Breaking News

12 రోజెస్

Published on Sun, 03/08/2026 - 00:11

30 వయసుకి ముందు ‘ఏం చేశారు?’ అనడిగితే, పాత జెనరేషన్  ఆలోచిస్తుంది. కాని, ఈ జెనరేషన్  అమ్మాయిలు అప్పటికే సాధిస్తారు! చిన్న వయసులోనే ఎవరిపైనా ఆధారపడకుండా, ఆధిక్యతను నిరూపించుకుంటున్నారు. కలలకు డెడ్‌లైన్  పెట్టకుండా, తమ జీవితానికి తామే సింహాసనం వేసుకుంటున్నారు. అలా ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30– 2026’ జాబితాలో ప్రపంచం దృష్టిని ఆకట్టుకున్న మహారాణులు వీళ్లే!

ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్ లో ‘భోజనాలు ఎక్కడ?’ అని తెలుసుకునే లోపే,ముప్పై ఏళ్లు దాటిన వారిని ‘పెళ్లి ఎప్పుడు?’ అని అడిగే బంధువుల కోసం ఈసారి కొంతమంది అమ్మాయిలు స్పెషల్‌ సమాధానం రెడీ చేశారు. ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 – 2026’ బ్యాచ్‌ని చూపిస్తూ, ఇది కేవలం లిస్ట్‌ కాదు, యాంబిషన్ కు ఆధార్‌ కార్డు; డ్రీమ్స్‌కు రేషన్  కార్డు; సక్సెస్‌కు అడ్రెస్‌ ప్రూఫ్‌. వయసుతో సంబంధం లేకుండా, ఫెయిల్యూర్‌కు ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపి, సక్సెస్‌తో సెల్ఫీ తీసుకున్న బ్యాచ్‌ ఇది.అందుకే ఇకపై ‘సెటిల్‌ అయ్యావా?’ అని అడిగే ముందు,‘మీరు స్కేల్‌ అప్‌ అయ్యారా?’ అంటూ మోటివేషన్  ఇస్తున్నారు. ఇలా ఎంతోమంది మహిళలకు ఆదర్శంగా నిలిచిన ఈ యంగ్‌ అచీవర్స్‌ గురించి,మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్‌ స్టోరీ. 

కలలు కనడం ఒక ఎత్తు, ‘అయ్యో, అవి నిజమవుతాయా?’ అని అనుమానం పెట్టుకోవడం మరో ఎత్తు. కాని, ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 – 2026’ జాబితాలో చోటు సంపాదించిన వాళ్లు మాత్రం కలలు కనే దశ దాటేసి, వాటికి గడువు పెట్టుకుని, నెరవేర్చుకుని, ఫ్రేమ్‌ కట్టేసిన బ్యాచ్‌. ఈ జాబితాలో వ్యాపారవేత్తలు, నిపుణులు, క్రీడాకారులు, సంగీతం, సినిమా కళాకారులు, రూపకర్తలు ఇలా రంగుల మేళవింపే కనిపించినా, వారిది ఒకే లక్షణం– అదే సాధించాలనే తపన! ప్రపంచవ్యాప్తంగా వ్యాపార, ఆర్థిక రంగాల్లో పేరొందిన ఫోర్బ్స్‌ సంస్థ.

భారత్‌లో ప్రతి ఏడాది విడుదల చేసే ఈ ప్రత్యేక జాబితా ఇప్పుడు పదమూడో సంవత్సరంలోకి అడుగుపెట్టింది. దేశమంతా ఆసక్తిగా ఎదురుచూసే ఈ జాబితాలో ఈసారి పదిహేను విభాగాల్లో యువ ప్రతిభను గుర్తించగా, అందులో నేరుగా వినియోగదారులకు ఉత్పత్తులు అందించే వ్యాపారాలు, దేశ రక్షణ, అంతరిక్ష రంగాలు, ప్రకటనలు, మార్కెటింగ్‌ వంటి కొత్త విభాగాలు చేర్చారు. ఇలా చిన్న వ్యాపారం నుంచి అంతరిక్ష ప్రయోగం దాకా ప్రతిభకు విస్తృత వేదిక సిద్ధమైంది. 

