Breaking News

పగడపు దీవులకు.. పడవ ప్రయాణం!

Published on Mon, 11/17/2025 - 10:24

అరేబియా సముద్రంలో దాగిన రత్నం... భారతదేశపు బ్లూ లగూన్‌... అండర్‌ వాటర్‌ అడ్వెంచర్లకు కేరాఫ్‌... ఇలా చెప్పుకుంటూపోతే... పర్యాటకులకు అదొక స్వర్గం. మోదీ అక్కడ అడుగుపెట్టాక క్రేజ్‌ ఓ రేంజ్‌లో పెరిగింది. మీరు ఊహించింది కరెక్టే.. బీచ్‌ ప్రేమికులకు లక్షదీవులు ఇప్పుడు హాటెస్ట్‌ డెస్టినేషన్‌. సోషల్‌ మీడియాలో ఫుల్‌ ట్రెండింగ్‌లో ఉన్న ఈ ప్లేస్‌మా బకెట్‌ లిస్ట్‌లోకి చేరింది. ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్‌ ప్లాన్‌ చేశాం. అయితే, విమానంలో వెళ్లడం రొటీన్‌ అనిపించి.. కొలంబస్‌లా సముద్రంపై సాహసయాత్ర చేస్తే పోలా అనే ఐడియా వచ్చింది? కట్‌ చేస్తే.. మా గుండెజారి అరేబియా సీలో గల్లంతయ్యింది. దేశంలో తొలి లగ్జరీ క్రూయిజ్‌లైనర్‌ ‘కార్డీలియా క్రూయిజెస్‌’లో టూర్‌ ప్యాకేజీ బుక్‌ చేసుకున్నాం. మరి అంతపెద్ద ‘ఎంప్రెస్‌’ క్రూయిజ్‌లో సీ జర్నీ ఎలా ఉంటుంది? అందులో వింతలు విశేషాలేంటి? ఆ అద్భుతమైన కోరల్‌ ఐల్యాండ్స్‌ను షిప్‌లో చుట్టేసి రావాలంటే ఎంత ఖర్చవుతుంది? నేచర్‌ లవర్స్‌ను రా రమ్మని ఊరిస్తున్న లక్షదీవుల కథేంటో తెలుసుకోవాలనుందా? అబ్బురపరిచే పగడపు దీవుల్లో అలా ఈత కొట్టొద్దాం పదండి. 

లెట్స్‌క్రూయిజ్‌!!
కొలంబస్‌ కొలంబస్‌ ఇచ్చారు సెలవూ.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి! అంటూ ముంబై  రైలెక్కేశాం. మా లక్షదీవుల నౌకా యాత్ర నాలుగు రాత్రులు.. ఐదు రోజులు. 11 అంతస్తుల కదిలే లగ్జరీ హోటల్‌లాంటి క్రూయిజ్‌లో ఎంజాయ్‌ చేస్తూ.. అరేబియా సముద్రంలో 1200 కిలోమీటర్ల సాహసయానం చేసి, అద్భుతమైన పగడపు దీవులను చేరుకుంటామని ఊహించుకుంటేనే రాత్రంతా నిద్రపట్టలేదు. ఎట్టకేలకు ముంబైలోని అంతర్జాతీయ క్రూయిజ్‌ టెర్మినల్‌లో అడుగుపెట్టాం. 

క్రూయిజ్‌ బోర్డింగ్‌ ఎయిర్‌΄ోర్టులాగే ఉంటుంది. బోర్డింగ్‌ పాస్, ఆధార్‌ వెరిఫికేషన్, బ్యాగేజీ సెక్యూరిటీ చెకప్‌ పూర్తయ్యాక టర్మినల్‌ నుండి ‘ఎంప్రెస్‌’ క్రూయిజ్‌ ఉన్న బెర్త్‌పైకి అడుగుపెట్టాం. రాజహంసలా సేదతీరుతున్న అంతపేద్ద షిప్‌ను చూసేసరికి ఫోటోలు, సెల్ఫీలతో సందడే సందడి.

