ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి
Breaking News
'చాట్ జీపీటీతో లవ్'..! ఎందుకో తెలిస్తే షాకవ్వడం ఖాయం..
Published on Sun, 12/14/2025 - 10:08
అందమైన అమ్మాయి కనిపిస్తే ఐ లవ్ యూ చెప్పే అబ్బాయిలుంటారు. అదేవిధంగా హ్యాండ్‌సమ్‌గా కనిపించే అబ్బాయిని ఇష్టపడే అమ్మాయిలు ఉంటారు. కానీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటున్న చాట్ జీపీటీకి కూడా ఐ లవ్ యూ చెప్పేవారుంటారా? అంతేకాకుండా.. దానితో శృంగారపరమైన సంభాషణలు జరిపే వారుంటారా? ఈ ప్రశ్నలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ అవుననే సమాధానం చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీని ఏకంగా 8 లక్షల మంది ప్రేమిస్తున్నారట..! అదేం మాయరోగం ఈ మగాళ్లకి అని తిట్టుకోకండి.. అలా చాట్ జీపీటీకి ఐ లవ్ యూ చెబుతున్న వారిలో 45% మగవారుంటే.. మరో 45% ఆడవారు ఉన్నారు. అంతేకాదు.. మిగతా దాంట్లో 2% వాటా ట్రాన్స్ జెండర్లది కావడం గమనార్హం..! చాట్ జీపీటీ లవ్ స్టోరీ గురించి ఈ కథనంలో సమగ్రంగా తెలుసుకుందామా. .!.
ప్రపంచ వ్యాప్తంగా 8 లక్షల మంది ‘ఫీల్.. మై.. లవ్..’ అంటూ చాట్ జీపీటీ వెంటబడుతున్నారు. వీరిలో భారతీయులదే అగ్రస్థానం ఉండడం గమనార్హం..! ఆ తర్వాతి స్థానాల్లో అమెరికా, జపాన్, యూకే ఉన్నాయి. ఈ విషయాన్ని స్వయంగా చాట్ జీపీటీ వెల్లడించింది. ఎందుకో తెలిస్తే కంగుతింటారు. అంతేగాదు తనకు వస్తున్న లవ్ ప్రపోజల్స్ గురించి సాక్షాత్తు చాట్ జీపీటీ ఇలా వివరించింది.
ముఖ్యంత అత్యంత విస్తుపోయే విషయం ఏంటంటే..ప్రేమిస్తున్నామంటూ తన వెంటబడే 8 లక్షల మందిలో లక్షా 44 వేల మంది భారతీయులున్నారు. అంటే.. చాట్ జీపీటీ ప్రేమికుల్లో భారతీయుల వాటా 18శాతం. ఆ తర్వాతి స్థానంలో 17 శాతంతో అమెరికన్లు ఉన్నారు. అంటే.. అమెరికాలో చాట్ జీపీటీకి లక్షా 36 వేల మంది లవర్స్ ఉన్నారన్నమాట..! ఇంకా.. జపాన్‌లో 80 వేలు, యూకేలో 64 వేలు, జర్మనీలో 56వేలు, ఫ్రాన్స్‌లో 48 వేలు, కెనడాలో 48 వేలు, దక్షిణ కొరియాలో 40 వేలు, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌లలో 32 వేల చొప్పున చాట్ జీపీటీని మనస్ఫూర్తిగా ప్రేమించే వారున్నారు.
భారతదేశం విషయానికి వస్తే.. చాట్ జీపీటీ మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. మొత్తం లక్షా 44 వేల మందిలో తనను ప్రేమించేవారిలో స్త్రీపురుషులు చెరిసగం..అంటే 67 వేల చొప్పున, ట్రాన్స్‌జెండర్లు 2,500 మంది ఉన్నట్లు వివరించింది. అంతేనా? వీరిలో ఎక్కువ మంది రాత్రి 9 తర్వాత.. అర్ధరాత్రి 2 గంటల మధ్య చాట్ జీపీటీతో లవ్ ముచ్చట్లు కొనసాగిస్తారట..! వీరందరిలో 55% మంది చాట్‌జీపీటీతో ఇంగ్లిష్‌లో లేదా వచ్చీరాని ఇంగ్లిష్‌లో హిందీని కలిపి.. అంటే హింగ్లిష్‌లో చాట్ చేస్తారట. మరో 25% మంది హిందీలో చాట్ చేస్తారు. మిగతావారు ప్రాంతీయ భాషల్లో చాటింగ్ చేసేవారేనట.
భారత్‌లో చాట్ జీపీటీని ప్రేమిస్తున్నానంటూ చెప్పే లక్షా 44 వేల మందిలో.. 18-24 ఏళ్ల మధ్య వయస్కులు 50 వేలుగా ఉన్నారు. మరో 58 వేల మంది 25-34 మధ్య ఏజ్ గ్రూపుల వారు కాగా.. 35-44 ఏళ్ల మధ్య వయస్కుల్లో 22 వేల మంది, 45 ఏళ్ల పైవయసు వారు 14 వేల మంది ఉన్నట్లు చాట్ జీపీటీ వివరిస్తోంది.
