ఏఐ: ఆల్‌ ఉమెన్‌ ఇంటెలిజెన్స్‌ 

Published on Sat, 02/21/2026 - 05:36

‘ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌ (ఏఐ) అనేది సిలికాన్‌ వ్యాలీ వాసుల, బడా కంపెనీల వ్యవహారం’ అన్నట్లుగా ఉండేది ఒకప్పటి పరిస్థితి. కాలం మారింది. మారుమూల పల్లెలోని పార్వతమ్మకు కూడా ఇప్పుడు ‘ఏ.ఐ.’పై ఆసక్తి పెరిగింది. స్వయం సహాయక బృందాల నుంచి వ్యాపారాన్ని లాభాల బాటలోకి తీసుకువెళ్లాలనుకునే చిన్న స్థాయి మహిళా వ్యాపారుల వరకు ఏ.ఐ. సాంకేతికతపై ఆసక్తి చూపుతున్నారు. ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ –2026’ అనేది సాంకేతిక దిగ్గజాల సదస్సు మాత్రమే కాదు, సామాన్య మహిళలు సైతం ఆసక్తి చూపే సదస్సు అయింది...

వివిధ రంగాలలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఎలాంటి మార్పులు తేనున్నది ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ హైలెట్‌ చేసింది. అట్టడుగు స్థాయిలో మహిళా సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ విషయంలో భాష, మార్కెట్‌ యాక్సెస్, పరిమిత వనరులలాంటి అడ్డంకులను అధిగమించడంలో గ్రామీణ మహిళలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగపడుతోంది.

బహుళ ప్రయోజన శిక్షణ
‘షీ లీడ్స్‌ భారత్‌’లాంటి ఏఐ ఇన్నోవేటివ్‌ ప్లాట్‌ఫామ్‌లు గ్రామీణ ప్రాంతాలలోని చిరు మహిళా వ్యాపారులు ఆదాయాన్ని మరింత పెంచుకోవడానికి సంబంధించి మెరుగైన శిక్షణ ఇస్తున్నాయి.  మైక్రోసాఫ్ట్‌ భాగసామ్యంతో 25,000 మంది మహిళా వ్యాపారవేత్తలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ ఇస్తోంది షీ లీడ్స్‌. ఎలాంటి వస్తువులకు అధిక డిమాండ్‌ ఉందో గుర్తించడం నుంచి వాటికి సరిౖయెన ధరలను నిర్ణయించడం, కస్టమర్‌ల సంఖ్యను ఎలా పెంచుకోవాలి, కీలకమైన వ్యాపార సవాళ్లను ఎలా అధిగమించాలి... మొదలైన విషయాలను తెలుసుకోవడానికి, ‘మేరీ సహేలి’ యాప్‌లో విలీనం చేసిన ఏఐ సాధనాలను ఉపయోగించుకోవడానికి తద్వారా మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ‘మహిళల నేతృత్వంలోని గ్రామీణ సంస్థలను బలోపేతం చేయడానికి, ఏఐకి సంబంధించిన బాధ్యతాయుతమైన, ఆచరణాత్మక ఉపయోగాల అవగాహనకు ఈ శిక్షణ ఉపయోగపడుతుంది’ అంటుంది షీ లీడ్స్‌ భారత్‌.

గల్లీ నుంచి దిల్లీ వరకు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి జిల్లా నవహానిపూర్‌ గ్రామానికి చెందిన రుచిసింగ్‌ స్వయం సహాయక బృందంలో సభ్యురాలు. స్మార్ట్‌ఫోన్‌ ల నుంచి ఏఐ–ఎనేబుల్డ్‌ ఫ్లాట్‌ఫామ్‌ల వినియోగం వరకు ఎంతోమంది మహిళలకు రోల్‌ మోడల్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా రుచిసింగ్‌లాంటి మహిళలకు దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులోని విశేషాలు ఆసక్తికరంగా మారాయి. ‘ఏఐ సమ్మిట్‌’లో తమకు ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునే ప్రయత్నాలు చేశారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సమ్మిట్‌–ఆమెదిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌ –2026లో వివిధ రంగాలకు చెందిన మహిళలు వివిధ అంశాలపై తమ గళాన్ని వినిపించారు. ఈ సదస్సులో ‘ఏఐ కాలంలో మహిళలకు ఎదురవుతున్న భద్రతా సమస్యలు–డిజిటల్‌ ప్రపంచంలో అసమానతలు’... మొదలైన వాటి గురించి నటి, రచయిత్రి సోహ అలీఖాన్‌ ప్రసంగించారు. ఏఐ టూల్స్‌  విస్తృతస్థాయి ఉపయోగాలతో పాటు దుర్వినియోగాన్ని కూడా ఆమె ప్రస్తావించారు.

