బడ్జెట్ లో నిరుద్యోగులకు టోకరా.. బాబుపై 420 కేసు!?
Breaking News
‘సీతా పయనం’ మూవీ రివ్యూ
Published on Sat, 02/14/2026 - 14:57
యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా నటించిన తొలి సినిమా ‘సీతా పయనం’. ముందుగా ఈ చిత్రంలో హీరోగా విశ్వక్ సేన్ అనుకున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాల్లో కూడా విశ్వక్ పాల్గొన్నాడు. కానీ షూటింగ్‌కి కొద్ది రోజుల ముందు ఆయన ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు. దీంతొ విశ్వక్ ప్లేస్‌లో కన్నడ స్టార్ ఉపేంద్ర సోదరుడి కొడుకు నిరంజన్‌ని హీరోగా పెట్టి ఈ సినిమా తెరకెక్కించాడు అర్జున్. కూతురు డెబ్యూ ఫిల్మ్ అవ్వడంతో ప్రమోషన్స్ భారీగా చేశాడు.మొత్తానికి రిలీజ్‌కి ముందే సీతా పయనంపై హైప్ అయితే క్రియేట్ అయ్యేలా చేశారు. మంచి అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
వైజాగ్‌కు చెందిన వ్యాపారవేత్త రాజేంద్ర ప్రసాద్(సత్య రాజ్)కి కూతురు సీత(ఐశ్వర్య అర్జున్) అంటే ప్రాణం. తల్లి లేకపోవడంతో అల్లారు ముద్దుగా పెంచుతాడు. కూతురికి పెళ్లి చేస్తే తన బాధ్యత తీరుతుందని భావిస్తాడు. కానీ సీతకు మాత్రం పెళ్లి అంటే నచ్చదు. పెళ్లి టాపిక్ తీసిన ప్రతిసారి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది. ఓ రోజు వర్క్ షాప్ కోసం వైజాగ్ నుంచి తన కారులో హైదరాబాద్‌కి బయలు దేరుతుంది. మార్గ మధ్యలో అభి(నిరంజన్) పరిచయం అవుతాడు. తనతో కలిసి చేసే ప్రయాణంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటాయి. అవేంటి? ఆ సంఘటనల వల్ల సీతలో వచ్చిన మార్పు ఏంటి? సీత ప్రయాణంలో గిరి(అర్జున్), బసవన్న(ధృవ్ సర్జా) ఎలా భాగమయ్యారు? పెళ్లే వద్దనుకున్న సీత..చివరకు అభితో ప్రేమలో ఎలా పడింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సీతా పయనం కొత్త కథేమీ కాదు. మనం ఇంత వరకు ఎన్నో సార్లు, ఎన్నో సినిమాల్లో చూసిన విషయాలతోనే అర్జున్ ఈ మూవీని తెరకెక్కించాడు. ప్రస్తుత తరం మరిచిపోతోన్న విలువల్నిఈ కథ ద్వారా మరోసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. మన హైందర ధర్మంలో పెళ్లికి ఉన్న గొప్పదనం చర్చిస్తూనే.. . తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలి.. పిల్లల్ని ఎలా పెంచాలి, ఎంత సంస్కారంతో పెద్ద చేయాలి.. పిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలి అనే విషయాలను గొప్పగా చూపించారు. వీటితో పాటు గో రక్షణ గురించి ఓ ఎపిసోడ్‌ని యాడ్ చేశారు. ఈ సినిమాలో ఉన్న మరో గొప్పదనం ఏంటంటే.. ఇందులో అందరూ మంచి వాళ్లే. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఒకటి, రెండు పాత్రలు కూడా ఒక్క సీన్‌తో మంచి వాళ్లు అయిపోతాయి. ఇదంతా చెప్పుకోవాడానికి బాగానే ఉన్నా.. తెరపై చూస్తుంటే మాత్రం అంత రక్తి కట్టించదు. ఎలాంటి మలుపులు, ట్విస్టులు లేకుండా ‘సీతా పయనం’ చాలా సాఫీగా సా..గుతుంది. ఇచ్చిన సందేశం మంచిదే కానీ.. కూర్చొబెట్టి హితబోధ చేసినట్లుగా అనిపిస్తుంది.
తండ్రి కూతురు బాండింగ్‌ని చూపిస్తూ కథ ప్రారంభించాడు దర్శకుడు. కూతురుకి పెళ్లి చేయాలని తండ్రి.. పెళ్లి టాపిక్ వస్తేనే ఏదో ఒకటి చెప్పి డైవర్ట్ చేసే కూతురు..మొదటి పది నిమిషాల కథంతా ఇలానే రొటీన్‌గా ఉంటుంది. ఇక సీత వర్క్ షాప్ కోసం హైదరాబాద్‌కి బయలుదేరినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. మార్గ మధ్యలో అభి పరిచయం అవ్వడం.. గిరి పాత్ర ఎంట్రీ.. ఆ తర్వాత కొన్ని సంఘటనలు ఇవన్నీ మొదట రొటీన్‌గానే అనిపించినా.. ఇంటర్వెల్ తర్వాత ఆయా సన్నివేశాల వెనుక ఉన్న అసలు విషయం తెలుస్తుంది. ఫస్టాఫ్ మొత్తం వైజాగ్ నుంచి హైదరాబాద్‌కి సీత ప్రయాణం ఉంటే.. సెకండాఫ్ రిటర్న్ జర్నీ ఉంటుంది. ధృవ్ సర్జా ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది. ఇక ప్రీ క్లైమాక్స్ , క్లైమాక్స్ భావోద్వేగానికి గురి చేస్తుంది. కొత్తదనం ఆశించకుండా, ఫ్యామిలీతో కలిసి ఓపికతో ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకునేవారిని ‘సీతా పయనం’ ఎంటర్‌టైన్ చేస్తుంది.
ఎవరెలా చేశారంటే..
సీత పాత్రలో ఐశ్వర్య ఒదిగిపోయింది. ఆమె ఆహార్యం, హావభావాలు, మాట తీరు అన్నీ కూడా ఆడియెన్స్‌ని ప్రేమలో పడేస్తాయి. ఆమెని చూస్తే ఇంట్లోని అమ్మాయిలా అనిపిస్తుంది. అయితే డబ్బింగ్ విషయం ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేదేమో. ఇక అభి పాత్రకు నిరంజన్ న్యాయం చేశాడు. ఆయన పాత్ర ఇచ్చే ఓ చిన్న ట్విస్ట్ సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్లని కూడా బాగానే చేశాడు. ఇక హీరోయిన్ తండ్రిగా సత్యరాజ్ రెగ్యులర్ పాత్రను చేశాడు. హీరో తాతా, ఊరి పెద్దగా ప్రకాశ్ రాజ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అయితే ఇలాంటి పాత్ర ఆయన కొత్తేమి కాదు. బిత్తిరి సత్తి రెండు, మూడు చోట్ల కనిపించి, నవ్విస్తాడు. అర్జున్ సర్జా ఎంట్రీ ఆకట్టుకుంటుంది. ధృవ్ సర్జా బ్లాక్, అక్కడ చెప్పిన సందేశం చాలా మందికి కనెక్ట్ అవుతుంది. మిగిలిన పాత్రధారులందరూ కూడా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ నుంచి మంచి పాటల్ని, బీజీఎంని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్, సెట్ వర్క్ బాగానే కుదిరింది. కూతురు కోసం నిర్మాతగా మారిన అర్జున్.. ఈ సినిమాకు బాగానే ఖర్చు చేశాడు. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి.
- రేటింగ్ : 2.75/5
Tags : 1