బెంగళూరులో సిలిండర్ దొంగతనం.. CCTV విజువల్స్ వైరల్
Breaking News
క్రూడ్ మంట.. బేర్ పంజా!
Published on Fri, 03/13/2026 - 00:24
మళ్లీ ముడిచమురు ధరల మంటతోపాటు పశ్చిమాసియాలో యుద్ధ భయాలు పెరగడంతో దేశీ స్టాక్ మార్కెట్లకు వరుసగా రెండో రోజు షాక్ తగిలింది. రోజంతా అమ్మకాలదే పైచేయి కావడంతో మార్కెట్లు నష్టాలలోనే కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 76,000 పాయింట్ల దిగువకు సైతం పడిపోయింది. బ్రెంట్ చమురు పీపా ధర 10 శాతం ఎగసి 100 డాలర్లను దాటింది.
ముంబై: చమురు ధరలకు రెక్కలు రావడంతో మరోసారి దేశీ స్టాక్ మార్కెట్లు దెబ్బతిన్నాయి. సెన్సెక్స్ 829 పాయింట్లు పతనమై 76,034 వద్ద ముగిసింది. ఒక దశలో అమ్మకాలు పెరగడంతో 993 పాయింట్లు నీరసించి 76,000 దిగువన 75,871ను తాకింది. ఇక నిఫ్టీ 228 పాయింట్లు క్షీణించి 23,639 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 23,556కు చేరింది. యుద్ధానికి ముగింపు పలకనున్నట్లు యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించినప్పటికీ దాడులు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనకు లోనవుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. మరోపక్క ముడిచమురు ధరలు సైతం తిరిగి జోరందుకోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు తెలియజేశారు. ఆసియా, యూరప్ మార్కెట్ల బలహీనతలు సైతం వీటికి జత కలిసినట్లు వెల్లడించారు. బుధవారం సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 395 పాయింట్లు కోల్పోయిన విషయం విదితమే.
ఆటో రివర్స్ గేర్
ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఎఫ్ఎంసీజీ ప్రయివేట్ బ్యాంక్స్, రియల్టీ సూచీలు 3–2% మధ్య క్షీణించాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్ఎం, టీఎంపీవీ, ఐషర్, ఎల్అండ్టీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, అదానీ పోర్ట్స్, హెచ్‌యూఎల్, అ్రల్టాటెక్, అపోలో హాస్పిటల్స్, ఇండిగో, ఐటీసీ, యాక్సిస్, ఐసీఐసీఐ 4–2 శాతం మధ్య డీలాపడ్డాయి. అయితే కోల్ ఇండియా, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, జియో ఫైనాన్స్, టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, హెచ్‌సీఎల్ టెక్ 5–0.5 శాతం మధ్య లాభపడ్డాయి.
చిన్న షేర్లు డీలా
బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ 0.6% చొప్పున నీరసించాయి. ట్రేడైన షేర్లలో 2,645 నష్టపోగా.. 1,598 బలపడ్డాయి.
రూ. 23.44 లక్షల కోట్లు హుష్‌కాకి
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులకు బీజం పడ్డాక దేశీ స్టాక్ మార్కెట్లలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో ఫిబ్రవరి 28 మొదలు ఇప్పటివరకూ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ 5,253 పాయింట్లు(6.5 శాతం) క్షీణించింది. అయితే అన్ని రంగాలలోనూ అమ్మకాలు కొనసాగుతుండటంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 23.44 కోట్లమేర హరించుకుపోయింది. వెరసి బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) రూ.4,40,06,434 కోట్ల (4.77 ట్రిలియన్ డాలర్లు)కు పరిమితమైంది.
రికార్డ్ కనిష్టానికి రూపాయి
24 పైసలు క్షీణతతో 92.25కు
చమురు ధరల సెగ మరోసారి దేశీ కరెన్సీని దెబ్బతీసింది. డాలరుతో మారకంలో రూపాయి 24 పైసలు క్షీణించి 92.25 వద్ద ముగిసింది. వెరసి ఇంతక్రితం ఈ నెల 9న నమోదైన సరికొత్త కనిష్టం 92.21ను తుడిచి పెట్టింది. కాగా, ఇంట్రాడేలో 92.36 వద్ద తాజాగా చరిత్రాత్మక కనిష్టాన్ని తాకింది.
కిచెన్ అప్లయెన్సెస్ షేర్ల జోరు
ఇండక్షన్ కుక్‌టాప్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు భారీ గిరాకీ
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం కార ణంగా చమురు ధరల మంటకుతోడు.. గ్యాస్ రవాణా నిలిచిపోవడంతో దేశీయంగా కిచెన్ అప్లయెన్సెస్‌కు ఉన్నట్టుండి డిమాండ్ పెరిగింది. ఇండక్షన్ కుక్‌టాప్, ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లకు భారీ గిరాకీ ఏర్పడటంతో వరుసగా మూడో రోజు కిచెన్ అప్లయెన్సెస్ త యారీ కంపెనీల కౌంటర్లు వెలుగులో నిలిచా యి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తాజాగా జైపాన్ ఇండస్ట్రీస్ 14 శాతం, టీటీకే ప్రెస్టీజ్ 8.3 శాతం చొప్పున జంప్‌చేశాయి. బజాజ్ ఎలక్ట్రికల్స్, వీగార్డ్ 1.5 శాతం మధ్య లాభపడ్డాయి. గత మూడు(9–11) రోజుల్లో బటర్‌ఫ్లై, టీటీకే, స్టవ్‌క్రాఫ్ట్ 35 శాతానికిపైగా దూసుకెళ్లిన విషయం విదితమే.
రెస్టారెంట్లకు సెగ
ఎల్పీజీ కొరత నేపథ్యంలో రెస్టారెంట్ కౌంటర్లు అమ్మకాలు ఎదుర్కొంటున్నాయి. యునైటెడ్ ఫుడ్‌బ్రాండ్స్ 7 శాతం, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్ 3 శాతం, జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ 2 శాతం క్షీణించగా.. రెస్టారెంట్ బ్రాండ్స్, ఎటర్నల్, స్విగ్గీ 1 శాతం చొప్పున డీలా పడ్డాయి. ఐటీసీ హోటల్స్ 2.4 శాతం క్షీణించి రూ. 158కు చేరింది. ఇది ఏడాది కనిష్టంకాగా.. లెమన్ ట్రీ హోటల్స్ రూ. 101 వద్ద, స్విగ్గీ రూ. 271 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకాయి.
Tags : 1