10 నిమిషాల్లో 12 లక్షల కోట్లు ఆవిరి.... ఈ స్టాక్స్ మీ దగ్గర ఉంటే కొంప కొల్లేరే
Breaking News
మార్కెట్లో చమురు మంట!
Published on Mon, 03/09/2026 - 04:35
పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ భయాల నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత క్షీణించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రధానంగా మండుతున్న ముడిచమురు ధరలు సెంటిమెంటును దెబ్బతీయనున్నట్లు తెలియజేశారు. దీంతో అమ్మకాలదే పైచేయి కానున్నట్లు చెబుతున్నారు. – సాక్షి, బిజినెస్ డెస్క్
గత వారాంతాన ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 9 శాతం ఎగసి 92.6 డాలర్లను దాటగా.. న్యూయార్క్ నైమెక్స్‌లో లైట్ స్వీట్ క్రూడ్ 12 శాతంపైగా జంప్‌చేసి 91 డాలర్లకు చేరింది. అయితే గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడులు నిర్వహిస్తుంటే.. ఇరానియన్ చమురు క్షేత్రాలపై ఇజ్రాయెల్ విరుచుకు పడుతున్నట్లు వెలువడుతున్న వార్తలు చమురు ధరలకు మరింత మద్దతివ్వనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వెరసి దేశీయంగా మార్కెట్లో సెంటిమెంటుకు షాకివ్వనున్నట్లు తెలియజేశారు.
దేశీయంగా ముడిచమురు అవసరాలకు 80 శాతంవరకూ దిగుమతులపైనే ఆధారపడుతుండటంతో సరఫరా సవాళ్లు, ధరల పెరుగుదల కారణంగా వాణిజ్య లోటు భారీగా పెరిగిపోయే అవకాశముంది. ఇది ధరలకు ఆజ్యం పోయడంతోపాటు.. రూపాయిని బలహీనపరచనున్నట్లు ఆరి్థకవేత్తలు వివరించారు. వెరసి ఈ వారం పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులు, చమురు ధరలపైనే మార్కెట్లు దృష్టిపెట్టనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా, జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్, ఆన్లైన్ ట్రేడింగ్, వెల్త్‌టెక్ సంస్థ ఎన్రిచ్ మనీ సీఈవో ఆర్.పొన్మూడి తెలియజేశారు.
క్రూడ్ షాక్..
ముడిచమురు ధరలు ఇప్పటికే దేశీయంగా పలు రంగాల కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ప్రధానంగా ఏటీఎఫ్ ధరలతో విమానయానం ఖరీదుగా మారనుంది. మరోపక్క టైర్లు, పెయింట్ల ముడిసరుకుల ధరలకు రెక్కలు రానుండటంతో లాభదాయకత దెబ్బతినే వీలుంది. చమురు శుద్ధి కంపెనీల మార్జిన్లు సైతం బలహీనపడనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆయా రంగాల కౌంటర్లలో అమ్మకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే ఎఫ్ఎంసీజీ తదితర రంగాలపై ప్రతికూల ప్రభావం పడనున్నట్లు చెబుతున్నారు. ధరలు బలపడితే ఆర్బీఐ కఠిన పరపతి విధానాలవైపు మొగ్గు చూపవలసివస్తుందని ఆరి్థకవేత్తలు అభిప్రాయపడ్డారు.
గణాంకాలు కీలకం..
ఈ వారం దేశీయంగా ఫిబ్రవరి నెలకు వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) వివరాలు వెల్లడికానున్నాయి. జనవరిలో సీపీఐ అంచనాలకంటే అధికంగా 2.75 శాతంగా నమోదైంది. ఇక అంతర్జాతీయంగా చూస్తే ఫిబ్రవరి నెలకు చైనా, యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు సైతం వెలువడనున్నాయి. ఈ బాటలో యూఎస్ ప్రభుత్వం ప్రయివేట్ రంగంలో ఉపాధి కల్పన, జనవరి వాణిజ్య లోటు వివరాలు ప్రకటించనుంది. 2025 డిసెంబర్లో వాణిజ్య లోటు 70.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంతేకాకుండా అక్టోబర్–డిసెంబర్(క్యూ4) జీడీపీ రెండో అంచనాలు వెలువడనున్నాయి.
నేలచూపులోనే...
గత వారం(2–6) దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో నిలిచాయి. నికరంగా బీఎస్ఈ సెన్సెక్స్ 2,368 పాయింట్లు(2.9 శాతం) పతనమైంది. 78,919 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం 728 పాయింట్లు(2.9 శాతం) కోల్పోయి 24,450 వద్ద స్థిరపడింది. ఈ బాటలో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు 3.1 శాతం చొప్పున క్షీణించాయి.
టెక్నికల్‌గా వీక్
⇒ నిఫ్టీ 24,000 పాయింట్లకు దిగే వీలుంది. ఇంతకంటే బలహీనపడితే.. 23,500 వరకూ క్షీణించవచ్చు. ఒకవేళ పుంజుకుంటే 24,500 పాయింట్ల ఎగువన 25,000– 25,300 పాయింట్ల వద్ద అమ్మకాలు ఎదురుకావచ్చు.
⇒ బలహీనతలు కొనసాగితే సెన్సెక్స్ 77,000 పాయింట్లకు జారే అవకాశముంది. ఈ స్థాయి దిగువన 76,000–75,500 పాయింట్ల వద్ద మద్దతు లభించే వీలుంది. ఇక్కడినుంచి బలపడితే.. 80,200–80,700 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్ ఎదురుకావచ్చు.
Tags : 1