అసాధ్యాలను సాధించిన ఆణిముత్యాలు
ఈ యువ సైన్యం ‘సెటిల్‌ అవ్వడం’ అంటే కుర్చీలో కూర్చోవడం కాదు, కుర్చీని సృష్టించేవారిగా ఎదగడం అనే ఒక స్పష్టమైన సందేశం ఇచ్చింది. సుమారు వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తులను జల్లెడ పట్టి, నిపుణుల కమిటీ చర్చలు, వాదోపవాదాల తర్వాత ఎంపికైన ఈ ముప్పై మందిలో పన్నెండు మంది మహిళలు తమ ప్రతిభతో వెలుగొందగా, మిగిలిన స్థానాలను యువకులు కైవసం చేసుకున్నారు. అమ్మాయిల దూరదృష్టి, అబ్బాయిల వినూత్న ఆలోచనలు కలగలిసి కృత్రిమ మేధస్సు నుంచి వ్యవసాయ సాంకేతికత వరకు, అజ్రక్‌–కాంతా వంటి సంప్రదాయ కళల నుంచి క్రీడలు, సినిమా, రక్షణ–అంతరిక్ష రంగాల వరకు పదిహేను విభాగాల్లో సంచలనం సృష్టించాయి. 

పన్నెండు ప్రేరణ గాథలు! 
ముప్పైమంది సభ్యులతో మెరిసిన ఈ జాబితాలో, అసలైన స్పాట్‌లైట్‌ మాత్రం ఆ పన్నెండుమంది మహిళలదే! కలలకు క్యాలెండర్‌ ఉండదని, విజయానికి డెడ్‌లైన్  పెడితే చాలు సాధ్యమవుతుందని వారు నిరూపించారు. కాంతా కుట్టుతో ప్రపంచాన్ని ఆకట్టుకున్న మౌమితా బసాక్, అజ్రఖ్‌కు ఆధునిక ఊపు తెచ్చిన ముబస్సిరా ఖలిద్‌ ఖత్రి సంప్రదాయం కూడా స్టయిలిష్‌గా మెరవొచ్చని నిరూపించారు. దృశ్య కథలతో సమాజానికి కొత్త కళ్లద్దాలు పెట్టిస్తున్న ప్రియా దాలి, కళ అంటే కేవలం వినోదం కాదని గుర్తు చేశారు.

పద్దెనిమిదేళ్లకే స్టార్టప్‌ స్టీరింగ్‌ పట్టిన కాజల్‌ భేడా, చికంకారీకి ఫ్యాషన్  ఫ్రేమ్‌ ఇచ్చిన ఆకృతి రావల్, పర్యాటకానికి కొత్త అడ్రస్‌ రాసిన సిమోనా మోహన్ , మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం తీసుకొచ్చిన రమ్య ఎల్లాప్రగడ, సంరక్షణ కేంద్రాల నుంచి బయటికొచ్చిన యువతకు దిక్సూచి అయిన అనీషా శర్మ ఇలా ప్రతి పేరు ఒక కథ, ప్రతి కథ ఒక ప్రేరణ. చెస్‌బోర్డుపై చక్రం తిప్పిన దివ్యా దేశ్‌ముఖ్, విలువిద్యలో లక్ష్యాన్ని ఛేదించిన శీతల్‌ దేవి క్రీడల్లో భారత ప్రతిష్ఠను ఎగరేశారు. ముప్పైమందిలో అందరూ ప్రతిభావంతులే! కాని, ఈ మహిళలు మాత్రం ‘ముందు మేముంటాం, మిగతావాళ్లు ఫాలో అవుతారు!’ అన్నట్టు నిలిచారు.

