Breaking News

కూ.. చుక్‌చుక్‌! ష్‌.. గప్‌చుప్‌

Published on Mon, 02/02/2026 - 07:37

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ తీపి చేదులను తలపించింది. గ్రేటర్‌ నగరానికి కొంత మోదం.. కాసింత ఖేదం అనే పరిస్థితిని ప్రతిబింబించింది. జీహెచ్‌ఎంసీ గతంలో కోరిన రూ.10,500 కోట్లతో పాటు కొత్తగా ఆశించిన రూ.719 కోట్లకు అతీగతీ లేకుండాపోయింది. మెట్రో రెండో దశకు మొండిచేయి చూపించింది. కేంద్ర బడ్జెట్‌లో దీని ప్రస్తావనే లేకుండాపోయింది. రహదారుల విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు కేటాయించకపోవడంతో నగర వాసిని నిరాశకు గురి చేసింది. ఈ నేపథ్యంలో వీధి వ్యాపారులకు రుణాలు అందజేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. దీంతో నగర వీధి వ్యాపారులకు ఊరటనిచ్చింది. అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ ద్వారా మూడు కార్పొరేషన్లుగా మారనున్న గ్రేటర్‌కు ప్రయోజనం కలగనుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు హైస్పీడ్‌ కారిడార్‌లు అందుబాటులోకి రానున్నాయి. జలమండలి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక భరోసా లభించింది. బ్యాటరీల ధరలు తగ్గనుండటంతో గ్రేటర్‌లో ఈవీల విక్రయాలు భారీగా పెరగనున్నట్లు అంచనా. క్యాన్సర్, మధుమేహం తదితర దీర్ఘకాలిక రోగులకు సంబంధించి 17 రకాల ఔషధాల ధరలు తగ్గనుండటంతో నగరంలోని సుమారు 30 లక్షల బాధితులకు మేలు ఒనగూరనుంది. 

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, పుణె, చెన్నై నగరాలకు హైస్పీడ్‌ కారిడార్‌లు అందుబాటులోకి రానున్నాయి. రైళ్ల వేగం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి చెన్నైకి  ప్రయాణం సమయం 12 గంటలకు పైగా ఉంది. ప్రస్తుతం చార్మినార్‌ ఎక్స్‌ప్రెస్‌ సాయంత్రం  6 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరితే చెన్నైకి మరుసటి రోజు ఉదయం 6.40 గంటలకు చేరుకుంటుంది. హైదరాబాద్‌– బెంగళూర్, హైదరాబాద్‌– పుణె నగరాల మధ్య ప్రయాణ సమయం 8 గంటలకు పైగా ఉంది. ఈ మూడు రూట్లలో హైస్పీడ్‌ కారిడార్‌లను నిర్మిస్తే ప్రయాణ సమయం సగానికి తగ్గే అవకాశం ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.  

బ్యాటరీల ధరలు తగ్గనున్న నేపథ్యంలో గ్రేటర్‌లో ఈవీల విక్రయాలు మరింత పెరగనున్నాయి. ఇప్పటికే నగరంలో 2.5 లక్షలకుపైగా అన్ని రకాల ఈవీలు టాప్‌గేర్‌లో పరుగులు తీస్తున్నాయి. తాజాగా  బ్యాటరీల ధరలు తగ్గితే వీటి అమ్మకాలు ఊపందుకోనున్నాయి. సాధారణంగా ఈవీలను కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉన్నప్పటికీ బ్యాటరీల ధరలు, అరకొర విద్యుత్‌ చార్జింగ్‌ సదుపాయంతో వెనుకడుగు వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాటరీ ధరల తగ్గింపు కొంత మేరకు ప్రోత్సాహకంగా ఉంటుంది. బైక్‌లపై గరిష్టంగా రూ.10 వేలు, కార్లు, ఇతర వాహనాలపై రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ధరలు తగ్గే అవకాశాలున్నాయి. నగరంలో ప్రస్తుతం 2.05 లక్షల ద్విచక్ర వాహనాలు, మరో 45 వేలకు పైగా కార్లు, ఆటోలు, కమర్షియల్‌ వాహనాలున్నట్లు అంచనా. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనున్నాయి.  

