ఆంధ్ర ప్రజలను తాకట్టు పెట్టి మరి ... బాబు అప్పుల చిట్టా ఆధారాలతో చూపించిన పేర్ని నాని
Breaking News
కాఫీకి ఒక రోజు..!
Published on Fri, 03/13/2026 - 17:22
కాఫీ అంటే ఉదయించే ఉత్సాహం. సరికొత్త రోజుకు కాఫీ సేవనంతో ఉత్సాహంగా స్వాగతం చెప్పటం తప్పనిసరైన ఇష్టమని గాఢంగా భావించే కాఫీ ప్రేమికులు ప్రపంచవ్యాప్తంగా కోకొల్లలు. ఒక మహత్తరమైన ఆహార సాంస్కృతిక వారసత్వానికి కాఫీ ఒక ప్రతీక. అటువంటి కాఫీకి ఇప్పటి వరకు ఒక ప్రత్యేక రోజంటూ లేదు. ఇప్పుడా కొరత తీరింది. అక్టోబర్ 1వ తేదీన ఇక ఏటా అంతర్జాతీయ కాఫీ డే (International Coffee Day) జరుపుకోవచ్చు. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఈ నెల 10వ తేదీన ఈ మేరకు తీర్మానించింది. తన సువాసనలతో ఉత్తేజపరిచే కాఫీకి జేజేలు చెప్పని వారు ఈ విశాల భూతలమ్మీద ఎవరుంటారు? కమ్మటి కాఫీని సిప్ చేస్తూ మైమరచే వినియోగదారులతో పాటు కాఫీ గింజలను ఆరుగాలం కష్టించి పండించే రైతుల వరకూ కాఫీ దినోత్సవ ప్రకటన ఒక ఉత్తేజకరమైన వార్తే కదూ! ఆహార భద్రతకు దోహదపడే కాఫీ పంట సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి కాఫీకి ఒక రోజును కేటాయిస్తున్న ఐక్యరాజ్యసమితి తీర్మానం పేర్కొంది. ఈ సందర్భంగా కాఫీ కబుర్లు మీ కోసం!
కాఫీకి ఉన్న సాంస్కృతిక, సామాజిక, చారిత్రక ప్రాముఖ్యతను ఐక్యరాజ్య సమితి గుర్తించింది. ఇదొక ముఖ్యమైన వ్యవసాయక ఉత్పత్తి మాత్రమే కాదు, కోట్లాది మంది వ్యవసాయ సమూహాలకు జీవనోపాధి కూడా. సామాజిక ఆతిథ్యం, సాంస్కృతిక వ్యక్తీకరణ, రోజువారీ సంప్రదాయానికి చిహ్నంగా కూడా కాఫీ మారింది అని ఐరాస తీర్మానం పేర్కొంది. ఆకలికి వ్యతిరేకంగా పోరాటం, తీవ్ర పేదరికాన్ని తగ్గించడం, మహిళల సాధికారత, మంచి పనిని ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడం వంటి అనేక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు కాఫీ సాగు, ప్రాసెసింగ్ దోహదపడుతున్నాయని ఐరాస పేర్కొంది.
2.5 కోట్ల రైతుల పంట
ప్రపంచంలో అత్యంత విస్తృతంగా సేవించే పానీయాలలో కాఫీ ఒకటి. గత దశాబ్దంలో ప్రపంచ తలసరి వినియోగం సంవత్సరానికి 1.2 శాతం పెరుగుతోంది. ఈ రంగం సుమారు 2.5 కోట్ల రైతుల జీవనోపాధికి తోడ్పడుతోంది. తోటల సాగు నుంచి ప్రాసెసింగ్, వినియోగం వరకు విస్తరించిన విలువ గొలుసు అంతటా ఎందరికో ఉపాధి అవకాశాలను కాఫీ కల్పిస్తోంది. మొత్తం మీద, ప్రపంచ కాఫీ పరిశ్రమ వార్షిక ఆదాయం 20,000 కోట్ల డాలర్లు.
3,400 కోట్ల డాలర్ల వాణిజ్యం
ప్రపంచంలోనే అత్యధికంగా క్రయవిక్రయాలు జరిగే వస్తువులలో కాఫీ ఒకటిగా ఉంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి 1.1 కోట్ల టన్నులను అధిగమించింది. అంతర్జాతీయంగా సుమారు 80 లక్షల టన్నుల కాఫీ గింజల వర్తకం జరుగుతోంది. 2024లో ప్రపంచ కాఫీ ఉత్పత్తి విలువ దాదాపు 2,500 కోట్ల డాలర్లని అంచనా, అయితే, కాఫీ గింజల ప్రపంచ వాణిజ్యం సుమారు 3,400 కోట్ల డాలర్లకు చేరుకుంది.
