11 వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా మిత్ర పక్షాలపై ఇరాన్ దాడులు
Breaking News
ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్..
Published on Wed, 03/11/2026 - 02:44
దేశంలో ఎల్పీజీ కొరత ప్రభావంతో ఇండక్షన్ కుక్కర్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. గ్యాస్ సిలిండర్ల సరఫరాపై ఆంక్షలు విధించడంతో గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ షోరూమ్‌లు అలాగే ఆన్‌లైన్ వేదికల్లో ఇండక్షన్ కుక్కర్లకు భారీగా డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా గత శనివారం నుంచి అమ్మకాలు, ఎంక్వైరీలు అసాధారణంగా పెరిగినట్లు వెల్లడించారు.
ఇంతకు ముందు కొన్ని షోరూమ్ చైన్‌లు రోజుకు సుమారు 35–40 ఇండక్షన్ కుక్కర్లను మాత్రమే విక్రయించేవి. అయితే ప్రస్తుతం ఆ సంఖ్య 150కు చేరువైందని వ్యాపారులు చెబుతున్నారు.
ఇండక్షన్ కుక్కర్లకు పెరుగుతున్న డిమాండ్ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కూడా కనిపించింది. ఈ రంగానికి చెందిన కంపెనీల షేర్ ధరలు ఒక్క రోజులో గణనీయంగా పెరిగాయి. బోరోజ్ షేర్లు సుమారు 13 శాతం, బజాజ్ ఎలక్ట్రికల్స్ 7 శాతం, టిటికే ప్రెస్టీజ్ 7 శాతం, హాకిన్స్ 4.8 శాతం లాభపడ్డాయి. బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్ షేర్లు కూడా సుమారు 2 శాతం పెరిగాయి.
భారతదేశంలో ఎల్పీజీ వార్షిక వినియోగం సుమారు 31.3 మిలియన్ టన్నులు. ఇందులో 87 శాతం వినియోగం గృహ రంగానిదే. ఎల్పీజీ కొరత, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ ధరలు పెరగడం, భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశాలపై భయాలు ఉండటంతో ఇండక్షన్ కుక్కర్లపై ప్రజలు మొగ్గు చూపుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా, పరిస్థితిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు చర్యలు చేపట్టాయి. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని పెంచడం, అవసరమైన రంగాలకు మాత్రమే సిలిండర్ల సరఫరాను పరిమితం చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలకు మాత్రమే ఎల్పీజీ సరఫరా కొనసాగుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా తాత్కాలికంగా నిలిపివేశారు.
దేశీయ ఉత్పత్తిని సుమారు 10 శాతం పెంచినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఆంక్షలను సడలించే అవకాశముందని కేంద్రం, చమురు కంపెనీలు తెలిపాయి.
Tags : 1