సంక్షోభమైనా సరైన సమయమే!  కాజల్‌ భేడా
ప్రపంచం మొత్తం మాస్కులు కట్టుకుని భయంతో కూర్చున్న రోజుల్లో కాజల్‌ భేడా, ఒక కొత్త ఆలోచనకు ముసుగు తీసేసింది. ‘బ్రాండ్‌ అంటే కేవలం ప్రకటన కాదు, అది ఒక కథ’ అనే ఆలోచనే 2020లో ముంబై నేలపై ‘స్క్రిబ్బల్డ్‌’ సంస్థ స్థాపించింది. బ్రిటన్ లో మీడియా నిర్మాణంలో పొందిన శిక్షణ, నమ్మకాన్ని బలంగా చేసుకొని, సంస్థలు చెప్పాలనుకునే అసలైన సందేశం, ప్రకటన ఏజెన్సీలు అందించే సాధారణ పనుల మధ్య ఉన్న ఖాళీని భర్తీ చేయాలనే సంకల్పంతో ముందడుగు వేసింది. బయట పెట్టుబడుల కోసం తలుపులు తట్టకుండా, తన శ్రమనే మూలధనంగా మార్చి లాభాల్లో నడిచే సంస్థగా తీర్చిదిద్దింది. నేడు ఆమె నైకా, అమెజాన్, అదానీ వంటి ప్రముఖ సంస్థల కథలను కొత్త శైలిలో చెప్తోంది. ఇలా సంక్షోభం వచ్చినా, కలలకు స్టార్ట్‌ బటన్  నొక్కడానికి సరైన సమయమే అని చెప్తోంది.

భావాలే బలం, ధైర్యమే దారి: అనీత్‌ పడ్డా
చిన్నప్పటి నుంచి ఇంట్రావర్ట్‌గా మెలిగిన ఆ అమ్మాయి, ఒక రోజు అందరి చూపులు తనవైపు తిప్పుకుంటుందని ఎవరైనా ఊహించి ఉంటారా? అదే అనీత్‌ పడ్డా కథ. ‘నటనలో చేతి కదలికలకన్నా హృదయ స్పందన ముఖ్యం’ అని తల్లి చెప్పిన మాటలను గుండెల్లో దాచుకుని, నటనను సాధన చేసింది. ప్రకటన రంగంలో ప్రారంభించి, భావోద్వేగ ప్రధాన పాత్రలతో గుర్తింపు పొందింది. సామాజిక అంశాలపై అవగాహన కలిగించే కథలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత. కేవలం 23 ఏళ్ల వయసులోనే తనదైన ముద్ర వేసిన ఈ యువ నటి, తదుపరి చిత్రంలో మరో కొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమవుతోంది. భవిష్యత్తులో మరింత విభిన్న పాత్రలు, ప్రతి కథలోనూ కొత్త అనుభూతి పంచాలనే తపనతో ముందుకు సాగుతోంది.

కథలతో కట్టిపడేసే సృజనశీలి: ప్రియా దాలి
రూపకల్పన అంటే రంగులు మాత్రమే కాదు; కథనం అంటే మాటలు మాత్రమే కాదు; సమాజం అంటే జనాలు మాత్రమే కాదు అంటూ ఈ మూడింటినీ ఒకే తాడుతో కట్టి అందమైన గాలిపటంలా ఎగరేసింది  ప్రియా దాలి. వివిధ దృశ్య కథనాల ద్వారా అణగారిన వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చింది. అలాగే, వివిధ సామాజిక అంశాలపై అవగాహన కలిగించే ప్రాజెక్టులు రూపొందిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. టిండర్, గోద్రేజ్‌ గ్రూప్‌ వంటి సంస్థలతో కలిసి దీర్ఘకాలిక సహకారాల్లో భాగమైంది. పిల్లల పుస్తకాల ప్రచురణలోనూ తన ముద్ర వేసి, 2023లో ‘ఆర్‌ యూ సీరియస్‌?’ అనే సృజనాత్మక సంస్థను స్థాపించింది. ఆమె కథ చూస్తే అనిపిస్తుంది. నవ్వుతూ చెప్పిన కథ కూడా సమాజాన్ని ఆలోచింప జేయగలదని!

