తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్
Breaking News
ఎవడ్రా వీడు..మరి ఇంత టాలెంటెడా..?! .
Published on Mon, 12/29/2025 - 11:38
శరీరంలో ఏ అయవం కదలదు అంటే..ఎవ్వరైనా చతికిలపడిపోతారు. జీవితమే లేదు అన్నంతగా బాధపడిపోతారు. కానీ అతడి శరీరంలో ఏ చిన్న అవయవం కదిలిన చాలు..అద్భుతం చేయొచ్చు అనుకున్నాడు. ఆ దృఢ సంకల్పమే జస్ట్ ఒకేఒక చేతి వేలు, కాలి బొటనవేలుతో అద్భుతమే సృష్టించి తన కుటుంబానికి ఆసరాగానే కాదు..టెక్నాలజీ తెలియని అమ్మను అన్ని నేర్చుకునేలా చేసి ముందుండి నడుపించిన గొప్ప కొడుకు అతడు. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్న ఇలాంటి కొడుకు ఒక్కడుంటే చాలు సంపదతో పనిలేదు అని చెప్పే ప్రేరణాత్మక స్టోరీ..!.
36 ఏళ్ల లి జియా, నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్‌కు చెందిన వ్యక్తి. అతను కేవలం ఐదేళ్ల ప్రాయంలో కండరాల బలహీనత ఉన్నట్లు నిర్థారణ అయ్యింది. అనారోగ్యం కారణంగా ఐదోతరగతితోటే పాఠశాల చదువుకి స్వస్తి పలకాల్సి వచ్చింది. అయితే చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చినా..చదవడం, రాయడం మాత్రం లీ కొనసాగించడం విశేషం. స్వీయంగా చదువుకోవడం ప్రారంభించాడు. అతనికి కంప్యూటర్ సైన్స్, భౌతిక శాస్త్రం అంటే మహా ఇష్టం.
కంప్యూటర్ని తనకు పరిచయం చేసిన వ్యక్తి అతడి చెల్లెలు. పాఠశాల నుంచి తెచ్చే పుస్తకం ద్వారా కంప్యూటర్‌పై మక్కువ ఏర్పడటం మొదలైంది. పుస్తకంలో ప్రతి అధ్యయం అతడికి ఆకర్షణీయంగా కనిపించేది. ప్రతి కొత్త విద్యాసంవత్సరంలో ఏ కొత్త కంప్యూటర్ పుస్తకం విడుదలవుతుందో అని ఆసక్తిగా ఎదురుచూసేవాడు. అంత ఇష్టం కంప్యూటర్ అంటే. వాటిని పదేపదే క్షణ్ణంగా చదివేవాడు.
ఆన్లైన్ ఫ్లాట్‌ఫామ్‌ల సాయంతో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అయితే ఒకపక్క లీ పరిస్థితి దారుణంగా దిగజరిపోవడం ప్రారంభించింది. నడిచే సామర్థ్యాన్నికోల్పోయాడు. ఆ తర్వాత తినడం, శ్వాస తీసుకోవడం వంటివన్నీ సమస్యాత్మికంగా మారిపోయాయి. కేవలం ఒక చేతి వేలు, కాలి బొటనవేలు మాత్రమే కదిలించగలిగేవాడు.
అంతేగాదు 2020లో కోమాలోకి వెళ్లిపోయాడు కూడా. వైద్యులు ట్రాకియోటమీ చేసి, బతికే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అతడి కుటుంబ సభ్యులకు తెలిపారు కూడా. ఆ సమయంలో అతడి జీవితం అత్యంత కటిక చీకటి అలుముకున్న క్లిష్టతరమైన సమయంగా పేర్కొనవచ్చు. అయితే 2021 ప్రారంభంలో లీ నేలలేని స్మార్ట్ వ్యవసాయం గురిచి తెలుసుకున్నాడు. అది అతడికి కొండంత ధైర్యాన్ని, భరోసాని ఇంచ్చింది. ఆధునిక వ్యవసాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీని అనుసంధానించాలనే ఆలోచనను ఆచరణలో పెట్టాలని స్ట్రాంగ్ఆ నిర్ణయించుకున్నాడు.
ఆఖరికి వెంటిలేటర్‌పై ఉన్నప్పుడు కూడా, అతను ఒక వేలు మరియు ఒక కాలి బొటనివేలితో వర్చువల్ కీబోర్డ్‌ను ఆపరేట్ చేస్తూ.. పూర్తి స్మార్ట్ ఫామ్ కంట్రోల్ సిస్టమ్‌ను విజయవంతంగా సృష్టించాడు. 2017లో అతని తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత లీ తల్లి వు డిమెయ్ అతని సంరక్షణ బాధ్యతను తీసుకుంది. ప్రతి శారీరక పనిలోనూ కొడుకు సూచనలను అనుసరించేది.
అలా కాలక్రమేణ తనకు అస్సలు తెలియని సాంకేతిక నైపుణ్యాలను సులభంగా ఒడిసిపట్టిందామె. సర్క్యూట్లు గురించి తెలియకపోయినా.. కంట్రోల్ బోర్డులను సోల్డరింగ్ చేయడం, నెట్వర్క్ వైరింగ్‌ను ఇన్స్టాల్ చేయడం, సర్క్యూట్లను అసెంబుల్ చేయడం, వ్యవసాయ పరికరాలను నిర్వహించడం వంటి వాటిల్లో మంచి నైపుణ్యం సాధించింది. తన కుమారుడు లీ మార్గదర్శకత్వంలో తల్లి వు మాన్యువల్‌గా రిమోట్ కంట్రోల్డ్ డ్రైవర్‌లెస్ వాహనాన్ని కూడా నిర్మించింది. ఇది వారి ఉత్పత్తులను డెలివరీలు చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేగాదు అతడి తల్లి వుకి సాంకేతిక సూత్రాలు ఏమి తెలియకపోయినా..వైర్లను ఎలా కనెక్ట్ చేయాలని, సిస్టమ్‌ని ఎలా సెటప్ చేయాలో ఆమెకు తెలుసు.
ఇక లీ నిర్మించిన స్మార్ట్ వ్యవసాయం విజయవంతంగా నడుస్తోంది, లాభాలను ఆర్జిస్తోంది. ప్రస్తుతం అతడి జీవితం ఒక కొత్త విజయవంతమైన అధ్యయనానికి నాంది పలికింది. బాల్యమంత అనారోగ్యమయంతో గడిపినా..కనీసం శరీరంలో ఏ భాగాలు కదిలించలేకపోయినా..కేవలం వేళ్ల సాయంతో తన జీవితాన్ని అందంగా నిర్మించాలనుకోవడం మాములు టాలెంట్ కాదు కదూ..!. ఎంత కష్టమైనా సరే ఎదిగే చిన్న అవకాశం చాలు..ఉవ్వెత్తున ఎగిసిపడే స్థాయికి..చేరి విజయాన్నిపాదాక్రాంతం చేసుకోవచ్చని ప్రూవ్ చేశాడు..ఎందరికో అతడి కథ స్ఫూర్తిని కలిగించడమే గాక, మనసుని తాకింది కూడా.
(చదవండి: 91 ఏళ్ల తల్లి అవధులులేని ప్రేమ..! మంచానికి పరిమితమై కూడా..)
Tags : 1