పుట్టిల్లు ఇథియోపియా
అనేక తక్కువ ఆదాయ దేశాలు విదేశీ మారకద్రవ్యం ఆర్జనకు కాఫీ ఎగుమతులు కీలకంగా మారాయి. కాఫీ పుట్టిల్లు ఇథియోపియా. 2024లో ఇథియోపియా మొత్తం వస్తువుల ఎగుమతుల్లో కాఫీ వాటా 27.9 శాతం. ఉగాండాలో 20.1 శాతం, బురుండిలో 19.5 శాతం. ఇథియోపియా, ఉగాండా రెండింటిలోనూ, కాఫీ ఎగుమతి ఆదాయాలు ఆహార దిగుమతి బిల్లులను మించిపోయాయి. 2024లో బ్రెజిల్, వియత్నాం ప్రముఖ కాఫీ ఎగుమతిదారులుగా ఉన్నాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా అతిపెద్ద దిగుమతిదారులుగా ఉన్నాయి.
కాఫీ రైతులు ఎదుర్కొంటున్న వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడంలో ఆహార – వ్యవసాయ సంస్థ ఫార్మర్ ఫీల్డ్ స్కూల్స్ కార్యక్రమం ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఫీల్డ్ స్కూల్స్ ద్వారా తూర్పు ఆఫ్రికాలో, క్యూబాలో సహకార కాఫీ సాగు నమూనాలను ఎఫ్ఏవో బలోపేతం చేసింది. ప్రపంచ కాఫీ మార్కెట్కు అవసరమైన బలమైన ట్రేసబిలిటీ వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి రైతులు, ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తోంది.
ఏడో స్థానంలో భారత్
కాఫీ సాగులో ప్రపంచంలో ఏడో స్థానంలో, ఎగుమతిలో ఐదో స్థానంలో భారత్ ఉంది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తదితర దక్షిణాది రాష్ట్రాల్లోనే 90% కాఫీ గింజలు పండుతాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ కనుమల్లోని కొండ్రప్రాంతాల్లో కాఫీ సాగు విస్తరించింది. అరకు కాఫీ ఘుమఘుమలకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. కాఫీ రకాల్లో అరబిక 30%, రోబస్ట 70% మన దేశంలో సాగవుతున్నాయి.
17వ శతాబ్దంలో బాబా బుడాన్ ఎమెన్ నుంచి ఏడంటే ఏడు కాఫీ గింజల్ని మన దేశానికి రహస్యంగా తీసుకొచ్చారు. బ్రిటీష్ పాలనలో 19వ శతాబ్దం మధ్య నుంచి వాణిజ్యపరంగా కాఫీ పంట సాగు మన దేశంలో డచ్ వారి చొరవతో ప్రారంభమైంది. మన దేశంలో ఉత్పత్తయ్యే కాఫీ గింజల్లో 70% ఇటలీ, రష్యా, జర్మనీ కొనుగోలు చేస్తున్నాయి. 6 లక్షల కుటుంబాలు ఆధారపడి ఉన్న కాఫీ పరిశ్రమ కార్యకలాపాలను కాఫీ బోర్డు పర్యవేక్షిస్తోంది.
చదవండి: మహిళా రైతులకు మద్దతిస్తే..!
కాఫీ అనేది ఒక పానీయం కంటే ఎక్కువ. ఇది ప్రపంచవ్యాప్త వాణిజ్య వస్తువు. గింజల నుండి కాఫీ సేవనం వరకు – కోట్లాది వ్యవసాయ కుటుంబాల జీవనోపాధిని నిలబెడుతోంది. గ్రామీణులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం చేస్తోంది. కాఫీ రంగానికి గల విలువను గుర్తించటం, దాని సామాజిక–ఆర్థిక ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. పేదరిక నిర్మూలనకు దాని సహకారాన్ని బలోపేతం చేస్తుంది. కాఫీ దినోత్సవాన్ని, దాని విలువలను సంబరంగా జరుపుకోటానికి ఎదురుచూస్తున్నాం.
– క్యూ.యూ. డోంగ్యు, డైరెక్టర్ జనరల్, ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ, రోమ్.
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
Tags : 1