అది అరబిక్‌ కడలందం...
షిప్‌లో అడుగుపెట్టగానే ప్రతిఒక్కరూ కళ్లప్పగించి చూసే సెంట్రల్‌ కోర్ట్‌ (ఏట్రియం) నిజంగా హైలైట్‌. గాజు పైకప్పుతో, అద్దాల లిఫ్ట్‌లు, మిరుమిట్లుగొలిపే లైట్లతో మయసభను తలపిస్తుంది. ఎట్టకేలకు సాయంత్రం ఆరు గంటలకు ముంబైకి గుడ్‌బై చెబుతూ ‘ఎంప్రెస్‌’గంభీరంగా కదిలింది. క్రూయిజ్‌ టాప్‌ డెక్‌ (11వ అంతస్తు) నుంచి ఒకపక్క సముద్రం, మరోపక్క మిలమిల మెరిసే ముంబై స్కైలైన్‌ను చూస్తే.. ఎవరైనా సరే ‘అది అరబిక్‌ కడలందం’ అనాల్సిందే! క్రూయిజ్‌ జర్నీ స్టార్ట్‌ అవ్వగానే స్విమ్మింగ్‌పూల్‌ పక్కన ‘తెరే కాలా చష్మా’అంటూ సెయిల్‌ ఎవే పార్టీ డ్యాన్సులతో ఫ్లోర్‌ మొత్తం ఊగిపోతోంది. 

సరదాగా మేం కూడా రెండు స్టెప్పులేసి చిల్‌అవుతూ డీజే పార్టీని ఎంజాయ్‌ చేశాం. స్టార్‌లైట్‌ రెస్టారెంట్లో డిన్నర్‌ ముగించుకుని టెర్రస్‌పైకి అడుగుపెట్టగానే ఒక్క క్షణం ఇది కలా నిజమా అనిపించింది. చిమ్మచీకట్లో చందమామ కనువిందు చేస్తూ.. సముద్రంతో దోబూచులాడుతున్న వేళ... వెన్నెల్లో షిప్‌ కదులుతుంటే... చూసేందుకు రెండు కళ్లూ చాలవు!!

ఫన్‌ .. అన్‌లిమిటెడ్‌!
క్రూయిజ్‌ ప్రత్యేకతల్లో మార్క్యూ థియేటర్‌ అద్భుతం. రెండంతస్తుల్లో 900 మంది కూర్చోవచ్చు. అరే, రోజు అప్పుడే గడిచిపోయిందా అనిపించేలా క్రూయిజ్‌లో అన్‌లిమిటెడ్‌ వినోదం ఆనందంలో ముంచెత్తుతుంది. ప్రత్యేక డ్యాన్స్‌, మ్యూజిక్‌షోలతోపాటు లైవ్‌ బ్యాండ్స్, డీజే సైతం సంగీత ప్రియులను మైమరపిస్తాయి. షిప్‌ మొత్తం ఎక్కడికెళ్లినా మాంచి మ్యూజిక్‌తో ఏదో తెలియని  వైబ్‌ మనల్ని ఉరకలేయిస్తుంది. 

24 గంటలూ జనాల కోలాహలంతో క్రూయిజ్‌లో ఉన్నంతసేపూ ఏదో తిరనాళ్లలో ఉన్నామన్న ఫీలింగ్‌ కలిగింది. మెగా హౌసీ, ట్రెజర్‌హంట్‌.. మ్యాజిక్‌షో.. వీడియో గేమ్స్‌.. లైబ్రరీ.. కిడ్స్‌ అకాడమీ.. ఫోటో షూట్స్‌.. టేబుల్‌టెన్నిస్‌.. స్నూకర్‌.. జిమ్‌.. స్పా.. స్విమ్మింగ్‌ పూల్‌.. రాక్‌వాల్‌ క్లయింబింగ్‌.. ఇలా ఒకటేంటి చిన్నాపెద్దా అందరికీ అంతులేని ఆటవిడుపే!! ఇక జూద ప్రియులను ‘కేసినో రాయల్‌’ రారమ్మంటుంది.