స్టయిల్‌కు సవాల్‌!: ఆకృతి రావల్‌
‘అమ్మా! ఈ చేతిపని చీరలు యువత కూడా కట్టుకుంటారా?’ అనే ప్రశ్నే ఆకృతి రావల్‌ కథకు ఆరంభం. 2020లో వాట్సాప్‌నే దుకాణంగా మార్చి ‘హౌస్‌ ఆఫ్‌ చికంకారీ’ని ప్రారంభించింది. లక్నో చుట్టుపక్కల కళాకారుల ఇళ్లలో మోగే సూదుల శబ్దాన్ని నేరుగా యువత అల్మరాలోకి తీసుకొచ్చింది. అసలైన చికంకారీకి తోడు కశ్మీరీ ఆరికారీ వంటి మరిన్ని చేతివృత్తులను చేర్చి, సంప్రదాయాన్నే ట్రెండ్‌గా మార్చేసింది. కళాకారులకు నెలకొక స్థిరమైన ఆదాయం కల్పిస్తూ, అసంఘటిత మార్కెట్లో ఒక క్రమశిక్షణను తీసుకొచ్చింది. ఆమె ప్రయాణం షార్క్‌ టాంగ్‌ వేదికపై మెరిసి, పలువురు పెట్టుబడిదారుల మద్దతును సంపాదించింది. అలా సంప్రదాయానికి స్టయిల్‌ అద్దిన ఈ యువ పారిశ్రామికవేత్త కథ చేతిపనికీ క్లాప్స్‌ కొట్టేలా చేస్తోంది.

కథలు నేస్తున్న కళాకారిణి: మౌమితా బసాక్‌
పశ్చిమ బెంగాల్‌ పల్లెలో పెరిగిన మౌమితా బసాక్‌ చేతిలో సూది పడితే అది కేవలం కుట్టు కాదు, ఒక కథ మొదలవుతుంది! మనం సాధారణంగా పాత బట్ట అని పక్కన పెట్టేసేదాన్ని, ఆమె ‘ఇదే నా కాన్వాస్‌’ అంటూ రంగుల కలలు నేస్తుంది. సంప్రదాయ కాంతా కుట్టును ఆధునిక భావాలతో కలిపి, చీరపై చిన్న చిన్న ముచ్చట్లు కుట్టేస్తుంది. టీ, కాఫీ రంగుల సహజ మరకలు, మిగిలిపోయిన వస్త్రాల ముక్కలు  ఇవన్నీ ఆమె చేతిలో పడితే వినూత్న డిజైన్లుగా మారతాయి.

ఆమె డిజైన్స్‌ దేశం దాటి స్పెయిన్ , బ్రిటన్ , పోలండ్‌ వరకు చేరి ప్రశంసలు అందుకున్నాయి. రాష్ట్ర, అంతర్జాతీయ వేదికల వరకు అనేక అవార్డులు, పురస్కారాలు ఆమె ఖాతాలో చేరాయి. మహిళా సాధికారత, గ్రామీణ జీవితం, అసమానతలపై తన కుట్టులోనే సందేశాలు నేస్తూ ‘సూది చిన్నదైనా, సందేశం పెద్దది!’ అని నవ్వేస్తుంది. స్థానిక మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం ఆమెకు మరో గర్వకారణం. అలా పాతబట్టలలో కూడా కొత్త ప్రపంచం దాగి ఉంటుందని నిరూపిస్తోంది.

ఇంటివద్దే సెలవుల మజా!: సిమోనా మోహన్‌ 
రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన ఇరవై ఎనిమిది ఏళ్ల సిమోనా మోహన్, ఇప్పుడు పర్యాటక రంగంలో కొత్త పంథాను చూపిస్తోంది. పర్యావరణ హిత పర్యాటకానికి ప్రాధాన్యం ఇచ్చే సంస్థను నిర్వహిస్తోందామె. అతిథులకు కేవలం వసతి మాత్రమే కాదు, స్థానిక ప్రకృతి, సంస్కృతి, ఆహారం అన్నీ కలిసిన ప్రత్యేక అనుభవాన్ని అందిస్తోంది. నీలగిరుల మధ్య మూడు పడకగదుల కాటేజీలో కేవలం మూడువేల రూపాయలకే బస చేసే సౌకర్యంతో పాటు భోజనం, స్థానిక కొనుగోళ్లు, వాహన సదుపాయాలన్నీ ఒకే ప్యాకేజీలో ఏర్పాటు చేస్తోంది. ముందుగా ఒక ప్రాంతంలో బలపడిన తర్వాతే కొత్త మార్కెట్లలో అడుగుపెట్టాలనే స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగుతోంది.

