ప్రశ్నిస్తే ఇళ్లు తగలబెడతారా.. ఈ నిప్పే మీ ప్రభుత్వాన్ని దహిస్తుంది
Breaking News
బడ్జెట్ 2026: విదేశాలకు వెళ్లేవారికి ఊరట
Published on Sun, 02/01/2026 - 13:18
మధ్యతరగతి వేతన జీవుల విదేశీ ప్రయాణాలకు, అంతర్జాతీయ విద్యను అభ్యసించాలనుకునే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఊతం ఇచ్చింది. గతంలో ఈ విభాగంలో భారంగా మారిన 5 శాతం టీసీఎస్‌ను 2 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వేతన జీవుల నెలవారీ బడ్జెట్‌పై పడే అదనపు భారం తగ్గడమే కాకుండా చేతిలో నగదు లభ్యత పెరుగుతుంది. ఈ మార్పు వేతన జీవుల జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం.
టీసీఎస్ అంటే ఏమిటి?
సాధారణంగా మనం విదేశీ పర్యటనల కోసం ప్యాకేజీలు కొన్నప్పుడు లేదా విదేశాలకు డబ్బు పంపినప్పుడు బ్యాంకులు లేదా ట్రావెల్ ఏజెంట్లు కొంత మొత్తాన్ని పన్ను రూపంలో ముందే వసూలు చేస్తారు. దీనినే టీసీఎస్ అంటారు. ఇది మన ఆదాయపు పన్నులో ముందుగానే చెల్లించాలి.
వేతన జీవులపై ప్రభావం
గతంలో 5 శాతం టీసీఎస్.. అంటే ఎక్కువ సొమ్ము ప్రభుత్వం వద్ద ఉండిపోయేది. ఇప్పుడు అది 2 శాతానికి తగ్గడం వల్ల ఆ మిగిలిన 3 శాతం నగదు పన్ను దారులకు మిగులుతుంది. విదేశీ విద్య కోసం లోన్ తీసుకోకుండా సొంతంగా డబ్బు పంపే తల్లిదండ్రులకు ఇది పెద్ద ఊరట. విదేశీ టూర్ ప్యాకేజీలు బుక్ చేసుకునేటప్పుడు ముందస్తుగా చెల్లించాల్సిన నగదు తగ్గుతుంది.
ఉదాహరణకు..
ఒక వేతన జీవి తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లాలనుకున్నారనుకుందాం. ఆ టూర్ ప్యాకేజీ ధర రూ.10 లక్షలు అనుకుంటే, పాత, కొత్త రేట్ల ప్రకారం తేడా ఇలా ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం, ఈ ప్యాకేజీ ధరపై 5 శాతం టీసీఎస్ వర్తించేది. అంటే ఆ వ్యక్తి ప్యాకేజీ ధరతో పాటు అదనంగా రూ.50,000 పన్ను రూపంలో ముందే చెల్లించాల్సి వచ్చేది.
అయితే, కొత్త బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం ఈ టీసీఎస్ రేటును 2 శాతానికి తగ్గించారు. దీనివల్ల అదే రూ.10 లక్షల ప్యాకేజీపై ఇప్పుడు కేవలం రూ.20,000 మాత్రమే పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. ఫలితంగా సదరు ప్రయాణికుడికి తక్షణమే రూ.30,000 వరకు ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది.
Tags : 1