సన్‌రైజ్, సన్‌సెట్‌.. వావ్‌!!
క్రూయిజ్‌ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్‌ అవ్వకూడనివి సన్‌రైజ్, సన్‌సెట్‌. వేకువజామున లేలేత సూర్యకిరణాలు సాగరంపై పడుతూ.. పసిడి వర్ణంలో ధగధగమంటూ కనువిందు చేసే దృశ్యాన్ని చూస్తే మనసు ఆకాశంలో అలా తేలిపోతుంది! ఎర్రని బంతిలా భానుడు అస్తమించే సన్‌సెట్‌ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు!! చుట్టూ సముద్రం.. మధ్యలో క్రూయిజ్‌ తప్ప ఇంకేమీ కనబడని చోట సూర్యోదయం, సూర్యాస్తమయాలను చూస్తే.. నేచర్‌ లవర్స్‌ గుండెజారి అరేబియా సముద్రంలో గల్లంతవ్వాల్సిందే!!

తిన్నోళ్లకు తిన్నంత..!
కార్డీలియా ‘ఎంప్రెస్‌’లో ఫుడ్‌.. భోజనప్రియులకు పండగే! ఉదయం బ్రేక్‌పాస్ట్‌ నుంచి లంచ్, స్నాక్స్, డిన్నర్‌ వరకూ అన్నీ ఫ్రీ. తిన్నోళ్లకు తిన్నంత అనేలా రకరకాల వెరైటీలతో చూస్తేనే కడుపునిండి΄ోయేలా మెనూ ఉంటుంది. వెజ్, నాన్‌వెజ్‌ వంటకాలు.. నోరూరించే డెసర్ట్స్, ఫ్రూట్స్‌ ఉన్నాయి. అన్‌లిమిటెడ్‌ స్టాండర్డ్‌ బెవరేజెస్‌ ప్యాకేజీ (హాట్‌ అండ్‌ సాఫ్ట్‌ డ్రింక్స్, కాక్‌టెయిల్స్, మాక్‌టెయిల్స్, పళ్ల రసాలు) కూడా అన్ని ప్యాకేజీల్లో భాగం.

∙∙ 
దాదాపు 36 గంటల పాటు (రెండు రాత్రులు) క్రూయిజ్‌ జర్నీ చేశాక గేట్‌ వే ఆఫ్‌ లక్షద్వీప్‌గా పిలిచే అగట్టి ఐల్యాండ్‌కు చేరుకున్నాం. ఇక్కడ సముద్ర జలాల కిందంతా కోరల్‌ రీఫ్స్‌ పరుచుకుని ఉండటం వల్ల తీరంలో భారీ షిప్‌లు నిలిపేందుకు వీలుపడదు. ఎంప్రెస్‌కు సముద్రంలో అల్లంత దూరాన లంగరు వేసి.. టూరిస్టులను టెండర్‌బోట్లలో తీరంలోని జెట్టీ వద్దకు చేర్చారు. ఏపుగా ఎదిగిన కొబ్బరి చెట్ల మధ్య నుండి మూడు నిమిషాల్లోనే అవతలి ఒడ్డుకు క్యాబ్‌లో చేరుకున్నాం. అక్కడ  పర్యాటకులకు స్వాగతం పలుకుతూ లక్షదీవుల సంప్రదాయ జానపద నృత్య ప్రదర్శన ‘పరిచకలి’ ఏర్పాటు చేశారు. మేము కూడా కత్తి, డాలు పుచ్చుకుని వారితో కలిసి స్టెప్పులేసి బీచ్‌ ఒడ్డుకు చేరుకున్నాం. అంతే, నోట మాటలేదు. రెప్ప వేయకుండా అలాగే చూస్తుండిపోయాం. అడుగేస్తే మాసి΄ోతుందా అనేంత తెల్లగా మెరిసి΄ోతున్న ఇసుక తిన్నెలను స్వచ్ఛమైన సముద్రపు కెరటాలు తాకుతుంటే దాన్ని వర్ణించడానికి నిజంగా మాటలు చాలవు! క్రిస్టల్‌ క్లియర్‌గా ఉన్న నీలి సంద్రాన్ని చూసి ఆనందంతో గంతులేశాం. 