చెస్‌ వేదికపై మహారాణి: దివ్యా దేశ్‌ముఖ్‌
ఇరవై ఏళ్ల వయసులోనే చెస్‌ బోర్డుపై తన మేధస్సుతో ఆకాశాన్ని తాకేసింది దివ్య దేశ్‌ముఖ్‌!  మహారాష్ట్రకు చెందిన ఈమె, అంతర్జాతీయ గ్రాండ్‌మాస్టర్‌ హోదా సాధించిన కొద్దిమంది భారతీయ మహిళల్లో ఒకరు. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తనదైన ముద్ర వేసి, యువతలో చదరంగంపై ఆసక్తిని పెంచుతోంది. బోర్డుపై ఆమె నడిపే ప్రతి పావు ఒక వ్యూహం, ప్రతి కదలిక ఒక లెక్క, ప్రతి ఆట చివరికి చెక్‌మేట్‌ వైపు దారి తీసే తెలివైన అడుగు. ఎక్కడా తడబడకుండా, పాయింట్‌ టు పాయింట్‌గా ప్రత్యర్థిని కట్టడి చేస్తూ ముందుకు సాగే ఈ చిన్న మేధావి, ఇప్పుడు 2026 కాండిడేట్స్‌ టోర్నీపైనే ఉంది. ఆమె ఆటతీరు చూస్తే, చదరంగ బోర్డుపై రాజు, రాణి, కోట అన్నీ ఉన్నా, ఆ ఆటకు ప్రాణం పోసేది దివ్య చేతులే అనే భావన కలిగిస్తుంది.

అజ్రక్‌కి ఆడపడుచుగా!: ముబస్సిరా ఖలీద్‌ ఖత్రి
మూడు తరాలుగా ఆ ఇంట్లో మోగేది చెక్క ముద్రల శబ్దమే, కాని, ఆ ముద్రలు వేసేది మాత్రం మగవాళ్లే! ఆ సంప్రదాయానికి  చిన్న నవ్వుతో ‘ఇప్పుడు నా వంతు’ అంటూ రంగంలోకి దిగింది ముబస్సిరా ఖలీద్‌ ఖత్రి. గుజరాత్‌ కచ్‌ ప్రాంతానికి చెందిన ఈమె, అజ్రక్‌ అనే ఆ క్లిష్టమైన ముద్రణ కళలో తొలి మహిళా కళాకారిణిగా అడుగుపెట్టి అడ్డుగోడలను బద్దలుకొట్టడమే కాదు, ఆంక్షల సరిహద్దులను కూడా చెరిపేసింది! సంప్రదాయ పద్ధతికి తన స్వేచ్ఛా చిత్రణను, హస్తకళా నైపుణ్యాన్ని జోడించి, చెక్క ముద్రల మధ్యలో కొంచెం తన స్టయిల్‌ చల్లి కొత్త డిజైన్స్‌ని చూపించింది. తర్వాత వ్యాపార నైపుణ్యాలను అభ్యసించి, కళకు వ్యాపార దక్షతను కూడా జోడించింది. ‘శ్రీ గౌరవ కిలారు సన్మాన్‌’ అందుకుంది. ఆమె డిజైన్స్‌ వస్త్రాలు దేశీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్నాయి. అనంతరం ‘ఎలీషియన్ ’ అనే తన బ్రాండ్‌ ద్వారా అజ్రక్‌ కూడా ఆధునికంగా మెరిసేలా చేసింది.

మరచిపోయిన ధనం, మళ్లీ చేతిలోకి: పూజా మాలిక్, సరితా జైన్‌ 
డబ్బు పోతే బాధే కాని, ఎప్పుడో పెట్టి మరచిపోయిన డబ్బు ఒక్కసారిగా తిరిగి చేతిలో పడితే? ఆ ఆనందానికి మాటలు సరిపోవు! అదే ఆనందాన్ని అందిస్తున్న సంస్థే ‘ఈక్విట్రేసర్స్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌’. స్థాపకురాలు పూజా మాలిక్, సహస్థాపకురాలు సరితా జైన్  కలిసి ఆర్థిక రంగంలో ఓ విభిన్న మార్గాన్ని ఎంచుకున్నారు. పెట్టుబడిదారుల విద్య, రక్షణ నిధుల పరిధిలో పనిచేస్తూ, ఎప్పుడో మరచిపోయిన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, లాభాంశాలు వంటి ఆస్తులను గుర్తించి, వాటి అసలైన హక్కుదారులకు తిరిగి అందించే బాధ్యత తీసుకున్నారు.

