారా ఉన్నతమైన స్థితిని  పొందడమని దీని అంతరార్థం. ఈ సంవత్సరంలో ప్రకృతి వైపరీత్యాల పట్ల అప్రమత్తంగా ఉంటూనే, ధర్మబద్ధమైన జీవనం సాగించాలని పంచాంగకర్తలు చెబుతుంటారు. అంటే మనిషి తనలోని అహంకారాన్ని చంపుకుని, వినయంతో మెలగడం ద్వారా ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిని  పొందడమే ఈ సంవత్సర సందేశం. ధర్మబద్ధమైన జీవనం సాగించే వారికి ఏ పరాభవమూ కలగదని పెద్దల మాట. ‘పరాభవ’ నామ సంవత్సరం మనకు ఒక హెచ్చరికను, అదే సమయంలో ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. పాత కక్షలు, కార్పణ్యాలను విడిచిపెట్టి, ప్రకృతితో మమేకమై సరికొత్త లక్ష్యాలతో ముందుకు సాగడమే ఈ ఉగాది ఆగమన ఉద్దేశం.  

మన  పొరబాట్లను మనం తెలుసుకొని, వినమ్రతతో కొత్త పాఠాలు నేర్చుకోవడం ద్వారా ‘విజయం’ వైపు అడుగులు వేయవచ్చని ‘పరాభవ’ సంవత్సరం సూచిస్తుంది. ఆకు రాలడం చెట్టుకు ‘ఓటమి’ (పరాభవం) లా అనిపించవచ్చు, కానీ అది కొత్త చిగురు రావడానికి (వసంతం) సిద్ధమవ్వడం మాత్రమే.  చీకటి పడటం వెలుగుకు ఓటమి కాదు, అది మరో ఉదయానికి పునాది. అలాగే, మనిషి తనలోని అహంకారాన్ని, పాత ఆలోచనలను పరాభవించి (ఓడించి), సరికొత్త వ్యక్తిత్వంతో ఉదయించడమే ఈ సంవత్సరపు అసలైన అంతరార్థం. 

ఒక రచయితకు విమర్శలు ఎలాగైతే తన రచనను మరింత పదును పెడతాయో, ఈ సంవత్సరం కూడా మన వ్యక్తిత్వాన్ని అలా తీర్చిదిద్దుతుంది.  మనం గడిచిన కాలపు అనుభవాలను చేదు పచ్చడిలా కాకుండా, జీవితాన్ని పదును పెట్టేపాఠాలుగా స్వీకరించాలి. సమయం విలువ తెలిసిన వాడు చరిత్రను నిర్మిస్తాడు. అక్షరం విలువ తెలిసిన వాడు కాలాన్ని శాసిస్తాడు. ఈ పరాభవ నామ సంవత్సరం పాఠకుల మనసుల్లో ఒక కొత్త ఆలోచనను, ఆత్మస్థైర్యాన్ని అందిస్తుంది.  ప్రస్తుత సమాజంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, మానవ సంబంధాలలోని సున్నితత్వాలను, మనుషుల మధ్య పెరిగే అగాధాలను పూడ్చేలా ఈ ’పరాభవ’ కాలం ఒక గొప్ప ప్రేరణ కాగలదు. 

ప్రతి ఉగాది మన జీవితంలో కొత్త ఆశలను, ఆశయాలను నింపుతుంది. ‘పరాభవ’ నామ సంవత్సరం పేరులో కఠినత్వం ఉన్నప్పటికీ, అది మనల్ని క్రమశిక్షణతో ఉండమని హెచ్చరిస్తుంది. పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, కొత్త లక్ష్యాల వైపు అడుగులు వేయడమే ఉగాది యొక్క అసలైన సందేశం.

ఉగాదికి కొన్ని రోజుల ముందే ప్రకృతి లో మార్పులు మొదలవుతాయి. ఎండి΄ోయిన చెట్లు ఆకులు రాల్చి, సరికొత్త లేలేత చిగురుటాకులతో నిండుగా కనిపిస్తాయి. వేప చెట్లు పూత పూస్తాయి, మామిడి చెట్లు పిందెలు వేస్తాయి. ముఖ్యంగా, మధురమైన కంఠంతో కోయిల పాడే పాటలు ఉగాది ఆగమనాన్ని మనకు తెలియజేస్తాయి.

ఇది కేవలం పండుగ మాత్రమే కాదు, ప్రకృతి తనను తాను పునరుద్ధరించుకునే సమయం. మన మనస్సులోని చెడు ఆలోచనలను వదిలి, కొత్త ఆశయాలతో జీవితాన్ని మొదలు పెట్టడానికి ఈ ఆగమనం ఒక చక్కని అవకాశం.