ఆర్టిస్ట్‌ కుంచె నుండి జాలువారిన వాటర్‌ కలర్‌ పెయింటింగ్‌లా ఉంది ఆ దృశ్యం. లేలేత నుండి ముదురు వర్ణం వరకు రకరకాల నీలి రంగు షేడ్‌లలో ఉన్న అలాంటి సముద్రాన్ని మారిషస్, మాల్దీవుల్లాంటి చోట షూట్‌ చేసే సినిమా పాటల్లో, వీడియోల్లో చూడటమే తప్ప.. ప్రత్యక్షంగా చూసింది లేదు. 

ఒక్కసారిగా అలాంటి ప్రకృతి పెయింటింగ్‌ను చూసేసరికి నోరెళ్లబెట్టాం. లక్షదీవుల సముద్రం కింద పగడపు దిబ్బలు (కోరల్స్‌ రీఫ్స్‌) 4,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పరుచుకుని ఉండటం వల్ల సముద్రపు నీరు అత్యంత స్వచ్ఛంగా మైమరపించే నీలి, ఆకుపచ్చ వర్ణంలో పారవశ్యంలో ముంచెత్తుతుంది. ఎటు చూసినా బ్లూ లగూన్స్‌ కనువిందు చేస్తాయి.

పేరులో లక్ష ఉన్నా...
పేరులో లక్షణంగా లక్ష ఉన్నా మొత్తం దీవులు 36 మాత్రమే. అందులోనూ 10 దీవుల్లోనే ప్రజలు నివశిస్తున్నారు. కేరళ తీరానికి 220–480 కిలోమీటర్ల దూరంలో ముత్యాల్లా పరుచుకున్న దీవుల సమూహమిది. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా భారత తీరాన్ని చేరింది కూడా వీటి మీదుగానే! హిడెన్‌ జెమ్‌ ఆఫ్‌ అరేబియా సీగా పిలిచే ఈ కేంద్ర పాలిత ప్రాంతం మొత్తం విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. 

ప్రస్తుత జనాభా కేవలం 70,000. లక్షదీవుల్లో అడుగుపెట్టాలంటే స్థానిక అధికార యంత్రాంగం జారీ చేసే ఎంట్రీ పర్మిట్‌ తప్పనిసరి. ప్యాకేజీ బుక్‌ చేసుకుంటే వారే అరేంజ్‌ చేస్తారు. ఇక్కడంతా ముస్లింలే. ఎక్కువగా మాట్లాడే భాష మలయాళం, ఆ తర్వాత తమిళం, ఇంగ్లీష్‌ కూడా నడుస్తుంది. అయితే, జెసేరి అనే ప్రత్యేకమైన స్థానిక భాష వీరికి ఉంది. ఇదీ మలయాళంలాగే అనిపించినా ద్రావిడ భాషలన్నీ కలగలిపి ఉంటుంది. లక్షదీవుల్లో అక్టోబర్‌ నుంచి ఏప్రిల్‌ మధ్య వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. టూర్‌కు సరైన సమయమిది.

అగట్టి అంతా కాలినడకనే..
లక్షదీవుల్లో మేము అగట్టి ఐల్యాండ్‌ను పూర్తిగా చుట్టేశాం. మొత్తం దీవుల్లో పొడవైనది (7.6 కి.మీ) ఇదే కావడంతో ఇక్కడ మాత్రమే ఎయిర్‌పోర్టు కట్టారు. దీని వెడల్పు కిలోమీటరే. ఐల్యాండ్‌ అంతా నడుచుకుంటూ తిరిగేయొచ్చు. పైనంతా నీలాకాశం.. తెల్లగా మెరిసిపోయే ఇసుక తిన్నెలు.. ఎటుచూసినా పచ్చని కొబ్బరి చెట్ల తోరణం.. కనువిందు చేసే స్వచ్ఛమైన నీలి సముద్రం, దట్టంగా అల్లుకున్న సుగంధ ద్రవ్యాల వృక్షాలతో ప్రకృతి ప్రేమికులకు ఇదో స్వర్గం. 

