కొత్త కారు అని డ్యామేజ్ కారు అమ్మిన టాటా షోరూమ్ సిబ్బంది
Breaking News
యాదగిరీశుని కళ్యాణోత్సవము..!
Published on Thu, 02/26/2026 - 11:25
అభయ ప్రదాతగా... భక్తులను వెన్నంటి ఉండే ఆపద్బాంధవుడిగా యాదగిరీశుని భక్తులు కొలుస్తుంటారు. పిలిచిన వెంటనే పలికే ఆప్తుడిగా... అందరి స్వామిగా భక్త జనుల గుండెల్లో కొలువై ఉన్న యాదగిరీశుడు సౌభాగ్య ప్రదాయిని లక్ష్మీదేవితో సహా కొలువైన క్షేత్రం యాదగిరి నృసింహుడి సన్నిధి.
ఈ క్షేత్రంలో గత బుధవారం ఫిబ్రవరి 18న ఆరంభమైన శ్రీస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 28 వరకు కొనసాగనున్నాయి. ప్రధాన ఘట్టాలైన శ్రీస్వామి వారి ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం, శ్రీస్వామి వారి తిరు కల్యాణోత్సవం బుధవారం జరగగా శ్రీస్వామి దివ్య విమాన రథోత్సవం అర్చకులు నేడు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలతో యాదగిరి క్షేత్రం బ్రహ్మోత్సవ శోభను సంతరించుకోవడంతో పాటు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తోంది.
యాదగిరి లక్ష్మీనరసింహుడి రూపం ఉగ్రం. మనస్సు నవనీతం. ఘనసింహం గర్జిస్తున్నట్లు.. ముల్లోకాలను వణికించే మృగరాజు పంజా విసురుతున్నట్లు హిరణ్య కశపుడిని రక్కి, చీల్చి చండాడిన ఆ దేవుడి చేతులు ఆది మహాలక్ష్మిని మాత్రం అతి సున్నితంగా అక్కున చేర్చుకున్నాయి. సృష్టికర్త బ్రహ్మకే ఆయువు పోసిన బ్రహ్మాండ నాయకుడని పురాణాలు ఘోషిస్తున్నాయి.
పురాణాల పరంగా...
యాదగిరి ప్రశస్థికి సంబంధించి ఎన్నో ఇతిహాసాలు రామాయణ మహాకావ్యంలోనూ ప్రస్తావనలున్నాయి. మహాజ్ఞాని విభాండకుడి కుమారుడు రుష్యశృంగుడు. అతడి పుత్రుడైన యాద మహర్షి తపో శక్తితోనే యాదగిరిగుట్ట వెలసిందంటారు. యాదుడు బాల్యం నుంచి మహావిష్ణుభక్తుడు. దేవదేవుడిని తిలకించాలన్న తపన నానాటికి పెరిగింది. అందులోనూ ఉగ్రరూపుడైన నృసింహావతారం పట్ల ఎనలేని మక్కువ కలిగింది. దైవసాక్షాత్కారం కోసం దట్టమైన అడవుల్లో తిరుగుతూ కొండజాతికి చిక్కాడు. ఆటవికులు యాదుడిని క్షుద్ర దేవతలకు బలి ఇవ్వబోయారు. ఆపద సమయంలో ఆంజనేయుడు అండగా నిలిచాడు.
కీకారణ్యంలో సింహాకార గుట్టలు ఉన్నాయని, అక్కడికి వెళ్లి తపస్సు చేస్తే స్వామి సాక్షాత్కరిస్తాడని యాదుడికి ఆంజనేయుడు సూచించాడు. యాదర్షి దీర్ఘకాలిక తపస్సు ఫలించి స్తంభోద్భవుడు తొలుత జ్వాల, గండబేరుండ, యోగనంద, ఉగ్రసింహ, శ్రీలక్ష్మీ సమేతుడిగా (పంచరూపాలతో) దర్శనమివ్వడంతో ఈ క్షేత్రం పంచనారసింహ నిలయంగా పురాణాలకెక్కింది. యాద రుషి కోరిక ఫలితంగా వెలసిన ఈ క్షేత్రం యాదగిరిగుట్టగా ప్రసిద్ధి చెందింది.