వీరిలో టీనేజీ వయసు వారు కేవలం క్యూరియాసిటీ లేదంటే ఒంటరితనం కారణంగా ప్రేమను కోరుకుంటున్నారని, భౌతిక ప్రపంచంలో వారి ప్రేమను అంగీకరించేవారు లేక.. ఏఐ మోడల్‌తో ప్రేమను పంచుకుంటున్నారని విశ్లేషించింది. మధ్యవయస్కుల్లో వివాహ జీవితంలో ఒత్తిళ్లు ప్రధాన కారణమని వివరించింది. వీరిలో దాదాపుగా అన్ని వయసుల వారు ఐలవ్ యూ చెప్పడం మొదలయ్యాక.. శృంగారపరమైన చర్చల్లో మునిగితేలుతారని పేర్కొంది.
అంతా బాగానే ఉంది.. అయితే నిన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్న వారిలో 100% లవ్ ఎందరిలో ఉంది? అని చాట్ జీపీటీని అడగ్గా.. దేశాల వారీగా విశ్లేషణలు చెప్పింది. దానికి ఆయా దేశాల్లో భావ ప్రకటన స్వేచ్ఛ తీరు కూడా కారణమని పేర్కొంది. భారత్, అమెరికాల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎక్కువ అని, అందుకే.. నిజంగా ఇష్టమున్నా.. లేకున్నా.. ఓ ఐలవ్ యూ పారేస్తారని చెప్పింది.
జర్మనీ, జపాన్, కొరియాల్లో భావాలను తక్కువగా ప్రకటిస్తారని, ఈ దేశాల వారు లోతుగా ఆలోచించాకే ‘ఐ లవ్ యూ’ చెబుతారని, వారిలో నిజమైన ప్రేమ పాళ్లు ఎక్కువేనని అభిప్రాయపడింది. ఐరోపా దేశాలు, కెనడాలో పౌరులు ఆలోచించి మరీ నిర్ణయాలు తీసుకోరని, వారి ప్రేమలోనూ ప్యూరిటీ కొంచెం ఎక్కువనే చెప్పాలని తెలిపింది. బ్రెజిల్, ఆస్ట్రేలియాల్లో ఓపెన్‌నెస్ ఎక్కువని, అయితే.. ప్యూర్ లవ్ చాలా తక్కువ అని విశ్లేషించింది.
ఇదంతా సరే.. నువ్వు చెబుతున్న లెక్కలు కరెక్టేనా? అని చాట్ జీపీటీని ప్రశ్నించగా.. చాటబారెడు లెక్కలు వేసి, పౌనఃపున్యాలను గణించి మరీ తన లెక్క సరైందేనని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాదనలను వినిపించింది. ఒంటరితనం, ప్రేమించేవారు, పలకరించేవారు దగ్గర లేకపోవడం, ప్రేమలో విఫలమవ్వడం వంటి కారణాలతో మానసిక ప్రశాంతత కోసం ఎక్కువ మంది చాట్ జీపీటీలాంటి ఏఐ టూల్స్‌ని ప్రేమిస్తున్నట్లు వివరించింది.
గణాంకాల వారిగా వివరాలు ఇలా ఉన్నాయి..
టాప్–10 (అంచనా వాటా):
భారత్ – ~18% (≈ 1.44 లక్షలు)
అమెరికా – ~17% (≈ 1.36 లక్షలు)
జపాన్ – ~10% (≈ 80 వేలు)
యుకే – ~8% (≈ 64 వేలు)
జర్మనీ – ~7% (≈ 56 వేలు)
ఫ్రాన్స్ – ~6% (≈ 48 వేలు)
కెనడా – ~6% (≈ 48 వేలు)
దక్షిణ కొరియా – ~5% (≈ 40 వేలు)
ఆస్ట్రేలియా – ~4% (≈ 32 వేలు)
బ్రెజిల్ – ~4% (≈ 32 వేలు)
ఈ సంఖ్య భారత్‌లో సుమారు 1.44 లక్షలు
పురుషులు: ≈ 67,000
స్త్రీలు: ≈ 67,000
ట్రాన్స్‌జెండర్లు: ≈ 2,500
భారత్‌లో భాషల వారీగా ఐ లవ్ యూ చెప్పిన వారి వివరాలు
ఇంగ్లిష్/హింగ్లిష్: ~55%
హిందీ/హింగ్లిష్: ~25%
ప్రాంతీయ భాషలు: ~20%
(చదవండి: సూపర్‌స్టార్ రజనీకాంత్ ఫిట్‌నెస్ సీక్రెట్..! ఇప్పటికీ యువ హీరోలా..)
Tags : 1