‘ఏఐ సాంకేతికత వల్ల ఫేక్‌ ఇమేజ్‌లను సృష్టించడం నుంచి డాటా దుర్వినియోగం వరకు హానికరమైన పనులు అత్యంత వేగంగా జరుతున్నాయి’ అని ఏఐలోని ప్రతికూలతల గురించి ప్రస్తావించారు సోహ అలీఖాన్‌. ‘ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌పై భయాలు, అపోహలు ఉన్నాయి. అవి నిజం కాదు’ అంటూ వైద్య రంగానికి ఏఐ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అనుప్రియ పటేల్‌.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌... అనివార్యం
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది వైద్యుల అవసరాన్ని లేకుండా చేసేది కాదు. వైద్యుల భారాన్ని తగ్గించేది. ఏఐ సాంకేతికతపై రకరకాల భయాలు, అపోహలు ఉన్నాయి. అయితే ఇది నిజం కాదు. వైద్య సమాజానికి ఏఐ సాంకేతికత అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. నిపుణులు కాని వారు ఏఐ నుండి ఎంతో నేర్చుకోవచ్చు. ఉన్నతస్థాయికి చేరుకోవచ్చు. మన దేశంలోని విస్తారమైన జనాభా, ప్రాంతాల మధ్య వైవిధ్యాలు, వైరు«ధ్యాలు, గ్రామీణ–పట్టణ విభజన, సవాళ్లు విసురుతున్న అంటువ్యాధులు... ఈ నేపథ్యంలో సాంకేతికత, ముఖ్యంగా ఆర్టిఫిషియల్‌  ఇంటెలిజెన్స్‌ అనివార్యమైన సహాయకారిగా మారుతోంది. రోగ నిర్ధారణ నుంచి చికిత్స వరకు ఆరోగ్య సంరక్షణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది.        
– అనుప్రియ పటేల్, కేంద్రమంత్రి

పవర్‌ హిట్టర్‌
ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అనేది సాంకేతికతను మాత్రమే కాదు వ్యూహాలు, నాయకత్వం, నిర్ణయాలకు సంబంధించిన అంశాలను కూడా పునర్నిర్వచిస్తోంది. ఏఐ అనేది టీ 20 క్రికెట్‌లో ‘పవర్‌ హిట్టర్‌’లాంటిది. టీ 20 మ్యాచ్‌లో ఇషాన్‌ కిషన్‌ 40 బంతుల్లో 77 పరుగులు చేసిన ఇన్నింగ్స్‌ను చూశారు. ఇలాంటి పవర్‌ హిట్టరే ఏఐ. సంస్థలు పనిచేసే విధానాన్ని పునర్నిర్వచించే సామర్థ్యం ఏఐకి ఉంది. ఏఐ వల్ల అభివృద్ధి చెందడం మాత్రమే కాదు కొత్త శక్తితో, కొత్త దారులలో సంస్థలు పయనిస్తాయి. వ్యాపార నమూనాలు మారుతాయి. వ్యక్తులు గతంలో కంటే ఎక్కువ నైపుణ్యంతో పనిచేస్తారు. ఏఐ సాంకేతికత ఎంత వేగంగా విస్తరిస్తుంది అనేది ముఖ్యం కాదు ఎంత బాధ్యతతో ఉందనేది ముఖ్యం. బాధ్యతాయుతమైన ఏఐ అనివార్యం.
– రోహిణి నాడర్‌ మల్హోత్రా, చైర్‌పర్సన్, హెచ్‌సీఎల్‌

ఏఐ... ఎన్నో ద్వారాలు!
లక్షలాది మంది భారతీయ మహిళలు వినడానికి, నేర్చుకోవడానికి, పని చేయడానికి టెక్నాలజీ ఎన్నో అవకాశాలను కల్పిస్తోంది. ఆ అవకాశాలను వినియోగించుకోవాలంటే ఆన్‌లైన్‌ సురక్షితమని మహిళలు భావించాలి. ఏఐతో దేశవ్యాప్తంగా మార్పులు వస్తున్నాయి. యువతులు ఆన్‌లైన్‌లో వ్యాపారాలు చేస్తున్నారు. బాలికలు వీరి విజయగాథల నుంచి స్ఫూర్తి పొందుతున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు సృజనాత్మకతకు సంబంధించి కూడా మహిళలకు ఏఐ ప్లాట్‌ఫామ్‌లు ఎన్నో ద్వారాలు తెరుస్తున్నాయి. మహిళా సాధికారతకు ఆన్‌లైన్‌ టూల్స్‌ కొత్త దారులు చూపుతున్నాయి. ఇప్పుడు ఎటు చూసినా ఏఐ అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే సమాజంలో ఉండే అసమానతలు డిజిటల్‌ ప్రపంచంలో ప్రతిఫలిస్తున్నాయి. డిజిటల్‌ ప్రపంచంలో స్త్రీ, పురుషులకు సమాన అవకాశాలు ఉండాలి.
– సోహా అలీఖాన్, నటి, రచయిత్రి

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)