సముద్రపు కెరటాల చిరు సవ్వడి తప్ప మరే చప్పుడు వినిపించదు. రంగు రంగుల కోరల్‌ ఫిష్‌ ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి. లక్షదీవుల్లో దొరికే ట్యూనా చేపలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ఫిషింగ్‌ తర్వాత కొబ్బరి పరిశ్రమ ఇక్కడ ప్రధానమైనది. రిసార్టులు, హోటళ్లతో టూరిజం అభివృద్ధి చెందుతోంది. మరో విచిత్రమేంటంటే, ఎక్కడా పక్షులు కనిపించలేదు. సముద్రపు పక్షులు కొన్ని జనావాసం లేని దీవుల్లో (పిట్టి) ఉంటాయట. అందుకే దీన్ని బర్డ్‌ శాంక్చరీగా ప్రకటించారని గైడ్‌ చెప్పారు.

నీలిసంద్రంలో కోరల్స్‌ లోకం..
స్నార్కెలింగ్, స్కూబా డైవింగ్‌.. బనానా బోట్‌ రైడ్‌.. గ్లాస్‌ బోటమ్‌ బోట్‌.. కయాకింగ్‌.. వాటర్‌ స్కీయింగ్‌.. విండ్‌ సర్ఫింగ్‌.. ఇలా అడ్వెంచర్‌ వాటర్‌ స్పోర్ట్స్‌ బొలెడున్నాయి. బీచ్‌లో కాసేపు ఆడుకున్నాక ముందుగా మేము బనానా బోట్‌ రైడ్‌ చేశాం. గాలితో నింపిన ట్యూబ్‌పై లైఫ్‌ జాకెట్లు వేసుకుని కూర్చోవాలి. దీన్ని మరో స్పీడ్‌ బోటు తాళ్లతో సముద్రంలోకి లాక్కెళ్తుంది. 

పావు గంట రైడ్‌ తర్వాత, వేగంగా వెనక్కి తీసుకొచ్చి ఫ్లిప్‌ చేస్తారు. సముద్రంలో పడి΄ోవడం భలే థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. దీని తర్వాత కోరల్స్‌ లోకంలోకి డైవ్‌ చేశాం. రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యనున్న ఫ్లోటింగ్‌ జెట్టీ వరకు బోట్‌లో వెళ్లాలి. అక్కడ లైఫ్‌ జాకెట్, ఫేస్‌ మాస్క్‌ తొడుక్కుని సముద్రంలోకి దూకేయడమే. నీటిపైన తేలుతూ ముఖాన్ని సముద్రంలో ముంచి కిందికి చూడమని డైవర్‌ చెప్పాడు. 

అంతే, ఒక్కసారిగా మైండ్‌ బ్లాంక్‌. కళ్లముందు అద్భుత సాగరలోకం ప్రత్యక్షమైంది. క్రిస్టల్‌ క్లియర్‌ వాటర్‌లో రంగురంగుల కోరల్‌ ఫిష్‌ గుంపులు గుంపులుగా తిరుగుతుంటే... సముద్రం అడుగున నెమ్మదిగా పొదల్లా ఊగే కలర్‌ఫుల్‌ కోరల్‌ రీఫ్ప్‌... అది మరో ప్రపంచం. బ్లూ లగూన్స్‌లో దాగిన పగడపు లోకాన్ని తొలిసారి చూసేసరికి నన్ను నేనే నమ్మలేకపోయా. అక్కడ లోతు 5 మీటర్లే. కోరల్స్‌ మధ్యలో సముద్రం అడుగున పెద్ద తలతో ఉన్న కోరల్‌ ఫిష్‌ ఇసుకలో పొర్లుతోంది. 

ఆకుపచ్చ, నీలం రంగు ప్యారట్‌ ఫిష్‌ ఒకటి నా మాస్క్‌ను ముద్దాడటం మధురానుభూతి. ఇక స్కూబా డైవింగ్‌ వేరే లెవెల్‌. ఒళ్లంతా కప్పేసే వాటర్‌ప్రూఫ్‌ జాకెట్లు, కాళ్లకు ఫ్లాప్స్‌ ధరించి, ఆక్సిజన్‌ మాస్క్‌ తగిలించుకుని, కళ్లకు స్విమ్మింగ్‌ గాగుల్స్‌ పెట్టుకుని, జలచరాల్లా చక్కర్లు కొడుతూ కోరల్స్‌ ప్రపంచంలో ఈదులాడుతుంటే దాన్ని మాట్లలో వర్ణించలేం!!

