10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
వానిటీ వ్యాన్స్, వాష్‌రూమ్స్ కూడా లేవు: బాలీవుడ్ నటి
Published on Mon, 03/09/2026 - 15:51
ఇప్పుడంటే సకల సౌకర్యాలు ఉన్నాయి కానీ ఒకప్పుడు వానిటీ వ్యాన్స్, వాష్‌రూమ్స్ లేనేలేవంటోంది సీనియర్ నటి సుప్రియ పాఠక్. 1980వ దశకంలో సెట్‌లో కనీస వసతులు లేకపోయినా పెద్దగా లెక్కచేయలేదని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుప్రియ పాఠక్ మాట్లాడుతూ.. మేము ప్యాషన్‌తో యాక్ట్ చేసేవాళ్లం. మాకిచ్చిన పాత్రలను తప్ప మిగతా వేటినీ మేము పట్టించుకునేవాళ్లం కాదు. కానీ రానురానూ కొన్ని విషయాలు పట్టించుకోవాలని అర్థమైంది.
బాత్రూమ్స్ తప్పనిసరి
షూటింగ్ గ్యాప్‌లో కూర్చోవడానికి కొంత ప్లేస్ కావాలి. మహిళలకు ముఖ్యంగా బాత్రూమ్స్ ఉండాలి. ఇవి కనీస అవసరాలు అని తెలుసుకున్నాం. సెట్‌లో అందరూ నిలబడి ఉన్నప్పుడు నిర్మాతలకు కూడా అర్థమైంది. కనీసం కూర్చోవడానికి ఏదైనా వసతి కల్పించాలని వాళ్లూ రియలైజ్ అయ్యారు. అయితే ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో షూటింగ్‌కు వెళ్లినప్పుడు వాష్‌రూమ్స్ వసతి అనేది ఉండదు.
కనీస వసతి అవసరం
చలిలో లేదా ఎండలో షూటింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆహారం, నీళ్లు, టీ అనేవి అందించడం కూడా ముఖ్యమే! ఇప్పుడు షూటింగ్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పరిస్థితి అలా లేదు. ఉదాహరణకు 'మిర్చి మసాలా' సినిమా షూటింగ్ ఒక పల్లెలోని మిర్చి ఫ్యాక్టరీలో జరిగింది. నాతోపాటు పది మంది మహిళలు ఫ్యాక్టరీలో షూటింగ్‌లో పాల్గొన్నారు.
రోజంతా మిర్చి ఫ్యాక్టరీలో..
అసలే ఎండలు మండిపోతుంటే ఆ ఘాటు తట్టుకుని రోజంతా అక్కడే ఉండేవాళ్లం. వెనకాల ఉన్న గడ్డికుప్పలపై సేదతీరేవాళ్లం. అది పెద్ద సమస్యలా ఎప్పుడూ భావించలేదు. ఎందుకంటే మేమంతా ప్యాషన్‌తో పని చేస్తున్నాం. కానీ ఇప్పుడు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. అనేక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి అని చెప్పుకొచ్చింది.
సినిమా
సుప్రియ పాఠక్.. గుజరాతీ, హిందీ భాషల్లో అనేక సినిమాలు చేసింది. కలియుగ్, బజార్, రామ్‌లీలా, మాసూమ్, మిర్చి మసాలా వంటి పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో అరవింద సమేత వీర రాఘవలో జేజిగా, గద్దలకొండ గణేశ్‌లో హీరో తల్లిగా యాక్ట్ చేసింది. చివరగా అస్సి అనే హిందీ చిత్రంలో కనిపించింది. కిచిడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది.
Tags : 1