మెట్రోకు మొండిచేయి.. జీహెచ్‌ఎంసీకి నిరాశ
హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు కేంద్రం మొండి చేయి చూపించింది. కేంద్ర బడ్జెట్‌లో దీని ప్రస్తావనే లేకుండాపోయింది. రహదారుల విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు  నిధులను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఎలాంటి నిధుల కేటాయింపులు జరగలేదు. రెండో దశలో చేపట్టనున్న 76.4 కి.మీ మొదటి 5 లేన్‌ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు వ్యయం కానున్నట్లు అంచనా. ‘బి’ విభాగం కింద మూడు మార్గాల్లో నిర్మించనున్న 86.1 కి.మీ.కారిడార్‌లకు మరో రూ.19,759 కోట్లతో అంచనాలను రూపొందించారు. ఇప్పటికే  చెన్నై, పుణె, ఢిల్లీ నగరాల్లో మెట్రో విస్తరణకు కేంద్రం సముచితమైన ప్రోత్సాహాన్ని, తన వాటా నిధులను అందజేస్తోంది. హైదరాబాద్‌ మెట్రోపై ఎందుకో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మరోవైపు హెచ్‌ఎండీఏ పరిధిలోని 10,050 చ.కి.మీ.పరిధిలో రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.4,5000 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలకూ కేంద్రం స్పందించలేదు.  కేంద్ర బడ్జెట్‌లో జీహెచ్‌ఎంసీ ఆశ నెరవేరలేదు. గతంలో కోరిన రూ.10,500 కోట్లు.. కొత్తగా ఆశించిన రూ.719 కోట్ల అంశం బడ్జెట్‌ కాపీలో కనిపించలేదు. ఆర్థిక సంఘం నిధులు, గృహనిర్మాణాల కింద అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

జలమండలికి భరోసా
కేంద్ర బడ్జెట్‌లో నీటి సరఫరా, పారిశుద్ధ్య వ్యవస్థల బలోపేతానికి పెద్దపీట వేయడంతో హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ సప్లై అండ్‌  సీవరేజీ  బోర్డు (జలమండలి) ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు ఆర్థిక భరోసా లభించింది. జల్‌ జీవన్‌ మిషన్‌ పొడిగింపుతో పాటు అమృత్‌ 2.0, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ వంటి పథకాలకు భారీగా నిధులు కేటాయించడం జలమండలికి ఊరటనిచ్చే అంశం. ప్రధానంగా తాగునీరు, పారిశుద్ధ్య రంగాల కోసం కేంద్రం ప్రకటించిన కొత్త నిధి, నగర మౌలిక సదుపాయాల అభివృద్ధికి కీలకమైన ‘ఆర్థిక ఊతం’గా మారనుంది. అమృత్‌ 2.0 పథకం కింద నగరంలో కొత్తగా చేపట్టే మురుగునీటి శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) నిర్మాణానికి నిధులు అందనున్నాయి. స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (అర్బన్‌) ద్వారా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న ఎస్టీపీలకు కూడా కేంద్రం చేయూత లభించనుంది. మరోవైపు, వర్షాకాలంలో నగరాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు ప్రతిపాదించిన ‘సమీకృత స్ట్రామ్‌ వాటర్‌ డ్రైనేజీ ప్రాజెక్టు’కు సైతం ఈ నిధుల నుంచి వాటా దక్కే అవకాశం ఉంది. అలాగే ‘అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌’ జలమండలికి వరంగా మారనుంది. నగరంలో తాగునీటి నెట్‌వర్క్‌ విస్తరణ, పారిశుద్ధ్య వ్యవస్థల ఆధునికీకరణ పనులు వేగవంతం కానున్నాయి.

వీధి వ్యాపారుల్లో ఆశ 
పీఎం స్వనిధి స్కీం పొడిగింపు ద్వారా గ్రేటర్‌లోని వీధి వ్యాపారులకు తొలి విడత రూ.15వేలు, రెండో విడత రూ.25 వేలు, మూడో విడత రూ.50వేలు రుణాలిస్తారు. నిరీ్ణత వ్యవధిలో చెల్లించే వారికి సబ్సిడీ ఉంటుంది. సకాలంలో రెండో విడత చెల్లించిన వారికి రూ. 30వేల పరిమితి వరకు క్రెడిట్‌ కారులిస్తారు. వడ్డీ లేకుండా అత్యవసరంలో ఉపయోగపడుతుంది. రూ.లక్ష కోట్ల అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌  ద్వారా మూడు కార్పొరేషన్లుగా మారనున్న గ్రేటర్‌కు ప్రయోజనం కలిగేందుకు అవకాశం ఉంది.  

