Chintada Ravi: దేశ ప్రతిష్టను పాతాళానికి తొక్కేసాడు ఇండిగో సంక్షోభంపై రామ్మోహన్ నాయుడును ఏకిపారేసిన చింతాడ రవి
Breaking News
'గుమ్మడి నర్సయ్య'గా శివన్న.. ఎందుకు చేస్తున్నారో తెలుసా..?
Published on Sun, 12/07/2025 - 15:33
ఉమ్మడి రాష్ట్రంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్య జీవితం నేటి తరానికి సినిమా రూపంలో దగ్గర కానుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సింగరేణి మండలం టేకులగూడెంలో సాధారణ జీవితం గడుపుతున్న ఆయన సీపీఐ(ఎంఎల్)తో 1981లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. గ్రామ సర్పంచిగా తన ప్రస్థానం మొదలైంది. ఇల్లెందు ఎమ్మెల్యేగా 1983, 1985, 1989లలోనూ వరుసగా గెలిచారు. మళ్లీ 1999, 2004లో విజయం సాధించారు. సుమారు 25 ఏళ్లుగా పదవిలో ఉన్నప్పటికీ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూ ప్రజలతోనే జీవిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఉండేందుకు సరైన ఇళ్లు కూడా లేదు. కొద్ది పాటి పొలం తప్ప నర్సయ్యకు సొంత ఆస్తులు లేవు. అలాంటిది కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఆయన బయోపిక్‌లో నటించడం విశేషం.

తండ్రి కోసం ఓకే చెప్పిన శివరాజ్ కుమార్
డైరెక్టర్ పరమేశ్వర్ హివ్రాలే గుమ్మడి నర్సయ్య బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. అయితే, శివరాజ్ కుమార్ గుమ్మడి నర్సయ్య బయోపిక్ చేయడానికి ప్రధాన కారణం ఆయన జీవితం తన తండ్రి డా. రాజ్‌కుమార్ సేవా తత్వాన్ని గుర్తు చేయడమే.. నర్సయ్య సాధారణ జీవనశైలి, ప్రజల కోసం చేసిన త్యాగం, నిజాయితీ ఇవన్నీ శివన్నను ఆకర్షించాయి. తన తండ్రి రాజ్‌కుమార్ పేరుతో ఆయన సోదరుడు పునీత్ రాజ్‌కుమార్ ఎన్నో స్కూల్స్ నిర్మించారు. ఆపై కళ్యాణమండపాలు, ఆసుపత్రులు వంటి కార్యక్రమాలు చేశారు. ప్రజల కోసం తమకు చేతనైనంత వరకు చేయడం మాత్రమే వారికి తెలుసు. గుమ్మడి నర్సయ్య జీవితం కూడా అంతే. అందుకే శివన్నకు ఈ బయోపిక్‌లో నటించాలని ఆసక్తి కలిగింది.
ఇరవై రోజుల్లోనే ఫైనల్
గుమ్మడి నర్సయ్య స్క్రిప్టును డాక్టర్ శివరాజ్‌కుమార్‌కు పంపించిన వెంటనే బెంగళూరు రావాలని ఆయన మేనేజర్ నుంచి కాల్ వచ్చినట్లు దర్శకుడు చెప్పుకొచ్చారు. అయితే, కేవలం ఇరవై రోజుల్లోనే శివరాజ్‌కుమార్ గుమ్మడి పాత్రను చేసేందుకు అంగీకరించడంతో పాటు ఒక రోజు షూట్‌లో పాల్గొన్నారని పంచుకున్నారు. గుమ్మడి పాత్రలో కనిపించేందుకు శివరాజ్‌కుమార్ చాలా ఉత్సాహంతో ఉన్నారని ఆయన అన్నారు.

ప్రభుత్వ కార్యాలయం ఎదుట సాదారణ వ్యక్తిలా..
ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా హంగు, ఆర్బాటాలకు తావులేకుండా తన పదవీ కాలమంతా ప్రజల మధ్యే గుమ్మడి నర్సయ్య గడిపారు. ఇప్పటికీ సైకిల్ మీదే ప్రయాణం. బస్సు, ఆటోలలోనే ఎక్కువగా కనిపిస్తారు. ప్రజల కోసం ప్రభుత్వ కార్యాలయం ఎదుట ధరఖాస్తులు పట్టుకొని నిల్చొని ఉంటారు. నియోజకవర్గాల పునర్విభజనతో రెండుసార్లు ఓడిపోయినప్పటికీ తన పార్టీని అంటిపెట్టుకుని నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తూనే ఉన్నారు. ఓటమి చవి చూసిన తర్వాత నేటి తరం నేతలు పార్టీలు మారుతూ ఉంటారు. కానీ, నర్సయ్య మాత్రం ఒకటే పార్టీ.. అదే ఎర్రజెండా నీడలో తన పోరాటం కొనసాగిస్తున్నారు. 25 ఏళ్లు ఎమ్మెల్యేగా చేశారు. ఏనాడు కూడా అవినీతిని తన గుమ్మం వద్దకు చేరనీయలేదు. ఒక రాజకీయ నాయకుడి జీవితానికి ఇంతకంటే ఏం కావాలి. అందుకే కన్నడ స్టార్ హీరో ఆయన బయోపిక్ చేసేందుకు ఒప్పుకున్నాడు.

తెలుగు హీరోలు ఎందుకు చేయలేదు?
తెలుగు హీరోలు ఎందుకు చేయలేదని దర్శకుడిని ప్రశ్నించగా ఆయన ఇలా చెప్పుకొచ్చారు. హీరోలకు కథ నచ్చితే నిర్మాతలు దొరకలేదు. నిర్మాతలు దొరికితే కథకు తగ్గ హీరోలు దొరకలేదు. ఇద్దరు లభిస్తే.. కథలో మార్పులు చేర్పులు సూచించేవారు. ఇలాంటి సినిమాలు తమిళ్, మలయాళంలో ఆడుతాయి కానీ మన దగ్గర నడవవు అన్నట్లు పేర్కొన్నారు. అయితే, చివరకు పాల్వంచకు చెందిన ఎన్.సురేశ్‌రెడ్డి ప్రవళ్లిక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. మన తెలుగు హీరోలకు భారీ బడ్జెట్ ఉండాలి, ఇతర దేశాల్లో షూటింగ్, హీరోయిన్లతో రెండు పాటలు, గ్రాఫిక్స్‌తో భారీ ఫైట్లు ఇలా ఉంటే ఓకే చెప్తారని తెలిసిందే. గుమ్మడి నర్సయ్య లాంటి వ్యక్తి జీవితం మొత్తం చాలా సాధారణంగానే ఉంటుంది. అలాంటప్పుడు ఓకే చెప్తారని ఆశించడం కష్టమే..
Tags : 1