ఉగాది పచ్చడి తీపి, పులుపు, కారం, ఉప్పు, వొగరు, చేదు ఈ ఆరు రుచుల సమ్మేళనం జీవితంలోని సుఖ దుఃఖాలను సమానంగా స్వీకరించాలని బోధిస్తుంది. గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఎవరికి ఆదాయం మెండుగా ఉంది? ఎవరికి అరిష్టాలు ఉన్నాయి? వంటి విషయాలను ఉగాది  పంచాంగ శ్రవణం తెలుసుకుని తదనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. తెలుగు భాషా సౌందర్యాన్ని చాటిచెప్పేలా కవులు కవి సమ్మేళనాలతో కొత్త సంవత్సరానికి వన్నె తెస్తారు.

‘పరాభవ’ అంటే ఈ పేరు ఉన్నంత మాత్రాన అందరికీ చెడు జరుగుతుందని కాదు. ఈ సంవత్సరంలో పుట్టిన వారు సాహసవంతులుగా, పట్టుదల గలవారుగా ఉంటారని చెబుతుంటారు.  ఈ సంవత్సరంలో వర్షాలు సాధారణంగా ఉంటాయని, ప్రజల్లో కొంచెం అసహనం లేదా విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుందని సూచించబడింది. 

తెలుగు పంచాంగ చక్రంలో ఇది 40వ సంవత్సరం. ఈ సంవత్సరానికి రాక్షస గణాధిపతి కాలపురుషుడు అధిపతిగా ఉంటారు. ఈ ఏడాది ఉగాది గురువారం రావడం వల్ల గురు గ్రహ అనుగ్రహం విశేషంగా ఉంటుందని ఒక నమ్మకం. కొత్త పనులు ప్రారంభించడానికి, అక్షరాభ్యాసాలకు గృహ ప్రవేశాలకు ఈ సంవత్సరం అనుకూలమైన ముహూర్తాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదీ చదవండి: చిలుక జ్యోతిష్యుడిని నమ్మి నిండా మునిగిన ఐటీ అధికారి

ఉగాది ఆగమనం ఒక చైతన్యానికి ప్రతీక. మనిషి తన గతంలోని ΄÷ర΄ాట్లను విడిచిపెట్టి, నూతన ఉత్సాహంతో భవిష్యత్తు వైపు అడుగులు వేయాలని ఈ పండుగ మనకు దిశానిర్దేశం చేస్తుంది. ప్రకృతితో కలిసి మనం కూడా కొత్తగా వికసించడమే ఉగాది పండుగలోని పరమార్థం.
– రామలక్ష్మీ సదానందమ్‌ 

Videos

మంగ్లీ సాంగ్ పై కేంద్రం సీరియస్

జగన్ హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇరాన్ దూకుడు... గల్ఫ్ దేశాలపై భీకర దాడులు ఇక ప్రపంచ యుద్ధమే

ఆ రోజు వివేక చనిపోయినప్పుడు టీడీపీలో ఉన్న కానీ... మీకు ఎవ్వరికి తెలియని విషయం..

పిన్నెల్లికు ఘన స్వాగతం

గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఊరట.. ఇ-కేవైసీ వారికి మాత్రమే!

అసలు వంట వచ్చా..? సమంతకు కోపం తెప్పించిన సుమ

రీల్స్ పిచ్చితో యువత పిచ్చి పనులు

గంటపాటు వర్సానికి మునిగిపోయిన అమరావతి రోడ్లు

హర్మాజ్ జలసంధి ఆక్రమణ కోసం ట్రంప్ భారీ వ్యహం

Photos

+5

గద్దర్‌ అవార్డ్స్ అందుకున్న విజేతలు (ఫొటోలు)

+5

అట్టహాసంగా గద్దర్ అవార్డుల వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు)

+5

పేరేంట్స్‌గా మాకు గర్వకారణం.. కుమారుడి ఈవెంట్‌లో శివబాలాజీ దంపతులు (ఫొటోలు)

+5

టాలీవుడ్ జంట కిరణ్ అబ్బవరం- రహస్య ఉగాది వేడుకలు (ఫొటోలు)

+5

ఉగాది స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ ఇలా (ఫొటోలు)

+5

పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకల్లో వైఎస్‌ జగన్‌ దంపతులు (ఫొటోలు)

+5

విజయవాడ : సెలవులు, పండుగ వచ్చేసింది.. బస్టాండ్‌లో విద్యార్థులు, ప్రయాణికుల రద్దీ (ఫొటోలు)

+5

శ్రీశైలంలో ఉగాది ఉత్సవాలు.. కనుల పండువగా ప్రభోత్సవం (ఫొటోలు)

+5

సాక్షి స్పెషల్.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు (ఫొటోలు)

+5

ఇఫ్తార్‌ విందు.. ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)