రక్షణగా సుదర్శన చక్రం...
తపోముద్రలో ఉన్న మహర్షిని మింగేయాలని ప్రయత్నించిన ఒక రాక్షసుడిని మరుక్షణమే విష్ణుమూర్తి సుదర్శన చక్రం అడ్డుకుని వధించింది. ఆటంకాలు, ఆపదలు కలగకుండా గుట్ట చుట్టూ సుదర్శనం రక్షా కవచంగా నిలిచి ఉంటుందన్నది భక్తుల అపార విశ్వాసం. ప్రస్తుతం ఈ విమాన గోపురం, సుదర్శన చక్రం స్వర్ణమై భక్తులను ఆకట్టుకుంటోంది. ఇక స్వామి పుష్కరిణి సాక్షాత్తూ బ్రహ్మ కడిగిన పాదాల నుంచే పుట్టిందంటారు.
ఈ పుష్కరిణిలో పుణ్యస్నానం ఆచరిస్తే శారీరక రుగ్మతలు, గ్రహబాధల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు అంటుంటారు. ఎంతోకాలంపాటు మరుగున పడిపోయిన ఈ క్షేత్ర మహాత్యాన్ని స్థానిక గ్రామాధికారి గుర్తించారు. స్వామి కలలో కనిపించిన తన అవతార రహస్యాన్ని చెప్పాడట. హైదరాబాద్ వాస్తవ్యుడు రాజామోతీలాల్ 1920లో ఆలయాన్ని నిర్మించి పూజాదికాలు పునరుద్ధరించారని చరిత్ర చెబుతోంది. ఆయన హయాంలోనే పాంచరాత్ర ఆగమ శాస్త్ర విధానంతో పూజలు మొదలయ్యాయని స్థానికులు చెబుతారు.
బ్రహ్మోత్సవాల్లో అలంకార, వాహన సేవలు ఇవే...
శ్రీలక్ష్మీనరసింహస్వామి వారు అలంకార ప్రియుడు కావడంతో యాదగిరీశుడి క్షేత్రం అర్చకులు వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడవ రోజు నుంచి అలంకార సేవలను ప్రారంభిస్తారు. 20వ తేదీన ఉదయం మత్స్యావతార అలంకార సేవ, రాత్రి శేష వాహన సేవ, 21వ తేదీ ఉదయం వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి హంసవాహన సేవ, 22వ తేదీ ఉదయంశ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి పొన్నవాహన సేవ, 23వ తేదీ ఉదయం గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ, 24వ తేదీ ఉదయం జగన్మోహిని అలంకార సేవ, రాత్రి అశ్వవాహన సేవలో శ్రీస్వామి వారి ఎదుర్కోలు ఉత్సవం, 25వ తేదీ ఉదయం శ్రీరామ అలంకార (హనుమంత వాహన సేవ), రాత్రి గజ వాహన సేవలో శ్రీస్వామి వారు పెండ్లి కొడుకుగా కల్యాణ వేధికపై తిరు కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగాయి. నేటి ఉదయం అంటే గురువారం శ్రీమహావిష్ణు వాహనమైన గరుడ వాహన సేవతో అలంకార సేవలు ముగుస్తాయి. రాత్రి దివ్య విమాన రథోత్సవం ఉంటుంది.
చివరి రెండు రోజులు ఇలా.. ఉత్సవాల్లో చివరి రెండు రోజులు సైతం విశేష పర్వాలను చేపడతారు. 27వ తేదీన ఉదయం 10.30గంటలకు మహా పూర్ణాహుతి, చక్రతీర్థం, విష్ణు పుష్కరిణిలో అవభృదస్నానం జరిపిస్తారు. అదే రోజు రాత్రి వేళ శ్రీపుష్పయాగం, దేవతోద్వాసన, దోపు ఉత్సవాలను జరిపిస్తారు. చివరి రోజైన 28వ తేదీన ఉదయం 10 గంటలకు శ్రీస్వామి వారికి అష్టోత్తర శతఘటాభిషేకం జరిపించి, రాత్రి 9 గంటలకు శృంగార డోలో త్సవాన్ని నిర్వహించి ఉత్సవాలకు పరి సమాప్తి పలుకుతారు
Tags : 1