బొండం రూ.80.. లిక్కర్‌ బ్యాన్‌
యాక్టివిటీలన్నీ అయ్యాక లంచ్‌లో పూర్తిగా స్థానిక వంటకాలను రుచి చూశాం. ప్యారట్‌ ఫిష్, బటర్‌ ఫ్లై ఫిష్‌తోపాటు పీతలు కూడా ఇక్కడ సీఫుడ్‌లో ఫేమస్‌. రెండు అరచేతులంత ప్యారట్‌ ఫిష్‌ (గ్రిల్‌)ను లొట్టలేసుకుంటూ లాగించేశాం. వంటకాలన్నీ కేరళ స్టయిల్‌లోనే ఉన్నాయి. 

దీవులన్నీ కొబ్బరి చెట్లతో నిండి ఉన్నా.. బొండం రేటు రూ.80 అనడంతో అవాక్కయ్యాం. స్థానికంగా ఏదీ పండించరు. ఉప్పు, పప్పు నుంచి సర్వం మెయిన్‌ ల్యాండ్‌ కేరళ నుంచే వస్తాయి. అందుకే రేటు ఘాటుగానే ఉంటుంది. పంచదార కిలో రూ.80 అంట! వారానికోసారి కొచ్చి నుంచి కార్గో షిప్‌లో అన్నీ దిగుమతి అవుతాయి. 

ఇక్కడ లిక్కర్‌ పూర్తిగా బ్యాన్‌. అయితే, అగట్టీకి దగ్గరలోని బంగారం ఐల్యాండ్, రాజధాని కవరట్టిలో మాత్రమే రిసార్టుల్లో టూరిస్టులు, ప్రభుత్వాధికారులకు విక్రయిస్తారు. బహిరంగంగా తాగడం, బయటి నుంచి తీసుకురావడం కూడా నేరమే. రోజంతా రకరకాల జలక్రీడల్లో మునిగితేలి రాత్రి 10 గంటలకు తిరిగి క్రూయిజ్‌లోకి చేరి΄ోయాం. అరగంటలో తిరుగు ప్రయాణం మొదలైంది. మర్నాడు మళ్లీ రోజంతా క్రూయిజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ షోలు, స్విమ్మింగ్, రాక్‌క్లయింబింగ్‌ వంటి యాక్టివిటీలతో గడిచిపోయింది.


∙∙ 
ఇలా టన్నులకొద్దీ మధుర స్మతులను నింపుకుని, అరేబియా సముద్రమంత లోతైన జ్ఞాపకాలను మూటగట్టుకొని ముంబైలో క్రూయిజ్‌ దిగుతుంటే.. ఐదు రోజుల టూరు ఐదు నిమిషాల్లో అయిపోయినట్టు అనిపించింది. ఎలాంటి రణగొణ ధ్వనులు.. కిక్కిరిసిన పర్యాటకులు... బార్లు.. పబ్‌ల వంటివేవీ అక్కడ లేవు. స్వచ్ఛమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతూ.. అంతే స్వచ్ఛమైన నీలి సంద్రాన్ని.. అందులో దాగున్న అబ్బురపరిచే కోరల్‌ ప్రపంచాన్ని.. రంగురంగుల జలచరాలను చూసి మైమరచిపోవాలనుకునే నేచర్‌ లవర్స్‌కు లక్షదీవులు లక్షలాది మధురానుభూతులను అందిస్తుంది! 

ఇండియాలో ఏకైక బ్లూ లగూన్‌లో రకరకాల జల క్రీడల్లో మునిగి తేలాలంటే ఈ పగడపు దీవులకు లగేజీ సర్దేయాల్సిందే. నడిసంద్రంలో సకల సౌకర్యాలున్న కదిలే దీవి లాంటి క్రూయిజ్‌లో అలా చక్కర్లు కొడుతూ నేచర్‌ను ఆస్వాదించడం కూడా జీవితకాల జ్ఞాపకంగా నిలిచిపోతుంది! అంటే ఒకే ట్రిప్‌లో రెండు డెస్టినేషన్లన్నమాట!! మరింకెందుకు ఆలస్యం గెట్‌ సెట్‌ క్రూయిజ్‌!!