‘ఇది ఎక్కడో ఉంది. కానీ ఎవరిది?’ అనే గందరగోళానికి ముగింపు పలుకుతూ, వారసులను గుర్తించడం నుంచి మొత్తం ప్రక్రియను పారదర్శకంగా, సులభంగా పూర్తి చేయడం వరకూ అండగా నిలుస్తున్నారు. వందకు పైగా వినియోగదారులతో, ముఖ్యంగా అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు, విదేశాల్లో నివసించే భారతీయులతో పనిచేస్తూ, 2025 ఆర్థిక సంవత్సరంలో యాభై లక్షల రూపాయల ఆదాయం సాధించారు. మరచిపోయిన సంపదకు మళ్లీ చిరునవ్వు తెప్పిస్తున్నారు ఈ ఇద్దరూ.

వైకల్యం విజయానికి అడ్డుకాదు: శీతల్‌ దేవి 
జమ్మూ కశ్మీర్‌ పర్వత గ్రామం నుంచి వచ్చిన పారా ఆర్చర్‌ శీతల్‌ దేవి కథ, అసాధ్యాన్ని సాధ్యం చేసిన సాహసగాథ. చేతులు లేకున్నా, తన పాదాలనే చేతులుగా మార్చుకొని విల్లు ఎక్కుపెట్టి బాణం సంధించే ఈ క్రీడాకారిణి, ధైర్యానికి ప్రతీకగా నిలిచింది. ఆమెలోని సహజ సమతౌల్యాన్ని గమనించిన కోచ్‌లు ఆర్చరీకి దారి చూపించారు. అలా పవర్‌ఫుల్‌గా ట్రైనింగ్‌ తీసుకొని, పదిహేడేళ్లకే భారత యువతుల్లో అతిపెద్ద ప్యారాలింపిక్‌ పతకాన్ని గెలిచి, ప్రపంచ చాంపియన్ గా  ఎదిగింది. డిసెంబర్‌లో సాధారణ దేశీయ ట్రయల్స్‌లో మూడవ స్థానం సాధించి, సాధ్యం కేవలం ఒక పదం మాత్రమే కాదు, కష్టపడి, ధైర్యంగా ముందుకు పోయినవారి ఆస్తి అని నిరూపించింది.

మెదడు ఆరోగ్యానికి, సాంకేతిక స్పర్శ: రమ్య ఎల్లాప్రగడ, లక్షయ్‌ సాహ్నీ
రమ్య ఎల్లాప్రగడ, లక్షయ్‌ సాహ్నీ కలిసి 2020లో ప్రారంభించిన ‘మార్బుల్స్‌ హెల్త్‌’ మెదడు ఆరోగ్యానికి కొత్త దారిని చూపుతోంది. న్యూరాకిల్‌ హెల్త్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ, శస్త్రచికిత్స అవసరం లేకుండా మెదడు సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడంపై దృష్టి పెట్టింది. మందులు, మానసిక చికిత్సలకు తోడ్పడే విధంగా వైద్య అనుమతి పొందిన నాడీ ఉత్తేజక వ్యవస్థలను అభివృద్ధి చేసింది. వీరి ప్రధాన ఉత్పత్తి ‘ఈజ్‌’ దేశంలోనే తొలి వైద్య అనుమతి పొందిన నాడీ ఉత్తేజక పరికరంగా గుర్తింపు పొందింది. ఇది ప్రస్తుతం ఆసుపత్రుల్లో, వైద్య పర్యవేక్షణలో, గృహ సంరక్షణలోనూ వినియోగంలో ఉంది. ప్రధానంగా మానసిక వైద్యులు, ఆసుపత్రులతో కలిసి పనిచేస్తున్న ఈ సంస్థ,‘ఆరోగ్యం అంటే శరీరానికే కాదు, మనసుకు కూడా’ అని గుర్తుచేస్తోంది.