తగ్గనున్న ఔషధ ధరలు.. 30 లక్షల మందికి మేలు
క్యాన్సర్, మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగులు వినియోగించే 17 రకాల ఔషధాల ధరలు తగ్గనున్నాయి. ఫలితంగా నగరంలో సుమారు 30 లక్షల బాధితులకు మేలు ఒనగూరనుంది. నగరంలో 1.5 కోట్ల జనాభా ఉండగా.. ఇందులో సుమారు 21 శాతం మంది మధుమేహులున్నట్లు అంచనా. నగరంలోని ప్రముఖ కేన్సర్‌ ఆసుపత్రి ఎంఎన్‌జేకు ఏటా పది వేల మంది కొత్త రోగులు వస్తున్నారు. అదే సమయంలో ఏటా మరో 1.10 లక్షల మందికి ఫాలోఅప్‌ చికిత్సలు అందుతున్నాయి. ఇతర ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్సలు తీసుకుంటున్న వారు ఈ సంఖ్యకు అదనం. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తోంది. చికిత్సల అనంతరం రెగ్యులర్‌ ఫాలోఅప్‌లో భాగంగా నెలకు రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ, బీమా వంటివి ఉంటే ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుత కేంద్ర బడ్జెట్‌లో ఔషధ ధరలు తగ్గించడం వల్ల రోగులకు ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగే అవకాశముంది.  

ఎంతో ప్రోత్సాహకరం
బ్యాటరీల ధరలు తగ్గడం వల్ల  ఆటోమేటిక్‌గా ఈవీల ధరలు కూడా తగ్గుతాయి. దీంతో అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం  విద్యుత్‌ బైక్‌ల వినియోగంలో హైదరాబాద్‌ టాప్‌లో ఉంది. రానున్న రోజుల్లో ఈవీల వినియోగం ఇంకా పెరుగుతుంది. ఇందుకనుగుణంగా రాష్ట్రప్రభుత్వం విద్యుత్‌ చార్జింగ్‌ సదుపాయాన్ని పెంచాల్సిన అవసరముంది.   
– సంధ్య, ఈవీ డీలర్‌ 

Videos

మొన్న రాజాసాబ్ నిర్మాత.. ఇప్పుడు డైరెక్టర్ మారుతి! అండగా ప్రభాస్..

కొయ్యలగూడెంలో టెన్షన్ టెన్షన్ పురుగుల మందు తాగి చస్తాం.. రైతుల వార్నింగ్

2029లో వచ్చేది జగనే... ఊహించని దెబ్బ ఖాయం!

Bhatti Vikramarka: బడ్జెట్ ఇలా ఊహించలేదు

Mounika : పీకే గారూ.. ఇదేనా మీరన్న మహిళల భద్రత..?

Botsa: అంబటి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు మొదట బూతులు తిట్టింది వాళ్లే

Jogi Ramesh: నన్ను చంపాలనే ప్లాన్‌

Botsa : రాష్ట్రంలో హింసాకాండ జరుగుతుంటే జనసేన, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు?

Botsa: రాష్ట్రాన్ని రావణకాష్టం చేయాలనుకుంటున్నారా చంద్రబాబూ?

టీడీ శాట్ లేవనెత్తిన అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తుందని వెల్లడి

Photos

+5

దుబాయిలో అల్లు శిరీష్ బ్యాచిలరేట్ పార్టీ (ఫొటోలు)

+5

‘ఫంకీ’ మూవీ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్‌ కయాదు లోహర్‌ (ఫొటోలు)

+5

అనంతపురం : సినీతారల క్రికెట్‌ మ్యాచ్‌..శ్రీకాంత్, తరుణ్‌ సందడి (ఫొటోలు)

+5

‘బరాబర్‌ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

మై సౌత్‌ దివా 9వ ఎడిషన్‌ క్యాలెండర్‌ లాంచ్ లో మెరిసిన అందాల భామలు (ఫొటోలు)

+5

అందాల సినీతార ఉల్కా గుప్తా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌.. ఫుల్‌ రష్‌ (ఫొటోలు)

+5

జనవరి ఇలా గడిచింది.. రుక్మిణి వసంత్ పోస్ట్ (ఫొటోలు)

+5

పూల చీరలో అనుపమ పరమేశ్వరన్ హొయలు (ఫొటోలు)

+5

తమన్నా కొత్త బిజినెస్ లాంచ్.. హీరోయిన్ల సందడి (ఫొటోలు)