ప్యాకేజీల సంగతిదీ..
మధ్యతరగతి నుండి సంపన్నుల దాకా లగ్జరీ క్రూయిజ్‌ జర్నీ చేసేలా రకరకాల రూమ్‌లు, డిస్కౌంట్లు, గ్రూప్‌ ప్యాకేజీలను కార్డీలియా అందిస్తోంది. స్టేట్‌రూమ్‌లకు విండో ఉండదు. ముంబై – లక్షదీవుల రౌండ్‌ ట్రిప్‌.. ఇద్దరు పెద్దవాళ్లకు 4 నైట్స్, 5 డేస్‌ ప్యాకేజీ ధరలు చూస్తే (జీఎస్‌టీ కాకుండా)...
ఇంటీరియర్‌ స్టేట్‌రూమ్‌ స్టాండర్డ్‌: రూ. 1,14,098
ఇంటీరియర్‌ స్టేట్‌రూమ్‌ ప్రీమియర్‌: రూ. 1,32,610
ఓషన్‌వ్యూ స్టాండర్డ్‌: రూ. 1,46.850
ఓషన్‌ వ్యూ ప్రీమియర్‌: రూ. 1,65,362
మినీ సూట్‌: రూ.1,90,994
సూట్‌: రూ.3,05,626
చైర్మన్‌ సూట్‌: రూ.4,82,202
అంటే ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ స్టేట్‌ రూమ్‌కు ఒక్కో వ్యక్తికి రూ.67,317 చార్జీ (ఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్, అన్‌ లిమిటెడ్‌ బెవరేజెస్‌ ప్యాకేజీ, జీఎస్‌టీతో కలిపి) పడుతుంది. ఫైఫ్‌స్టార్‌ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతితో పాటు లక్షదీవుల్లో ఎంజాయ్‌ చేసి రావచ్చు. నేరుగా కార్డీలియా వెబ్‌సైట్‌ (www.cordeliacruises.com) లేదా అథరైజ్డ్‌ ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా టిక్కెట్లు బుక్‌ చేసుకోవచ్చు. 

ప్రయాణికుల సంఖ్య, జర్నీ ఎప్పుడు అనే దాన్ని బట్టి డిస్కౌంట్‌ ఆఫర్లు లభిస్తాయి. కొచ్చి, గోవా నుంచి 3 నైట్స్, 4 డేస్‌ ప్యాకేజీలు (ఇంటీరియర్‌ స్టాండర్డ్‌ స్టేట్‌ రూమ్‌ ఒక్కో వ్యక్తికి రూ.52,000) కూడా ఉన్నాయి. నలుగురు కలిసి ఒక రూమ్‌ బుక్‌ చేసుకుంటే రేటు ఇంకా తగ్గుతుంది. 

12 ఏళ్ల లోపు చిన్నారులకు ఉచిత జర్నీ (బేస్‌ ఫేర్‌ మినహాయిస్తారు, సర్‌ ఛార్జీ, పన్నులు చెల్లించాలి), గ్రూప్‌ బుకింగ్స్‌లో ప్రత్యేక డిస్కౌంట్‌ లభిస్తుంది. గమ్యస్థానాల్లో షోర్‌ ఎక్స్‌కర్సన్‌ (గ్రూప్‌ టూర్‌ ప్యాకేజీ)లకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది. లేదంటే మనం సొంతంగా కూడా రోజంతా తిరిగి మళ్లీ రాత్రికి క్రూయిజ్‌లోకి చేరుకునే ఆప్షన్‌ కూడా ఉంటుంది. 
– శివరామకృష్ణ మిర్తిపాటి 

(చదవండి: ఆ చిన్నారి గురువుకు మించిన శిష్యురాలు..! ఆనంద్‌ మహీంద్రా ప్రశంసల జల్లు..)

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)