అనాథాశ్రమం తర్వాత తోడుగా!: అనీషా శర్మ, గిరీశ్‌ మెహతా
అనాథాశ్రమంలో పెరిగి, పద్దెనిమిదేళ్లు నిండగానే బయట ప్రపంచం ముందు నిలబడ్డప్పుడు వచ్చే ఆ గందరగోళం గిరీశ్‌ మెహతా, అనీషా శర్మకు బాగా తెలుసు. ‘ఇక ఇల్లు లేదు, మార్గం ఎక్కడ?’ అన్న అనుభవమే వీరిని ఒక వేదికగా మలిచింది. అదే ‘ కేర్‌ లీవర్స్‌ ఇన్నర్‌ సర్కిల్‌ సంస్థ’. సంరక్షణ గృహాల నుంచి బయటకు వచ్చే యువతే, తమలాంటి వారికోసం నడిపే ఈ సమూహం ‘మన వాళ్లు మన కోసం’ అన్న భావనను కలిగిస్తుంది.

ఓటరు కార్డ్‌ కోసం ఏ కార్యాలయానికి వెళ్లాలి? ఆధార్‌ ఎలా పొందాలి? ప్రభుత్వ పథకాల సాయం ఎలా అందుకోవాలి? ఇలాంటి ప్రశ్నలకు వీరు సమాధానం మాత్రమే కాదు, తోడుగా కూడా నిలుస్తారు. వారి సహాయవాణికి అప్పటి మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మద్దతు తెలపడం మరింత ఉత్సాహం ఇచ్చింది. ఇప్పటి వరకు మూడువేల మందికి పైగా యువత ఈ వేదికతో అనుసంధానమై ఉండగా, ఐదువందల మందికి పైగా అవసరమైన పత్రాల సాధనలో నేరుగా సహాయం అందించారు. ఒక చిన్న తోడు కూడా జీవితాన్ని ఎంత పెద్దగా మార్చగలదో చాటి చెప్తోంది.

ఒకప్పుడు ముప్పై ఏళ్లు అంటే ‘సెటిల్‌ అయ్యే వయసు’. కాని ఈ ‘ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30’ బ్యాచ్‌ చూస్తే అర్థమవుతుంది, ముప్పై అంటే సెటిల్‌ అవ్వడం కాదు, ప్రపంచాన్ని స్కేలప్‌ చేయడం అని! కాబట్టి, కలలకు డెడ్‌లైన్  పెట్టి, కష్టానికి కమిట్‌ అవ్వండి. అప్పుడు సక్సెస్‌ మీ అడ్రస్‌ వెతుక్కుంటూ వస్తుంది!   - దీపిక కొండి  

Videos

ఫైనల్ కి ముందే బయటపడిన టీమిండియా డొల్లతనం ఫైనల్లో ఈ ముగ్గురిని తప్పించకుంటే ఓటమి పక్కా..?

సూర్య VS సాంట్నర్..రికార్డ్స్ చూస్తే..టీమిండియాకు మళ్లీ నిరాశేనా..?

ఆ పేరు చెప్తేనే వణికిపోతున్న టీం ఇండియా

10th క్లాస్ స్టూడెంట్ చేసిన పని చూడండి

లొంగిపోయేందుకు బయల్దేరిన మావోయిస్టులు

ఖమేనీ బంకర్ ధ్వంసం చేశాం ఇక మిగిలింది..!

భీకర యుద్ధం వేళ ఇరాన్ అధ్యకుడికి పుతిన్ ఫోన్

విజయ్ కు బిగ్ షాక్ బయటకు వెళ్లకూడదంటూ పిటిషన్

ఎమ్మెల్యే - ఎమ్మెల్సీ క్రీడా ఉత్సవాలపై జడ శ్రవణ్ సెటైర్లు

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఆయిల్ కోలుకోలేని దెబ్బ కొట్టిన ఇరాన్

Photos

+5

తమిళనాడు డివోషనల్ ట్రిప్‌లో తెలుగు హీరోయిన్ (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ మాలశ్రీ ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ (ఫొటోలు)

+5

రెండో శ్రీశైలంగా పిలిచే శివాలయం మన హైదరాబాద్‌లో ఎక్కడుందో తెలుసా? (ఫొటోలు)

+5

మేము సాధించాం.. పతకం వచ్చింది (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో గ్రాండ్‌గా అల్లు శిరీష్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

ఒకప్పటి హీరోయిన్ సుమలత ఫ్యామిలీ ఫొటోలు

+5

జాన్వీ కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

నయనిక పెళ్లి కూతురి వేడుక.. అల్లు ఫ్యామిలీ సందడి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖ హీరోయిన్లు (ఫొటోలు)